మనకిప్పుడు పాన్(తాంబూలం) తెలియదు. పాన్‌కార్డు తప్ప! ఆధార క్రియ తెలియదు. ఆధార్ కార్డు తప్ప!
బాతాఖానీలు తెలియవు. బ్యాంకు ఖాతా బుక్కులు తప్ప! కరెన్సీ సువాసనలు తెలియవు.. కార్డుల కంపు తప్ప! నోట్లో పన్ను నొప్పి తెలియదు. ‘నోట్ల పన్ను’ నొప్పి
తప్ప! ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా, ఐటీ, జీఎస్టీ ఇవేంటో మీకు తెలుసా? దొంగబర్రె పారిపోకుండా లంకెపీట (గుదిబండ) కడతారే అవన్నమాట. బర్రెకు ఒక్కటే
కడతారు. మనకు మాత్రం ఇన్ని కట్టారు. అంతే తేడా
దొంగల్ని చూపించండి అని మోదీ పిలుపునిస్తే అందరూ పక్కోడిని వేలెత్తి చూపారు. కానీ మహా తెలివైన మోదీగారు ఆ చూపుడు
వేలును మాత్రమే చూడలేదు. దానికింద మడిచిన మూడువేళ్లు ఎటు చూపిస్తున్నాయో కూడా చూశారు. అబ్బో దేశంలో ఇంతమంది దొంగలున్నారా అనుకుని యుద్ధం
మొదలుపెట్టారు.
పుట్టల్లోంచి నల్ల కట్టల పాములు బయటకు రావాలంటే పెద్ద నోట్లు రద్దు కావాల్సిందే అన్నారు. బడాబాబుల డబ్బుల డాబాలు
కూలతాయని జనం అనుకున్నారు. కానీ పోపుల డబ్బాపై పిడుగు పడి.. బీరువా బీటలు వారి... లాకర్‌కు క్రాకులొచ్చి... చీర మడతల్లోని ముడుతలు పడ్డ పెద్ద
నోటును పీల్చి పిప్పి చేసింది. ఇదేంది ఇలా జరుగుతోందని.. చాంతాడంత క్యూలో నిలబడి చర్చించేలోపే.. నల్లధనంపై పోరు కాస్తా నగదురహితంగా నామధేయం
మార్చుకుంది!
ఉన్నోడిపై యుద్ధానికి ఉడతాభక్తిగా సాయం చేద్దామని ఉన్న కొంచెం డబ్బు బ్యాంకులో వేస్తే.. ఇది నీకెక్కడి నుంచి
వచ్చింది? టీడీఎస్ కట్టావా? ఆధార్ కార్డుందా? పాన్ కార్డుందా? ఖాతాతో లింక్ చేశావా? కేవైసీ ఫారం నింపావా?... వంటి ప్రశ్నలు ఆఫీసర్ల అవతారమెత్తి
ఆరా తీశాయి. నీ డబ్బే అయినా ఇంతకంటే ఎక్కువ ఇవ్వం అని రూల్స్ చెప్పారు. మన డబ్బు మనకు రాకపోయినా పర్వాలేదు. బతికుంటే బలుసాకు
తినొచ్చుగానీ బ్యాంకు దిక్కు మాత్రం వెళ్లొద్దన్నంత భయం మొదలైంది.
అంతలోనే ఆదాయపన్ను కట్టరా బాబూ
అంటూ ఐటీ నోటీసులు... అణా పైసలతో సహా లెక్కలు చెబుతూ... ఆన్‌లైన్‌లో ఆప్యాయంగా పలకరించాయి. జాగ్రత్త పడితే బెటరని
ఆలోచించేలోపే... ఉన్న డబ్బు మొత్తం బ్యాంకులోకి చేరింది. పెద్ద నోటూ లేదు. చిన్న నోటూ లేదు. పనికిరాని ప్లాస్టిక్ కార్డు తప్ప! ఇక మీ
సొమ్ము మా దగ్గర భద్రం.. పాస్ బుక్కుల్లో అంకెలు చూసుకుని మురిసిపోండి.. కాదంటే కార్డు పేమెంట్‌తో ఖర్చు పెట్టండి.. అని చావు కబురు చల్లగా అందింది!
అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయనే.. అని పాడుకోవడమే. ఛస్.. ఇలాగైతే బతికేదెలా అని ఠలాయించారు.
కార్డు గీర్డు జాన్తా నై అని హార్డ్ డెసిషన్ తీసుకున్నారు.
బ్యాంకుల్ని నమ్మితే బాగోతం నవ్వులపాలే అని ఎవరి డబ్బు వారి దగ్గరే దాచుకోవడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏటీఎంల ముందు
నిలబడి, ఎన్నాళ్లు పనికొస్తాయో తెలియని
రెండు వేల నోట్లను ఏరుకొచ్చి, ఎందుకైనా మంచిదని ఎవరింట్లో వారు దాచుకున్నారు. రెండు లక్షలకు మించి నగదు ఇచ్చి పుచ్చుకుంటే నేరమే, రెండు వేల నోట్లూ రద్దయ్యే అవకాశం
ఉందని సర్కారు వారు మరో బాంబు పేల్చారు. భూములు, జాగాలు, బంగారం అన్నింటికీ లెక్క చెప్పాల్సిందే అని తాఖీదు వేశారు. ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను అని మరో డెఫినిషన్ చెబుతూ వస్తు
సేవల పన్నును తెరపైకి తెచ్చారు. వ్యాపారుల చీకటి వ్యాపారమిక చెల్లు అని ప్రకటించేశారు.
ఏలిన వారి దృష్టిలో ఎవరు దొంగలో ఇప్పటికైనా అర్థమవుతున్నదా! పెళ్లాం, పిల్లలు, కుటుంబం, సంసారంలాంటి బాదరబందీలేవీ లేని
ఒకప్పటి యోగి ఇప్పటి మోదీ! అందువల్ల మనిషి బతికేందుకు డబ్బులతో పెద్దగా పనిలేదన్నది ఆయన సిద్ధాంతం. భారతీయ తత్వాన్ని ఔపోసన పట్టిన
యోగసాధకుడు మోదీ. ఆయన లెక్క ప్రకారం మన ఉప్పులోనే తప్పుంది. మన రక్తంలోనే చోరత్వం ఉంది. చతుష్షష్టి కళల్లో చోర కళను ఒకటిగా చేర్చుకున్నామా లేదా? చీరలెత్తుకెళ్లాడే చిన్ని కృష్ణుడు
అని ఆనందంగా తత్వాలు పాడుకున్నామా లేదా? వెన్న కుండలు దోచిన వన్నెకాడు అని పద్యాలు కట్టామా లేదా? ఎవరైనా చూస్తేనే తప్పు.. లేదంటే ఏం చేసినా ఒప్పే అని మనం అనుకుంటాం. అప్పనంగా ఏదైనా
కనిపిస్తే లటుక్కున అందుకుని పుటుక్కున జేబులో వేసుకోవాలని చూస్తాం. సర్కారు వారు పన్ను ప్రకటన చేసి క్షణమైనా కాకముందే తప్పించుకునే మార్గం
కనుక్కుంటాం.
‘ఈ ప్రపంచంలో ఏదీ సత్యం కాదు. చావు, పన్నులు తప్ప’ అన్నాడు బెంజిమెన్ ఫ్రాంక్లిన్. చచ్చినా సరే పన్ను కట్టొద్దన్నది మన లెక్క.
తెలివైనవాడు తన డబ్బును తనకోసం ఖర్చు పెడతాడట. తెలివి తక్కువవాడు ఇన్‌కమ్‌ట్యాక్స్
పడేదాకా వేచి చూసి కడతాడట. పన్ను నొప్పి భరించలేనిది. అందుకే నోట్లో నాలుకలా కదులుతూ పన్నులకు దొరకకుండా తప్పించుకోవాలని మనం
ప్రయత్నిస్తాం.
మనలోంచి వచ్చినవాడే కదా మోదీ. ఆయనకు ఇవన్నీ తెలుసు. అందుకే ఇకనైనా ఈ దేశాన్ని చౌర్యోపాసన నుంచి, చోరయోగ సాధన నుంచి మళ్లించాలని ఆయన
కంకణం కట్టుకున్నారు. అందులో భాగమే ఇవన్నీ! గన్ను కన్నా పన్ను పవర్‌ఫుల్. కడుపులో కాలితే గుగ్గిళ్లు తినే గుర్రమైనా
వరిగడ్డి మేస్తుందట!
డబ్బంటూ ఉంటే కదా బ్లాకైనా, వైటైనా అయ్యేది. డబ్బే లేకపోతే..
ఇవ్వకపోతే! ఇదీ మోదీగారి థియరీ.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment