Thursday, May 31, 2018

‘సూర్యకాంతం’ సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది

‘సూర్యకాంతం’ సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది
తనముందే కాదు తన తర్వాత కూడా ఎవరు లేకుండా  చేసుకుని ,శిఖరాగ్రాన నిలబడిన ప్రపంచంలోనే ఏకైక సినిమా నటి
 రెండు రోజుల క్రితం ‘గుండమ్మకథ’ సినిమా టీవీ లో చూసాను.సూర్యకాంతం నటన హావభావాలు కోసమే చూసా.సినిమా ఒక వినోద సాధనం. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు.
శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.
అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.
అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).
అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.
నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం అంటే అర్ధం గయ్యాళి కాదు.తెలుగు వారి అలా అనుమానిస్తున్నారు అంతే . ఖచ్హితంగా అనుమానమే అభిమానం మాత్రం కాదు ఎందుకంటే ఇన్నిరోజుల తర్వాత కూడా తమపిల్లలకి ఆ పేరు(అంత మంచి పేరు) పెట్టటానికి కూడా తెలుగు వారు ఇష్ట పడటలేదు.( లేదా భయపడతున్నారు) కాబట్టి.



------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681







Monday, May 28, 2018

టీవీలో ........




ఇక ఎలాగూ నిద్ర పట్టేలా లేదు అని వార్తలు విశేషాలు తెలుసుకుందామని టీవీ ఆన్ చేశాను.
మీ టీవీ చానెల్‌లో మాలో ఎవరు లూటీశ్వరుడు?” కార్యక్రమం వస్తూంది. కండక్ట్ చేస్తూంది సినీ నటుడు రాగార్జున.
ఇప్పుడు 1000 రూపాయల ప్రశ్న. మగాళ్ళు ఈ కింది దుస్తుల్లో ఏం వేసుకోరు?
1) పంచ 2) ప్యాంట్ 3) లుంగీ 4) చీర
మీ దగ్గర కేవలం ముప్పై సెకండ్ల టైం మాత్రమే ఉంది.అంటున్నాడు రాగార్జున కంటెస్టెంట్‌తో.
చీర,” టక్కున చెప్పింది కంటెస్టెంట్.
అ హ హ! భలే చెప్పారు! అంత వేగంగా ఎలా చెప్పారు? మీకు జెనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువనుకుంటాను. అ హ హ!
నా మొహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కద! మా ఇంట్లో మగాళ్ళు ఎవరూ చీర కట్టుకోరు.
అ హ హ. పైగా మీకు బోలెడు సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా ఉంది. అ హ హ.
నేను చానెల్ మార్చాను.
వీ.సీ.ఆర్ ఆవేశంగా జర్నలిస్టులతో మాట్లాడుతున్నాడు. ఎంత భయం లేకుంటె మా ఎం.ఎల్.ఏ.లవి పాచి కల్లు తాగిన మొహాలంటరు? ఎం.ఎల్.ఏ.లే కాదు మా పార్టీల సన్నాసులు కూడా నిఖార్సైన కల్లే తాగుతరు. సాయంత్రం మా పార్టీ ఆఫీస్‌కి వస్తే వాళ్ళకే తెలుస్తుంది.
ఐనా మా ఎం.ఎల్.ఏ.లు సార్వభౌమాధికారంఅనే పదాన్ని సక్కగా పలకలేదు. గంతే కద. ఈ పెద్ద పెద్ద పనికిమాలిన పదాలు మాకు అవసరం లేదు. ఇప్పటి సందిసార్వభౌమాధికారంబదులు పెద్ద పెత్తనంఅని చెప్తం. ఖేల్ ఖతం. దుకునం బంద్!
మళ్ళీ చానెల్ మార్చాను.
డ్యాన్స్ వాజా డ్యాన్స్ప్రోగ్రాం వస్తుంది. ఒక జంట అప్పుడే తమ పెర్‌ఫార్మెన్స్ ముగించినట్టున్నారు. ముగ్గురు జడ్జెస్ ముందు నిలబడ్డారు. ఒక జడ్జ్ వాళ్ళని కూకలేస్తున్నాడు.
సారీ మీకు 5 కంటే ఎక్కువ పాయింట్లు ఇవ్వలేను. విజయమాలిని పాటకు అంత మర్యాదగా డ్యాన్స్ చేస్తారా? ఆ ఊపు ఏదీ? ఆ కులుకులు ఏవీ? ఇదేమన్న ఫ్యామిలీ అంతా చూసే ప్రోగ్రాం అనుకున్నారా?”
ఆ జంట సారీ మాస్టార్!అని ఘొల్లుమన్నారు.
చానెల్ చేంజ్ చేశాను.
గంగమ్మ గారి గౌడి గేదెసీరియల్ వస్తూంది. ఒక మోతుబరి ఆడ లేడీ పశువుల కొట్టంలో కూర్చుని తన గేదెలను శుభ్రంగా తోముతూంది.
అదేంటి గంగమ్మ గారూ, ఇంత మంది ఉండగా మీరు చేయి చేసుకుంటున్నారు? కోట్లకు అధిపతి అయిన మీరు ఇలా బర్రెలని బరా బరా తోమేస్తూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా,” మొర పెట్టుకుంటున్నాడు ఒక పాలేరు.
మనం ఎప్పుడు మన మూలాల్ని మరిచిపోకూడదురా. ఈ గేదెల వల్లే, నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. కనీసం ఇవి కంపు కొట్టకుండా చూసుకోవడం నా ధర్మం రా, నా ధర్మం!ఆవేశంగా అంటూంది గంగమ్మ.
మెల్లగా తల నొప్పి స్టార్ట్ అయ్యింది నాకు. అసలు ఒక్క మంచి ప్రోగ్రాం కూడా రాదా ఈ టీవీలో?
భయపడుతూనే ఒక న్యూస్ చానెల్ పెట్టాను.
ప్రధాన మంత్రి సురేంద్ర మోడీ ప్రస్తుతం భీటాన్ పర్యటనలో ఉన్నారు.
ఎంత మంచి వార్త! నైచా, డిబెట్‌ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాక, పర్వత సానువులను అంటపెట్టుకుని ఉన్న ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. దాని ఫలితంగా రవాణా వంటి వ్యవస్థలు కూడా వెనకపడ్డాయి. చాలా చోట్ల బార్డర్ చేరుకోవాలంటే రోజుల తరబడి కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైపు నైచా తమ దేశంలో, బార్డర్ పొడుగునా రైలు పట్టాలు, రోడ్లూ నిర్మిస్తూ తమ సరిహద్దులని మరింత పటిష్టం చేసుకుంటూంది. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే జంబూ ద్వీపం, భీటాన్ కలిసి పని చేయడం ఎంతైన అవసరం.
నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మా ఆవిడ గొంతు వినిపించింది, “ఈ సురేంద్ర మోడీకి పని పాటా లేదనుకుంటాను. ఆ దిక్కు మాలిన భీటాన్‌కి ఎందుకు వెళ్ళడం? సోది ఆపి, గంగమ్మ గారి గౌడి గేదె సీరియల్ పెట్టండి,” అంటూ.
నేనూ అప్రయత్నంగా నిట్టూర్చాను.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Sunday, May 27, 2018

‘లింకన్’ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ‘గాంధీజీ’ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని ‘మండేలా’ అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు







‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అనే అంశం మీద వెతుకుతూ   Invictus అనే సినిమానుంచి కొన్ని క్లిప్పులు చూశా. కొన్ని నెలల కిందట. ఇన్విక్టస్ పూర్తి సినిమా వెంటనే చూడాలన్న కుతూహలం కలిగింది. కానీ అనుకోకుండా  నిన్న రాత్రి  యుట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. అది మీరంతా కూడా చూస్తే బావుంటుందనిపించింది.

Invictus (2009)క్లింట్ ఈస్ట్ వుడ్ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా. నెల్సన్ మండేలా (1918-2013)జీవితంలోని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. మేధావులు ఆ సినిమాని well scripted movie అన్నారు. నాకు ఆ స్క్రిప్టు  ఎంతగా నచ్చిందంటే,  leadership మీద పాఠాలు చెప్పడం కోసమే క్లింట్ ఈస్ట్ వుడ్ ఆ సినిమా తీసాడా అన్నంతగా.

సినిమాలో ఇతివృత్తం చాలా సరళం. మండేలా దక్షిణాఫ్రికాకి ప్రజాస్వామికంగా తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటప్పటికి, దక్షిణాఫ్రికా చరిత్ర ఆ కొత్త జాతీయరాజ్యాన్ని భయపెడుతూ ఉంది. గత అనుభవాల వల్ల, కొన్ని శతాబ్దాలుగా శ్వేతజాతీయులు పాటించిన వర్ణవివక్షవల్ల నల్లజాతివాళ్ళు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నారు. పొరుగు ఆఫ్రికా దేశాల్లో, మొజాంబిక్, జింబాబ్వేల్లో సంభవించినట్టుగా తమమీద కూడా ఊచకోత మొదలవుతుందని తెల్లవాళ్ళు భయభ్రాంతులై ఉన్నారు. విమోచన పొందిన వెంటనే తక్కిన ఆఫ్రికా దేశాల్లో జరిగినట్టే దక్షిణాఫ్రికా లో కూడా అంతర్యుద్ధం సంభవించకతప్పదనే ప్రపంచమంతా భావిస్తూ ఉన్న సమయం.

శ్వేతజాతి ఒక నల్లవాడిమీద చెయ్యగల అత్యాచారానికి మండేలా ఒక పూర్తి ఉదాహరణ. 27 సంవత్సరాల తరుణజీవితాన్ని చిన్న జైలుగదిలో గడపవలసివచ్చిన అనుభవం అతడిది. అందుకతడు ఎటువంటి ప్రతీకారం తీర్చుకున్నా ఎవరూ అతడిని తప్పుపట్టలేరు. కాని సరిగ్గా ఆ క్షణంలోనే, ఆ కీలక ఘట్టంలోనే తన దేశమొక ఇంద్రచాపదేశం కావాలనీ, నల్లవాళ్ళూ,తెల్లవాళ్ళూ అన్న భేదం లేకుండా, దక్షిణాఫ్రికా అనే ఒక నవజాతీయరాజ్యం అవతరించాలనీ మండేలా కోరుకున్నాడు. అందుకు గతాన్ని మర్చిపోవడమొక్కటే మార్గమని నమ్మాడు. నిన్నటిదాక తన శత్రువుగా ఉన్న మనిషిని క్షమిస్తే తప్ప నేడతడు తన సోదరుడిగా మారడనీ, క్రీస్తు చెప్పిన reconciliation నిజంగా ఆచరణలో పెట్టవలసిన సమయమొచ్చిందనీ ఆయన విశ్వసించాడు.

అటువంటి సమయంలో తనకి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అట్లాంటి ఒక అవకాశాల్లో 1995 లో జరిగిన ప్రపంచ కప్ రగ్బీ మాచ్ కూడ ఒకటి. రగ్బీ ఆట ద్వారా ఆయన కేవలం ఒక రాజకీయ పరిష్కారమే కాదు, సినిమాలో తన కార్యదర్శి బ్రెందా తో చెప్పినట్టుగా 'ఒక మానవీయ పరిష్కారాన్ని 'కూడా రాబట్టాడాయన.

సినిమా చూస్తున్నంతసేపూ మనకి గాంధీ, అబ్రహాం లింకన్ వంటి నాయకులు గుర్తొస్తూ ఉంటారు.కాని మరో విషయం కూడా స్ఫురిస్తూ ఉంటుంది. లింకన్ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. గాంధీజీ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని మండేలా అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు, నిలబెట్టగలిగాడు. ఈ సాఫల్యం బహుశా కాలగతిలో మానవజాతి సాధించుకోగలిగిన మానసిక పరిణతి అనుకోవలసి ఉంటుంది.

 ఎదో పుస్తకంలో ఒక రచయత( పేరు గుర్తులేదు)  నాయకత్వంలో అయిదు స్థాయిలుంటాయని చెప్తూ, మండేలాని level 5 నాయకత్వానికి ఒక పాఠ్యగ్రంథంలాంటి ఉదాహరణగా పేర్కొన్నాడు. మొదటిస్థాయి నాయకుడు తనవరకూ తన పనితాను బాగాచేసుకుపోతాడనీ, రెండవస్థాయి నాయకుడు నలుగురితోనూ బాగా పనిచేయించగలడనీ, మూడవస్థాయినాయకుడు వనరుల కోసం చింతిస్తూ కూర్చోడనీ, అతడు తనకు తనే ఒక పెద్ద వనరుగా మారతాడనీ చెప్తూ, ప్రధానంగా నాలుగువ స్థాయి, అయిదవస్థాయి నాయకుల్ని పోల్చి చెప్పాడు. నాలుగవస్థాయి నాయకులు సాధారణంగా నాయకులుగా ప్రపంచమంతా కీర్తించే నాయకులనీ, పత్రికల ముఖచిత్రాలుగా, ఇంటర్వ్యూలకోసం ప్రపంచం ఎగబడే నాయకులనీ, కాని వాళ్ళతో సమస్య, వాళ్ళు పక్కకు తప్పుకోగానే వాళ్ళు అంతదాకా నిర్మించిన వ్యవస్థలు కుప్పకూలిపోతాయనీ, కాని అయిదవ స్థాయి నాయకులు పక్కకు తప్పుకున్నా కూడా వాళ్ళు నిర్మించిన వ్యవస్థలు చెక్కుచెదరవనీ అన్నాడు.

Invictus చూడండి.( యుట్యూబ్ లో దొరుకుతుంది)మీ పిల్లలతో, లేదా మీ మిత్రులతో. చూసాక చర్చించండి, మండేలా లోని నాయకత్వలక్షణాలు, వివేకం, దూరదృష్టి, దేశప్రేమ, మానవీయత - ఆ సినిమా జరుగుతున్నంతసేపు దర్శకుడు ఆ పాత్రని ఎట్లా ఆవిష్కరించాడో గుర్తుపట్టండి, నాతో కూడా పంచుకోవాలనుకుంటే, మీ అభిప్రాయాలు పోస్ట్ చెయ్యండి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, May 25, 2018

“దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా?


నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. దీర్ఘాయుష్మాన్ భవఅని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.
ఖచ్చితంగా పెరుగుతుంది .ఇదే ప్రాచీనులు ఋజువు కూడా చేసారు. వచ్చిన  చిక్కల్లా దీవించే వారికి ,దీవెనలు పొందేందుకు , ఆ శక్తీ , అర్హత వుండాలి
(ఈ వ్యాసం ‘అరణ్యస్పందన ‘నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా|| అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)

శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతిఅనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతంఅని చెప్పబడించి. నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలిఅని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. గుడ్ మార్నింగ్అని చెప్పడం, “గుడ్ నైట్చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.
బ్రతికి యుండిన శుభములు బడయవచ్చుకాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం.
 ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||
అని చెప్పబడింది. అంటే ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతేనుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. ఏది నిజంమనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న.
 ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.
లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థంఅని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతిఅంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.

Address for Communication

Address card