Tuesday, July 04, 2017

జీయస్టీ చట్టం ‘0’ బిజినెస్ (అనధికార వ్యాపారాన్ని)ని ఆపగలుగుతుందా ....?



   
జీయస్టీ చట్టం ‘0’ బిజినెస్ (అనధికార వ్యాపారాన్ని)ని ఆపగలుగుతుందా ....?


                 వస్తుసేవల పన్ను వ్యవస్థ నిబంధనలు ఎంత కఠినంగా వున్నప్పటికీ అనధికార వ్యాపార కార్యకలాపాలు (‘0’ బిజినెస్ ) ఆగిపోవు. ఉదాహరణకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న ఒక సంస్థకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేసేందుకు సృష్టించిన ఈవే బిల్లు మూడు రోజులపాటు చెల్లుబాటు అవుతుంది.  దీంట్లో ఉన్న లోపం ఒక ఆడిటర్ గా నేను మాట్లాడకూడదు, కానీ అనుభవజ్ఞులైన వ్యాపారస్తులకి ,అధికారులకి తెలుసు

           మంచి ఉద్దేశంతో చేపట్టిన పెద్దనోట్ల రద్దు(డీమానిటైజేషన్‌), బ్యాంకు సిబ్బంది ఉపేక్ష మూలంగా ఎలా అయ్యిందో మనకు తెలుసు. ఇప్పుడు జీఎస్టీ కూడా అదే విధంగా అయ్యే అవకాశమున్నది. 
          వస్తుసేవల పన్నును ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం రెండు లక్ష్యాలను సాధించదలచుకున్నది. ఒకటిపన్నుల పాలనా వ్యవస్థను సరళీకృతం చేయడం. ఇందుకే అమ్మకం పన్నును, ఎక్సైజ్‌ సుంకాన్ని ఏకీకృతం చేయడం జరిగింది. ఇది సంపూర్ణంగా సానుకూల చర్య. పాలనాపరంగా ఒక ముందడుగు. ఎటువంటి మినహాయింపులు లేకుండా స్వాగతించవలసిన ప్రగతిశీల చర్య.

          రెండో లక్ష్యం ‘అనధికార’ వ్యాపారాన్ని వదిలించుకోవడం. ఈ లక్ష్య సాధనకే ఈవే బిల్లు ఇత్యాది కఠిన నిబంధనలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది సమస్యాత్మక మార్గం. లక్ష్య పరిపూర్తికి ఏ మేరకు తోడ్పడగలదో తక్షణమే చెప్పలేము.
             నిజాయితీపరుల కోసమే తాళాలు ఉన్నాయనే సామెత ఒకటి వున్నది. దొంగలకు అవి అడ్డు అవుతాయా? వారు ఎలాగైనా తమ పనిని పూర్తి చేసుకోగలరు. అదే విధంగా వస్తుసేవల పన్ను వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న ఈవే బిల్లు తదితర కఠిన నిబంధలు అవినీతిపరులను ఏ విధంగానూ అడ్డుకోలేవు. అయితే అవి, నిజాయితీగా వ్యాపారాన్ని చేస్తున్న వారికి హాని కల్గిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలను బాగా దెబ్బతీస్తాయి.                   
                  జీయస్టీ ఒక సంక్లిష్టమైన వ్యాపార ప్రక్రియ. దీనిని అమలుపరచడానికి చాలా వ్యయం అవుతుంది. ఇంత వ్యయాన్ని చిన్న వ్యాపార సంస్థలు భరించలేవు. వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. పెద్ద వ్యాపార సంస్థల కయితే జీఎస్టీ నిబంధనలను అమలుపరచడానికి అవసరమైన సిబ్బంది వుంటారు. చిన్న వ్యాపార సంస్థలు అంతమంది సిబ్బందిని నియమించుకోలేవు గనుక వాటి వ్యాపారం అనివార్యంగా దెబ్బతింటుంది.
                    డీమానిటైజేషన్‌ ప్రభావం చిన్న వ్యాపార సంస్థలపై ప్రతికూలంగా వుండడంతో దేశ ఆర్థిక ఇప్పటికే అల్లల్లాడిపోతోంది. అనేక సమస్యలు అటు చిన్న వ్యాపారవేత్తలను, ఇటు సామాన్య ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. చిన్న వ్యాపార సంస్థలు దెబ్బతినడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, మార్కెట్‌లో డిమాండ్‌ గతంలో కంటే చాలా తక్కువగా ఉండడం వల్లే వృద్ధిరేటు పతనమయింది.
                   కనుక జీఎస్టీ లక్ష్యాలు రెండిటినీ వేరుపరచాలి. తొలుత వస్తుసేవల పన్ను వ్యవస్థను సరళీకరించి అమలుపరచాలి. ఏకీకృతపన్ను వ్యవస్థ డిజిటలైజేషన్’ అమలు గురించి తరువాత ఆలోచించాలి. లేనిపక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్రుంగిపోగలదు.
----------- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card