Saturday, July 29, 2017

భ్రష్టుపట్టిన వ్యవస్థతో రాజీపడేందుకు సిద్ధపడుతున్నామా






(నిన్నటి -నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ అవ్యవస్థనుఇంకా ఎంతకాలం భరించాలని,వ్యాసానికి ముగింపు)
సర్కారు తమ బాగుకోసమే ఉందని జనం నిజంగా నమ్మితే ఒనగూరే అభివృద్ధికి హద్దులు నిర్దేశించడం ఎవరివల్లా కాదు. నల్లధనాన్ని కట్టడిచేసి ప్రజావిశ్వాసం పొందడమే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం       దేశంలో 70శాతం ప్రజలు రోజుకు రూ.20కు మించి ఖర్చు చేయలేని పరిస్థితుల్లో- అయిదువందలు, వెయ్యి,రెండువేలు రూపాయల నోట్లను ఇబ్బడి ముబ్బడిగా ముద్రించడంలో అర్థం లేదని 'అర్థక్రాంతి' స్పష్టం చేస్తోంది.
                          కోట్ల రూపాయల సొమ్మూ ఓ సూట్‌కేసులో ఇమిడే ఈ పరిస్థితి నల్లధనం కోరసాచడానికి కారణమవుతోంది. ప్రజల అవసరాలను ప్రతిబింబించని కరెన్సీ నోట్ల చలామణీవల్లే లెక్కాపత్రాలకందని భూముల కొనుగోళ్లు, ఆస్తుల క్రయవిక్రయాలు, అవినీతి విస్తరిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పాతిక లక్షల గరిష్ఠ పరిమితిని దాటి ఒక్కో అభ్యర్థి పదికోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టే స్థితికి చేరారంటే గరిష్ఠ విలువగల కరెన్సీనోట్ల విచ్చలవిడి చలామణీయే కారణం. నల్లధనం రూపేణా సమాంతర ఆర్థికవ్యవస్థ స్థిరపడిన దేశంలో కనీసం 70శాతం ప్రజలు అన్ని అవసరాలకూ ప్రైవేటు వడ్డీవ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యవస్థలపట్ల ప్రజల్లో నమ్మకం క్రమంగా కొడిగడుతోంది. ప్రభుత్వ విధాన లోపాలవల్ల వ్యవస్థీకృతమైన ఈ అవినీతి బాధ్యతలేని సమాజాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో మేటవేసిన అవినీతి, అక్రమాలను నిర్మూలించే పునాది స్థాయి పరిష్కారాలతో, విశిష్ట సిద్ధాంతంగా ముందుకొచ్చిన 'అర్థక్రాంతి'ని అక్కున చేర్చుకోవడం నేటి చారిత్రక అవసరం.

                మానవ నైజంలోనే స్వార్థం ఉందని సరిపెట్టుకుంటూ, దారితప్పిన వ్యవస్థలతో సర్దుకుపోయే నైరాశ్యాన్ని వదిలించుకోవాల్సిన తరుణమిది. అవినీతిని సహజసిద్ధమైనదిగా తీర్మానించిన పరిస్థితివల్లే లక్షల కోట్ల రూపాయల నల్లధనం యథేచ్ఛగా దేశపు సరిహద్దులు దాటుతోంది. రెక్కల కష్టంతో దేశప్రజలు సృష్టించిన సంపద పూర్తిగా జాతి సంక్షేమానికే వినియోగమయ్యేలా చూడటం ఇప్పుడు అందరి బాధ్యత. దోపిడిని కొత్త రూపాల్లో ప్రోత్సహిస్తూ, అసమానతలను పెంచిపోషించే భ్రష్టుపట్టిన వ్యవస్థతో రాజీపడేందుకు సిద్ధపడుతున్నామా అన్న ప్రశ్నకు జవాబు వెదుక్కోవాలిప్పుడు. నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ అవ్యవస్థను ఇంకా ఎంతకాలం భరించాలని ప్రశ్నించుకోవాల్సి ఉందిప్పుడు. ఇట్లా బతకడానికి సిద్ధంగాలేమని సమాధానం చెప్పుకొనే పక్షంలో- తప్పులను సరిదిద్దే ప్రత్యామ్నాయ వ్యవస్థ దిశగా వడివడిగా అడుగులు కదపడం తప్పనిసరి. ఆ క్రమంలో నల్లధనానికి ఏ కోశానా ఆస్కారమివ్వకుండా పన్ను విధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న అర్థక్రాంతి... చీకట్లను చీల్చుకొచ్చే సూర్యతేజం! జాతికి హితం చేకూర్చే ఈ విధానాన్ని ఇంకా చర్చల దశలోనే నాన్చకుండా సత్వరం పట్టాలకెక్కించినప్పుడే దేశప్రజలకు సిసలైన సంక్రాంతి!
'అర్థక్రాంతి' అంటే ఏమిటి?
1. పన్నుల వ్యవస్థలో సమూల మార్పులను సూచిస్తున్న ఆర్థిక సిద్ధాంతమిది.
2. దిగుమతి సుంకాలు మినహా దేశంలో అమలులో ఉన్న అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయాలి.
3. అన్నిరకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి. ప్రతి లావాదేవీపైనా రెండు శాతం పన్ను
4. ప్రతి సంవత్సరం కొత్తగా పెరిగే సంపద పైనా రెండు శాతం పన్ను.(ప్రతీ ఆదాయం ఏదోలా సంపద గా మారాల్సిందే)
5. యాభైరూపాయలకు మించి విలువగల కరెన్సీ నోట్లన్నింటినీ ఉపసంహరించుకోవాలి.
6. రూ.2000లకు మించిన లావాదేవీలపై చట్టబద్ధ పరిమితి.
దీనివల్ల ప్రయోజనాలేమిటి?
1.ప్రభుత్వాదాయం వూహాతీతంగా పెరిగి ఖజానా కళకళలాడుతుంది.
2. ఆదాయపన్ను రద్దువల్ల ఉద్యోగులకు పూర్తి జీతాలు చేతికొస్తాయి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.
3. పన్నుల మోత లేనందువల్ల పెట్రోలు, డీజిలు సహా అన్ని వస్తువుల ధరలూ సుమారు 40శాతం మేర తగ్గుతాయి.
4. పన్నుల ఎగవేత వూసే ఉండదు. నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థలు సాకారం అవుతాయి.
5. అధికవిలువ గల కరెన్సీ నిలిచిపోతుంది. ఫలితంగా దొంగనోట్ల చలామణికి అవకాశమే ఉండదు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card