ఋష్యశృంగులవారు విషయం అవగతమైన వారై
“మహర్షి! ఈ కుర్ర రిషి
తన భాధని సుదీర్ఘంగా
శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలా సాగతీస్తూ వెల్లగక్కాడు. తమరు మాత్రం ఎన్నాళ్ళు ఆ శ్రీ హరి కధలు
చెబుతారు, బి.గోపాల్
బాలకృష్ణ తో వరసగా సినిమాలు తీసినట్టు. పాపం వీళ్ళ కోసం ఒక సరి కొత్త కధ
చెప్పండి.” అని వివరించారు.
శుకమహర్షి చిరునవ్వుతో చెప్పనారంభించారు.
పూర్వం ఒకానొక మహారణ్యంలో జంతువులన్నీ ఒక
గొప్ప ఉత్సవాన్ని జరుపుంటున్నాయి. ఆ ఉత్సవంలో లేని వింతలు,విశేషాలు లేవు. ఆ ఉత్సవానికి దేవతల వద్ద
ఉండే జంతువులని, మృగాలని
పిలిచారు. వీరిని సంతోషబెట్టి తమపనులు దేవతలకి వీరిద్వారా విన్నవించవచ్చని
ఆలోచన. విందులు, వినోదాలు
ఘనంగా జరుగుతున్నాయి.
సురాపానం (అదే లెండి కల్లు తాగాయి) చేసిన జంతువులన్నీ పిచ్చి ఆననదంతో గెంతులు
వేస్తున్నాయి.అతిధులుగా వచ్చిన జంతాగ్రేసరులనందరినీ ఘనంగా సత్కరిస్తున్నారు. సింహాలని,
పులులని, ఏనుగులని అలా అందరిని ఘనంగా సత్కరించారు.
తన సకల పరివారం తో సహా వేంచేసిన మూషికరాజుని మాత్రం ఎవరూ గుర్తించలేదు.
దానితో తన పరివారం ముందు జరిగిన అవమానాన్ని భరించలేని మూషికరాజు ఆగ్రహంతో
ఊగిపోతూ “లోకంలో
ప్రధమ పూజ్యుడు, విఘ్నరాజు
వాహానాన్ని నేను. ఆ మహాదేవుని కి సమస్త లోకాలని చూపేది నేనే. మరి నేను లెజెండ్ ని
కాదా? ఇప్పుడే
తేలిపోవాలి ఎవరు లెజెండు, ఎవరు
సెలబ్రిటీ?”
ఇంతలో ఎవరో వజ్రోత్సవాలు అయిపోయాక మోహన్ బాబు గారిని అడిగి
చెబుతామన్నారు.
“మీరు పుస్తకాలు అచ్చేసే వరకు ఆగే ఓపిక లేదు. ఇప్పుడే తేల్చండి.”
అప్పుడు అక్కడుండే జంతువులన్నీ అవహేళన చేసాయి. ఎవరూ లెక్క చేయలేదు.
“నీకు అంత గౌరవం
కావాలంటే నీ ప్రభువినే అడుగు పో. ఇన్నాళ్ళు మోసినందుకు ఆయన నీకు ఏమాత్రం గౌరవమిస్తారో చూస్తాం”
అని హేళన చేసాయి. ఆ
ఆగ్రహంతో మూషికరాజు
తన పరివరానికి అక్కడ ఉత్సవాన్ని నాశనం చేయమని ఆదేశించి సరాసరి వినాయకుని
వద్దకు వెల్లింది.
జరిగినది మొత్తం చెప్పి “తమరు
లోకంలో ఉన్న భక్తులందరి కీ వరాలు ఇస్తారు. ఇన్నాళ్ళుగా నాకు మాత్రం ఒక్క వరం కూడా
ఇవ్వలేదు. ఈ రోజు వరం ఇచ్చి తీరవలసినదే” అని పట్టుబట్టింది. కాదనలేని స్వామి
కోరుకోమన్నాడు.
“ఇకనించి తమరు పూర్తిగా నా మీదే ఆధారపడి
ఉండాలి. ప్రపంచం మొత్తం నా మీదే ఆధారపడి నడవాలి. నన్నందరూ
అందలమెక్కించాలి. నేను లేకపోతే ప్రపంచం లో పనులన్నీ ఆగిపోవాలి.” అని ఆవేశంతో చుంచు గోల చేసింది.
స్వామి
ఇరుకున పడ్డాడు. కాదంటే రేపటినుంచి నిర్వాహనుడయిపోతాడు. హోండా లు,
ఆడీలు వాడేంత
ధనవంతుడు కాడు. భిక్షాటన చేసే తండ్రి, ఇల్లేమో శ్మశానం. ఇప్పుడు వాహనంకూడా లేకపోతే సాటి దేవతల
ముందు పరువుపోతుంది.
“సరే మూషికా, అట్లే కానివ్వు. వరం ఇస్తున్నా తీసుకో.
నీవు కోరినట్టు కలియుగంలో ప్రపంచం మొత్తం నీ ఆకారపు మూర్తులని చేపట్టి నీ మీదే
ఆధారపడి నడుస్తుంది.
ఇకపోతే నాకు ఎలాగూ నీవే ఆధారం. కాబట్టి ఇకపైన నీ మూర్తులని చేపట్టిన మానవులు నా వంటి రూపాన్ని
పొందుతారు. అనగా బానపొట్ట తో నా వలెనే కనిపిస్తారు. కావున నేనే నీ పై
ఆధారపడినట్టు నీకు సంతృప్తి కలుగుతుంది.” అని వరమిచ్చాడు. ఈవిధంగా కధని పూర్తి చేసి శుకమహర్షి, ఋష్యశృంగులు సెలవుతీసుకొని వెళ్ళిపోయారు.
అదండీ
సంగతి ఆ వరం వల్ల ప్రపంచం ఈ రోజున మౌస్ మీద ఆధారపడి నడుస్తుంది. మౌస్
చేతపట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి పొట్ట సంక్రమించింది. ఈ విషయం తెలీక నానా
హైరానా పడి మా వాళ్ళు జిమ్ము లనీ, యోగా
అనీ చాలా చేస్తారు. అయినా ప్రయోజనం లేదు. పై పెచ్చు ఈ టెన్షన్
వల్ల జుత్తు ఊడిపోవడమనే కొత్త సమస్య. అందుకే ప్రియతమ కంప్యుటర్ వాడేవారు ( మరియు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు)
జరగాల్సిందే జరుగుతుంది. మీరు అనవసర హైరానా పడకండి. జై మూషికా జై జై మూషికా
అని సరిపెట్టుకోండి..
–
(ఇది పూర్తిగా కల్పితము ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో
గానీ,ఎవరికీ అనుకరణ గానీ కాదు కేవలం హాస్య ప్రధానంగా వ్రాయటం జరిగింది)
---------------------------- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment