Showing posts with label litarature. Show all posts
Showing posts with label litarature. Show all posts

Tuesday, May 22, 2018

'కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని' చూపించిన ‘నవలా దేశపు రాణి’-యద్దనపూడి సులోచనారాణి





‘యద్దనపూడి సులోచనారాణి అంటే అందరికీ రెక్కలు చాచుకున్న కార్లు, ఆరడుగుల 'రాజశేఖర్' లూ, ముక్కుమీద కోపం ఉన్న 'రోజా'లు’జయంతిలు గుర్తుకొస్తారేమో... కానీ నాకు మాత్రం మెత్తని మాట, మందస్మితం, హుందాతనం, నిరాడంబరత్వం మూర్తీభవించిన ఆమె మూర్తిమత్వమే గుర్తుకొస్తుంది.
, నా 15 ఏళ్ల వయస్సునుంచీ నన్ను ముంచెత్తినవి కూడా ఆ అద్భుతమైన ప్రేమ కథలే. ఆమె కలం మధ్యతరగతి కుటుంబాలలోని సమస్యలు, అనుబంధాల చుట్టూ తిరుగుతుందితెలుగ .సినిమాల్లో గొప్పింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య ప్రేమ అన్న ఫార్ములా సృష్టికర్త యద్దనపూడి సులోచనారాణి అనడంలో అతిశయోక్తి లేదు.
ఆమె రచనలు వట్టి ప్రేమ కథలు కావు. భార్యభర్తల మధ్య అనుబంధం.. వారి మధ్య ప్రేమలు.. మధ్యతరగతి అమ్మాయిల వ్యక్తిత్వం.. ఆత్మవిశ్వాసం.. హుందాతనం.. మాటకారితనం.. లాంటివి యద్దనపూడి వారి రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఆడపిల్లని కొత్తరకంగా,  చూపించినవి. ఆమె మీద ఆరోపణ కూడ అదే. ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఆడపిల్లల్ని, అప్పటి తక్కిన రచయిత్రుల్లా 'బాధితులు' గా (విక్టిమ్స్) చూపించివుంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడ లభించేవేమో? కానీ ఆమె ఏరోజూ ఆడపిల్లల్ని బాధితులుగా చూడలేదు. చూపలేదు.
చీమూ, నెత్తురూ ఉండి, సమస్యలను ఎదురెళ్లి మరీ ఢీకొన్న మొండిఘటాలుగానే చూపించింది. ఒకవేళ తమకు సమస్యలు లేకపోతే కొని తెచ్చుకునే పెంకితనం ఉన్న ఆడపిల్లలు వాళ్లు. ఆమె ఎవరికీ అనుభవంలోకి రాని, రాలేని 'కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని' చూపించిందన్న ఆరోపణ మహామహుల నుంచి కూడ వస్తూంటుంది. నిజమే.. కానీ ఆడపిల్లలకు కలలు కనే హక్కును కూడ నిరాకరించే సమాజంలో కనీసం కథల్లోనైనా కలలు కనడం ఆనందం కాదూ?
 ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, June 03, 2017

వేసవి సాయింత్రాలలో మెరిసిన మల్లె నవ్వులు



వేసవి సాయింత్రాలలో మెరిసిన మల్లె నవ్వులు

చలం గారి పుస్తకాలను తెలియని వారికి పరిచయం చెయ్యాలని, తెలిసిన వారికి మరొక సారి గుర్తు చేయాలని కాని, చలం గారి గురించి పరిచయ వాక్యాలు రాయాలని..... రాయ వలసిన అవసరం వుంటుందని కాని  నేను ఎప్పుడు అనుకోలేదు.. ఇప్పుడు కూడా అనుకోవటం లేదు.
వ్రుత్తి రీత్యా ఆడిటర్ అయినందువల్ల ,GST ప్రాసెస్ మొదలైన దగ్గరుంచీ,నోట్లరద్దు ..మొదలైన   తదనంతరం పని వత్తిడికి ..రోజుల నిండా పేరుకున్న విలువలేని తళుకుల్ని వూడ్చేసేందుకు సరిపోయింది.. కాని కొన్ని రోజులుంటాయి, నువ్వేమిటో నీకే తెలియక /నీ నువ్వు ఇంకొకరి గా/ మారి పోయి/ రాధ కృష్ణుడి లో ప్రేమ తో, మీరా కృష్ణయ్య తో రాగం లో..... సైంటిస్ట్ తన ప్రయోగం తో... చిరు వెలుగు వుదయం తో... సాయంసధ్య నారింజ రంగు నీలాకాశం తో... మనసు పలికే వేణు గానం తో... కలిసి పోయి , రెండూ -వేరు వేరు- కాదని /ఏకత్వం అని తోచే క్షణాలు. ఆ క్షణాలే ఆ రోజులను, ఆ రోజులే జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి జీవితానికి కొత్త విలువలను కొత్త అర్ధాలను సూచిస్తాయి.. జీవిత పధాన నడిపించే వేగు చుక్క లా తోడుంటాయి.


           అలాంటి రోజులు, క్షణాలు నాకు చలం ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు తోస్తాయి.. నన్ను నేను మర్చిఫొయి.. వుహూ ఆ పదం కాదు ‘నా’  అనే అస్తిత్వం ఇంక అక్కడ వుండదు. మొత్తానికి నేనే పూర్తి గా ఆ పుస్తకాలలోని అనుభూతి నైపోతాను... వరుసగా..... వేసవి వుదయాలు, వొంటరి వర్షపు రాత్రులు, బద్ధకం గా వూపిరి పోసుకుంటున్న వేసవి సాయింత్రాలలో మెరిసిన మల్లె నవ్వులు, మూగిన జ్ఞాపకాల చీకటి రాత్రు ల లో తోడైన వాన చుక్కల కబుర్లు.....తిని పోసిన చెరుకుప్పల మధ్యన విశ్రాంతి తీసుకుంటూ ఎదురు గా మధ్యాన్నపు ఎండ గాలి తో కలిసి -నది ని, అవిశ్రాంతం గా, చేసే కల్లోల్లాన్ని చూసే రోజులు.... ఎన్నని...... మనం వున్నామని మర్చిపోయి ఆ క్షణాలలో కి వెళి పోతాం.

ఆయన ప్రేమలేఖలను ప్రత్యక్షం గా ఫస్ట్ హేండ్ ఎక్స్పీరియన్స్ అంటారే అలా ఆ లేఖలలో ‘రెండు పక్కలా’ పాఠకుడి గా, ఆ వుత్తరం లో ఒక భాగం గా /ఫీల్ చేయించగలగటం ఆయన కే చెల్లు. అలాంటి లేఖలను ఈ రోజు చాలా చాలా రోజు ల తరువాత చదువుతున్నా. మన అందరికి కొన్ని చిరాకు పెట్టే రోజులు, కొన్ని అకారణం గా సంతోష పెట్టే రోజులు, కొన్ని విసుగు ను కోపాన్ని తెచ్చే రోజులు వుంటాయి కదా, ఈ మాటే అంటే నా స్నేహితులొకరు  మాకు అలా వుండటానికి ఒక అర్ధ వంతమయిన కారణముంటుంది, కారణం లేకుండా అలా వుండటానికి మాకు వెర్రీ కాదు, చలం అభిమానులమూ కాదు -రెండూ దరి దాపుల ఒక్కటే లే అని పరాచికాలాడారు. నిజానికి అది పరాచికమే కాదు చాలా మంది దృష్టి లో నిజం.... కాని వుంటాయి కొన్ని రోజు లు. నీ ఆత్మ /తనలోకి /తనే చూసి /గొణుక్కుంటున్న /గోలల చిరాకు రోజులు, వుదయపు వెలుగు /కొమ్మ కొమ్మ ను పలకరించి/ కల కల లాడే చిన్ని పిట్టలను చూసి నీతో సంభందం లేకుండా అనంత వాయు గానాలలో లీనమైన నీ ఆత్మ చేసే ఆనందపు సందడుల కాలాలు, ఆషాడ రాత్రి కురిసే వాన కు ముడుచుకున్న దేహం తో ఆత్మ కలిసి, గచ్చు మీద చిందులు తొక్కి, పిల్ల కాలువలై ఇసుకు తిన్నెల మేటల మధ్య /సాగర కాంతుడి తో కలవాలని వడి గా మొదలెట్టి బురద లో ‘ఇంకే’ నీటిని చూసి కన్నీటి పాలయ్యే రాత్రులు.. వుంటాయి వుంటాయి అన్ని అర్ధవంతాలే కానక్కరలేదు...

అలాంటి ఒక చలి రాత్రి ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు ,నాకు ఎంతో ఇష్టమైన ‘మల్లెపూలు’ కవిత మళ్ళీ ఒకసారి చదువుతూ కళ్ళు తెరిచి కలల లోకి వెళ్ళి పోయాను..
           “అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి /నిద్ర లేపి, రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు / రాత్రి సుందర స్వప్నానికి సాక్షులు” .
                 ఆ పరిమళం ఇచ్చే సందేశం యే మాటలతో తెలపగలను.!
              ఆ కవితల/  ప్రేమ లేఖలు ను అవకాశము వుంటే మీరూ ఆస్వాదించండి.రొటీన్ గా, తీరిక లేని జీవితపు వత్తిడికి అణగారిపోయిన స్పందనలు ఒక్కసారిగా జివ్వుమంటూ లేస్తాయ్. కాదని చదివిన తర్వాత చెప్పండి.చెప్పలేరు ఎందుకంటే అప్పుడు మీ మనసులో చలం’ గారుంటారు.
  ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card