Thursday, July 20, 2017

ఈ వ్యవస్ధ శ్రామికులను దోచి సంపన్నులను మేపుతుంది



ఈ వ్యవస్ధ శ్రామికులను దోచి సంపన్నులను మేపుతుంది

               భారత పారిశ్రామికవేత్తలకు, ధనికవర్గాలకు, చెల్లించే రాయితీలు తో సబ్సిడీలు పోలిస్తే జనానికి చెల్లించేది తక్కువ .   సబ్సిడీలు ఇవ్వడం వాస్తవానికి సమస్య కాదు. అవి దారి తప్పడమే అసలు సమస్య. ఈ సంగతి ప్రభుత్వాలూ అంగీకరిస్తాయి. దారి తప్పుతున్న ఉదాహరణలు లెక్కలేనన్ని బైటపడడంతో అంగీకరించక వాళ్ళకు తప్పలేదు మరి.
                 ఇలా అధికభాగం దారి తప్పే సబ్సిడీలపై ఏడ్చేవాళ్లు కంపెనీలకు ఇస్తున్న కోట్ల రాయితీల గురించి నోరెత్తరు. ఇందులో సగం వసూలు చేసినా మన ఫిస్కల్ డెఫిసిట్ చాలా తగ్గుతుంది. ఇవి కాకుండా కంపెనీలకు దాదాపు ఉచితంగా భూములు పంచుతారు. అదేమంటే పారిశ్రామిక వృద్ధి అక్కర్లేదా అని అడుగుతారు. కానీ ఇలా తీసుకున్న భూములు తాకట్టుపెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని వాటినీ ఎగవేయడమే సో కాల్డ్ పారిశ్రామికవేత్తలు చేసే పని. దానివల్ల బ్యాంకుల్లో ఎన్.పి.ఏ లు పెరుగుతాయి. వాటిని వసూలు చేయడం మాని ఒక శుభముహూర్తాన రద్దు చేసేస్తారు. ఎన్.పి.ఏ లు జీరో చేశామని గొప్పగా ప్రకటించేస్తారు. ఆ సొమ్ము ఎవరిది? జనానిది లేదా ప్రభుత్వానిది. ఇలాంటి లీకేజీలు వ్యవస్ధలో అడుగడుగునా కనిపిస్తాయి.
                              సహజవనరుల దోపిడిని అరికడితే సబ్సిడీలు అవసరం లేదా అన్నది సందర్భ సహితం కాదు. వాస్తవ ఉత్పత్తి ధరలకు, ప్రజల కొనుగోలు శక్తికి మధ్య ఉండే అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఇలా ఇచ్చే సబ్సిడీల మొత్తం ప్రజల నుండి వసూలు చేసే పన్నుల మొత్తమే తప్ప ఎక్కడినుంచో రాదు. అనగా ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు ఇవ్వడమే. కానీ ఇలా తిరిగి ఇచ్చే మొత్తం లక్ష్యిత వర్గాలకు కాకుండా దోపిడి వర్గాలకు చేరడమే సమస్య. ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుంది. అది మళ్ళీ ప్రభుత్వానికే చేరుతుంది. కానీ ధనికవర్గాలు కాజేయడం వల్ల అది నల్ల డబ్బుగానూ, స్విస్ బ్యాంకుల్లోనూ పేరుకుపోతుంది. మళ్ళీ ప్రభుత్వం వద్దకు రాదు.
                             కనుక సమస్య మూలం వ్యవస్ధలోనే ఉంది. ఈ వ్యవస్ధ శ్రామికులను దోచి సంపన్నులను మేపుతుంది. అనగా ఆదాయ పంపిణీ విలోమానుపాతంలో ఉంది. ఆదాయ పంపిణీని సవరించి సక్రమం చేయాలి. లేకపోతే పేద, ధనిక అంతరం అలవిగానంతగా పెరుగుతూ పోతుంది. ప్రజలు స్వయంగా సామూహిక చర్యలకు దిగేవరకూ ఇది కొనసాగుతుంది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card