Thursday, March 09, 2017

ఒకే పన్ను వ్యవస్థ అనే జిఎస్టి లో కొన్ని వ్యతిరేక అంశాలు





      ఒకే పన్ను వ్యవస్థ గా జిఎస్టి  ను సూచిస్తారు కాని వాస్తవానికి అది రెండు పన్నుల వ్యవస్థ (అమ్మకం మరియు సేవ అనే ఒకే లావాదేవీ లో రాష్ట్ర మరియు కేంద్రం విడివిడిగా  పన్నును సేకరిస్తుంది .కనుక ఇది  ద్వంద్వ పన్ను.)
          ప్రస్తుత  పరోక్ష పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం అధీనంలో  కేంద్ర ఎక్సైజ్ పన్ను ఉంది. కానీ అన్ని సరుకులు, వస్తువులను సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోకి రావు. అంతే కాదు  వ్యాపారులు లో 1.50 కోట్ల  లోపు ఉన్నవారికి మినహాయింపు పరిమితి ఉంది. అంటే  అందరు వ్యాపారులు  సెంట్రల్ ఎక్సైజ్  పన్ను కట్ట అక్కర లేదు
         ప్రస్తుత పరోక్ష పన్నుల విధానంలో మాన్యుఫ్యాక్చరింగ్ దశ వరకు మాత్రమే చెల్లించవలసివుంటుంది. కానీ ఇప్పుడు జిఎస్టి లో అందరూ ఆఖరి విక్రయ దశ వరకు పన్ను చెల్లించవలసి వస్తుంది
             అంటే మెజారిటీ డీలర్స్ కేంద్ర ఎక్సైజ్  చెల్లించే వారు కాదు, కానీ రాష్ట్రంలో వ్యాట్ చెల్లిస్తు ఉంటారు. ఇప్పుడు అందరూ వ్యాట్ డీలర్స్ ఎక్సైజ్  తో కలిపి "సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్" చెల్లించటము అవసరం.అంటే ఎక్కువ పన్ను చెల్లించాలి.
     
    RNR (రెవెన్యూ న్యూట్రల్ రేట్) లెక్కించడం చాలా కష్టం . కానీ గవర్నమెంట్ రెవిన్యూ రాబడి పెంచేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు పన్ను రేటు ఒక సమస్య గా ఉంటుంది. ప్రస్తుతం వున్న వార్తల ప్రకారం(ఈ వ్యాసం రాసే నాటికి, అనగా ది 09.03.2017 నాటికీ)  రాష్ట్రం జిఎస్టి కోసం ప్రతిపాదిత రేటు 12%, సెంట్రల్ జీఎస్టీ 14%, ప్లస్ జీఎస్టీ ప్రారంభ దశలో గవర్నమెంట్ అదనంగా. 1% సిఎస్టి విధించే అవకాశం ‘సరుకులు మరియు సేవలు’ అంతర్ రాష్ర్ట అమ్మకానికి ఉంటుందనిపిస్తుంది. సో మొత్తం పన్నులో సాధారణ రేటు 26% ఉంటుంది. ప్రస్తుత వాస్తవ రేటు తో  పోల్చితే ఈ రేటు చాలా ఎక్కువగా వుంది. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు సెంట్రల్ ఎక్సైజ్  పన్నులు ఇప్పటివరకు కట్టని వ్యాపారులు, మరియు చాలా రకాలయిన  వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పటిదాకా టాక్సు పరిధిలో లేకుండా సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో  ఉన్నాయి.
          ‘గూడ్స్ మరియు సేవ’ యొక్క    తయారీ మరియు పంపిణీ మెరుగుపడటం అంటే, ఎగుమతులు పెంచటం , వివిధ సంస్కరణలు పెంచడం ,పరోక్షంగా వ్యాపార అవినీతి ని తనిఖీ చేయడం, తక్కువ ప్రభుత్వ నియంత్రణ, అనే కొన్ని కారకాలు(factors) దేశం యొక్క ఆర్ధిక అభివృద్ధి కి  కారణాలు గా ఉన్నాయి.
   ఒక పన్ను వ్యవస్థ, దేశ  ఆర్థిక వ్యవస్థలో విప్లవం చేయవచ్చు  అనే విషయం "అరుదైన వాటిల్లో కూడా అరుదైనది"
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, March 08, 2017

మహిళా ‘దినోత్సవం’ అంటే ................... మహిళ – దినం - ఉత్సవమా?






మహిళాదినోత్సవం సందర్భంగా మహిళల ప్రధాన సమస్య పై నా అవగాహన

వరకట్నం విశ్వరూపం (Dowry problem at its peak)

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసల్లో ప్రధాన పాత్రధారి వరకట్న సమస్య. ఈ సామాజిక రుగ్మతపై అవగాహన, సమస్య నియంత్రణ కోసం దశాబ్దాలుగా అనేక వేదికలపై అంతర్జాతీయ సమాజం అనేక ప్రయత్నాలు చేసింది. యత్ర నార్యన్తు పూజ్యంతే తత్ర దేవత: అని ఆడవారిని గౌరవించాలనే పుణ్యభూమిగా చెప్పుకుంటున్న భరతగడ్డపై వరకట్న బాధితురాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయనివారు లేరు. ఆగర్భ శ్రీమంతుల నుంచి పేద మధ్య తరగతి వరకు ఏ ఒక్కరినీ వదలని సమస్యే వరకట్నం. మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి నుంచి మధ్యప్రదేశ్ మురేనాలో ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ను వదలని వరకట్న వేధింపులు ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. ఈ ఉదంతాలు భారతవనిలో ఆడపిల్లగా పుట్టడం ఎంత ఆపదో చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల శాతానికి దాదాపు సమాన స్థాయిలో వరకట్న వేధింపు కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద మధ్య దిగువ తరగతులకే ఇది పరిమితం కావటం లేదని ఇప్పుడు ఎన్ సీ ఆర్ బీ వంటి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆర్థికంగా మంచి స్థితిలోని కుటుంబంలోనూ కట్నం సమస్యలను సృష్టిస్తోంది. డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు, ఇంజినీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇలా ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. విద్యాధికులు సైతం కట్నానికి ఆశపడుతూ ఈ సామాజిక దురాచారాన్ని పెంచి పోషిస్తున్నారు. వరకట్న చట్టాల్లోని లొసుగులు వల్ల కేసు విచారణలు కూడా చాలా ఆలస్యమవుతున్నాయి. ఇవి కూడా ముద్దాయిలకు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి ఆ మధ్య ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే కోటి నుంచి ఐదు కోట్లు, డాక్టరు అయితే యాభై లక్షల నుంచి కోటి, ఓ మోస్తరు ఉద్యోగి అయితే ఐదు నుంచి యాభై లక్షలు చెల్లించుకోవాల్సిందే. అంతకు ఒక్క పైసా అటూ ఇటూ అయినా లాంఛనాల్లో ఏమాత్రం లోటు జరిగినా కాపురానికి వెళ్లిన పిల్ల క్షేమంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఇక రాజకీయ నాయకుల ఇళ్లల్లో నీకిది నాకిది రూపంలో పేరున జరిగిపోయే లోపాయికారీ ఒప్పందాలు వరకట్న పిశాచం కొత్త రూపాలు. ఇక చట్టాలను అమలు చేయాల్సిన, వాటిని సమీక్షించాల్సిన వ్యవస్థలే ఇలా కునారిల్లుపోతుంటే న్యాయం కోసం గొంతెత్తే ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది. ఇటీవల విపరీతంగా పెరుగుతున్న ఎన్ ఆర్ ఐ అల్లుళ్ళ విశ్వరూపాలు ఈ దేశీయ వరకట్న సమస్య ప్రభావ తీవ్రతకు మరోరూపం.


అక్కరకు రాని చట్టాలు (Laws and Acts are of no use)


2002-2012 మధ్య కాలంలో ఈ మొత్తం నేర గణాంకాలను పరిశీలిస్తే నాగాలాండ్, లక్ష్యద్వీప్ మాత్రమే వివాహితులకు కాస్త సురక్షిత ప్రాంతాలుగా తేలుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఒక్క వరకట్న కేసు కూడా నమోదుకాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్ మాత్రం అత్యంత ప్రమాదకర జాబితాలో ముందు వరుసలో నిలుస్తాయిన్నాయి. ఇవన్నీ కాదు కొన్ని దశాబ్దాలుగా ఏ నివేదికను చూసినా దేశవ్యాప్తంగా మహిళలు పడుతున్న కష్టనష్టాలను కళ్లకు కడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గృహ హింసకు సంబంధించి గతంలో కేంద్ర మహిళా శిశు కుటుంబ శాఖా సహాయ మంత్రిగా రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రకారం అయితే దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఎన్సీఆర్ బీ గణాంకాల ప్రకారం ప్రతీ మూడు నిముషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతీ తొమ్మిది నిముషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులకు, హింసకు గురి అవుతున్నారు. గృహ హింస నిరోధంపేరు చెప్పి అనేక కఠిన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలోనూ ఈ దారుణాలు ఏ మాత్రం ఆగకపోవడానికి వైఫల్యం ఎవరిదనేది అనేది ఇప్పుడు మన ప్రభుత్వం, పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయం.

వికటించిన ప్రయత్నాలు (Futile efforts)

1980 లలో మహిళా సంఘాలు వరకట్నం సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమించి కీలక విజయాలను సాధించారు. పెళ్లి జరిగిన ఏడేళ్లలోపు అగ్నిప్రమాదాల్లో ఆ గృహిణి మరణిస్తే అసహజ మరణంగా నమోదు చేయాలని, భర్తపై తక్షణం హత్య కేసు పెట్టాలనే నిబంధనలు వచ్చాయి. వధువు మరణ వాంగ్మూలం వీలులేని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని చట్టంలో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొంత కాలం పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. తర్వాత తెలిసిన
విషయమేమంటే చట్ట సవరణలు తర్వాత కనీసం మృతుల జాబితాలోకి ఎక్కే అవకాశం కూడా ఆ మహిళలు కోల్పోయారు. మూడు ఏళ్ల క్రితం వరకట్న భర్తలపై ఎలాంటి కనికరం చూపనక్కర్లేదనన్న తీర్పు సైతం అలానే అధో జగత్తిలో కలిసిపోయింది.

పరిష్కార మార్గాలు (Solutions)


స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ మహిళా సంక్షేమానికి, సాధికారతకు ఎన్నో చర్యలు ప్రభుత్వ పరంగా పౌర సమాజం పరంగా చేపట్టడం జరిగింది. రాజ్యాంగంలోని 14,15 ప్రకరణలు స్త్రీ,పురుషులకు సమానావకాశాలు కల్పించాయి. లింగపరమైన వివక్షను నిషేధించాయి. 39వ ప్రకరణ సమానమైన పనికి సమాన వేతన అవకాశాన్ని కల్పించి మహిళల ఆర్థిక సాధికరతకు దోహదం చేసింది. వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లోనే పార్లమెంటు చట్టం చేసింది. దాన్ని 1986లో సవరించారు. 2001లో మహిళా సాధికారతకు జాతీయ విధానం రూపొందించారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం తీసుకున్నవారికి ఇచ్చినవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించవచ్చు. వరకట్న చావుకు బాధ్యులైనవారికి 7 ఏళ్ల నుంచి ఆజన్మాంత ఖైదు శిక్ష విధించవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ 304బి నిబంధన ప్రకారం వరకట్న నిందితులకు బెయిల్ లభించదు. ఇలాంటి కేసుల్లో వరకట్నం కోసం పీడించలేదని నిందితులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. గృహ హింస నుంచి
మహిళలకు రక్షణ కల్పిస్తూ రూపొందించిన చట్టం(2005) వరకట్న పీడితుకుల మరింత ఊరట కలిగించేందుకు ఉద్దేశించింది. మహిళా సంఘాలు, పౌర సమాజం మరింత కఠినమైన చట్టాలు రూపొందించి ఈ సామాజిక దురాచాన్ని నిర్మూలించాలని కోరుతున్నాయి.

దుర్వినియోగమవుతున్న చట్టం: (Act misusing)


అనేక సందర్భాల్లో వరకట్న నిషేధం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతోంది. కుటుంబంలో ఇతర కారణాల వల్ల ఏర్పడిన మనస్పర్థలను కూడా వరకట్న సంబంధ కేసులుగా చిత్రీకరించి భర్తను అత్తమామలను ఇరికించిన సంఘటనలు లేకపోలేదు. ఈ సందర్భంలో పోలీసులు ఇరుపక్షాల నుంచి సొమ్ము చేసుకోవడం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అమాయకులు బలవుతున్నారు.

చేపట్టాల్సిన చర్యలు: (Action to be taken)

చట్టాల ద్వారా ,ఉద్యమాల ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న దురాచారాన్ని అరికట్టడం కష్టం. అలాగని ఈ దురాచారాన్ని కొనసాగనివ్వాలని కాదు. సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ మేరకు చట్టాలు చేశాయి. హిందూ వారసత్వ చట్టాన్ని సవరించి కుమార్తెల ఆస్తిని అన్యాక్రాంతం చేయడాన్ని నిషేధించాలి. యువతీ,యువకుల వైఖరిలో మార్పు రావాలి. వీటన్నిటి కంటే తల్లిదండ్రులు తమ వివాహిత కుమార్తెలకు ఆదాయాన్నిచ్చే ఆస్తులను (పొలం, ఇల్లు,వ్యాపారంలో వాటా) కానుకగా ఇస్తే వారికి సాధికారత చేకూరుతుంది. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగి వారికి స్వాధీనత లభించినప్పుడే వరకట్న దురాచారం సమసిపోతుంది.

మరికొన్ని సూచనలు: (Some other suggestions)

చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే అత్యధిక మరణాలు నమోదుకు కారణమని జాతీయ మహిళా సంఘం అభిప్రాయం. పోలీసులు మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముంది. ప్రజలు తమ హక్కులు గురించి, చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముంది. అప్పుడే వరకట్న నిషేధ చట్టం వంటి చట్టాలను ప్రభావ వంతంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. వరకట్న వేధింపులు మొదలవ్వగానే మహిళలు సమస్యను చట్టం దృష్టికి తీసుకురాకపోవటం, పోలీసులు కూడా కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ కేసులు నిలబడట్లేదని న్యాయనిపుణుల అభిప్రాయం. ఇలాంటి కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ ప్రారంభించి మొదట్లోనే చర్యలకు దిగితే ఫలితం ఉంటుంది. దురదృష్టవశాత్తు మన న్యాయవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తోంది.వరకట్న నిషేధ చట్టం, 1961 కి 1986లో సవరణలు జరిపినా ఇంకా కొన్ని లోపాలున్నాయి. భర్త లేదా అతని తరపు బంధువులు
క్రూరంగా ప్రవర్తించిన సందర్భంలో ఉపయోగించే ఐపిసి సెక్షన్‌ 498(ఏ) కింద కేసు నమోదయినప్పటికీ కొన్ని సందర్భాల్లో బెయిల్‌ పొందడం సులువే. ఈ లోపాలను సవరించాలి. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కమిషన్లు స్పష్టమైన కార్యాచరణ దిశగా కదలాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, March 03, 2017

తెలుగు వైభవం




భాస్కర శతకంలో చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబుఅంటాడు కవి. ‘...చదువొకటే కాదు. (ముత్యాల ముగ్గులో చెప్పినట్టు) కొంచెం కళాపోషణ కూడా ఉండాలిఅని దాని అర్థం.

కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు కదిలే స్తనాలలోని గగుర్పాటుని 'విలాసముఅంటారని భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పబడింది. కృష్ణుణ్ణి చూడటంతోనే ఒక గోపికకి తమకం కలిగిందట. స్తనాలు బరువెక్కి తట్టుకోలేక అతడిని అదిమి కౌగిలించుకొంది. చందనo పూయబడిన కళేబరo (శరీరo) అది.చందన చర్చిత నీల కళేబర... హరి రిహ ముగ్ధ వధూ నికరే విలాసినివిలసతి కేళిపరే…’ అట. ఎంత చక్కగా ఆ విలాసముఅన్న పదాన్ని జయదేవ కవి ఇక్కడ వాడుకున్నాడో చూడండి.
స్త్రీ గురించి పురుషుడు వర్ణించడం గొప్ప కాదు కానీ, స్త్రీ అందాలకి పరస్పర విరుద్ధ లక్షణాల్ని ఆపాదిస్తూ కవయిత్రి మొల్ల ఒక అద్భుతమైన పద్యం వ్రాసింది. సీత ముక్కు సంపెంగ, ముంగురులు తుమ్మెదలు (సంపెంగకి తుమ్మెద శత్రువు). చేతులు పద్మాలు, ముఖం చంద్రుడు (శత్రువైన చంద్రుడు కనబడేసరికి పద్మాలు ముకుళించుకు పోతాయి). స్తనములు గజకుంభాలు. నడుము సింహ మధ్యమం (సింహానికీ ఏనుగుకూ ఉన్న వైరం అందరికీ తెలిసినదే). పెదవి దొండ పండు, మాట చిలక పలుకు (దొండపండు కనబడితే చిలకలు వదలవు). హంసగమన, చేతులు తామర తూళ్ళు (హంసలు తామరతూళ్ళని తింటాయి). చూపులు చకోరాలు, నవ్వు వెన్నెల (చకోరాలు వెన్నెలని తాగుతాయి). ఈ విధంగా పరస్పర విరుద్ధ వర్ణనలతో సీత అందాన్ని శూర్పణఖ రావణన్నయ్య ముందు వర్ణిస్తుంది.

ఈ కవుల ప్రేరణతో, "ప్రేమ" నవలలో నాయకిని వర్ణిస్తూ యండమూరి వీరెంద్రనాద్ నాద్ గారు ఈ  విధంగా వ్రాశారు. కథానాయకి తొలిసారి ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గతుకుల దారి, ఎడ్లబండి కుదుపుల బారి పడిన ఆమె ‘స్తనములు పంజరం చెర వీడిన పక్షి రెక్కల్లా ‘కదుల్తూ ఉంటాయి. కాలువనుంచి కావిడితో ఇంటింటికీ నీళ్ళు సరఫరా చేసే కావిడివాడు ఆమెని చూసి, "ఈమె కుచములంత కడవలు నాకుంటే, ఇన్ని తడవలు కాలువకీ ఊరికీ మధ్య తిరిగే బాధ ఉండేది కాదు కదా" అనుకుంటాడు.
విరహ వర్ణన:
ప్రేమించినవారు దూరంగా ఉంటే కలిగే బాధని విరహo అంటారు. జీవితంలో ప్రతీవాళ్ళూ ఏదో ఒక వయసులో, ఏదో ఒక స్థాయిలో దీన్ని అనుభవించే ఉంటారు. విరహం మూడు రకాలు. 1. మానసికం 2. శారీరకం 3. మానసికం+శారీరకం.
శృంగారానుభవం లేనివారి బాధ ఉట్టి మానసిక విరహం. మానసిక విరహాన్ని బెంగఅని కూడా అనవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులు దూరం అవడం వల్ల పడే బాధ కూడా విరహమే. ప్రేమికుల విరహం, పిల్లల బెంగ... ఇవే కాదు. భగవంతుని పట్ల భక్తునిది కూడా విరహమే అని చెప్పే గిరిక పాత్ర‌ను వేయి ప‌డ‌గ‌లున‌వ‌ల‌లో అత్య‌ద్భుతంగా సృష్టించారు విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు. ఈ గిరిక దేవ‌దాసి. వేణుగోపాల‌ స్వామికి నాట్య నివేద‌నాలు చేసే న‌ర్త‌కి. హృద‌యాన్ని కూడా గోపాలునికి అంకితం చేసి, గీత గోవిందాన్ని గిరికా గోవిందంగా తారుమారు చేసి, ఆ స్వామికోసం విర‌హంతో త‌పించి తుద‌కు కైవ‌ల్య ప‌‌థానికి చేరుకుంది.
రెండోది బాధ శారీరకo. వ్యక్తితో అటాచ్మెంట్ లేకుండా వచ్చే విరహాన్ని కామంఅంటారు. మూడోది మానసికం + శారీరకం. శృంగారానుభవం ఉన్న ప్రేమికులూ, తప్పని సరి పరిస్థితుల్లో విడిగా ఉండవలసి వచ్చిన దంపతులూ పడే బాధ ఇది. అప్పటికే కొంత శృంగారం అనుభవించడం వల్ల, ఆషాఢమాసంలో కొత్త దంపతులు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, శరీరమూ మనసూ ఏక కాలంలో బాధపడతాయి. పెళ్ళయిన కొత్తలో రెండు భిన్న వ్యక్తిత్వాల మధ్య విభేదాలు తప్పవు. ఇద్దరూ నెల రోజుల పాటూ విడిగా ఉండాల్సి వచ్చినప్పుడు, పాత విభేదాలు మర్చిపోయి, ఒకరికోసం ఒకరు అర్రులు సాచే అవసరాన్ని సృష్టించటం కోసమే ఆషాఢ మాసపు నియంత్రణ కల్పింపబడిందనీ, దాన్ని తరువాత 'అత్తా- కోడలూ ఒకే ఇంట్లో కలిసి ఉండరాదనే నిబంధన'గా కన్వీనియెంటుగా మార్చారనీ కొందరి ఉవాచ.
ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో పుర వర్ణన, అరణ్య వర్ణన, పర్వత వర్ణనా ఉన్నట్లే విరహవర్ణన కంపల్సరీ కాదు కానీ, విరహన్ని వర్ణించే విషయంలో పురాతన కవులు ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోలేదు. పరిధులు చెరిపి, తమ ఆలోచనా పటిమకి అవధులు లేవని నిరూపించుకున్నారు.
నాకు తెలిసినంతలో విరహం గురించి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వ్రాసినంత 'ఇది'గా మరి ఏ కవీ వ్రాయలేదు. కథానాయకి గిరిక ఒక్కొక్క అవయవానికీ కలిగిన విరహ బాధా, ఆ బాధ తీర్చటానికి చెలికత్తెలు పడే బాధని అపురూపంగా అభివర్ణిస్తాడు.
విరహంతో కథానాయకి బాధ పడుతున్నప్పుడు, పరిచారికలు సలసలా కాగిపోతున్న ఆమె శరీరాన్ని నీటితో తడపటం, లేత తమలపాకుల మీద పడుకో బెట్టడం, విసనకర్రలతో వీయటం లాంటి ఉపచారాలు చేయడం అనాదిగా వస్తున్నదే. అయితే భట్టుమూర్తి కథానాయిక అపురూప సౌందర్యవతి. అందువల్ల చెలికత్తెలకి గొప్ప చిక్కు వచ్చి పడింది.
‘లలనకానంగ కీలికీలా కలాప సంతతాలీఢ’
మన్మథావస్థతో బాధపడుతున్నవారిని చిగురుటాకులపై పడుకోబెట్టవచ్చు. కానీ పుత్తడిరంగులో ఉన్న ఆమె శరీరం, లోపలి నుంచి వచ్చే అగ్నికి పుటంలో వేసిన బంగారoలా మరిగిపోతోంది. చిగురుటాకులు జ్వాలా వర్ణంలో ఎర్రగా ఉన్నాయి. వాటి మీద ఈమెను పడుకోబెడితే అది మరింత ప్రమాదం కాదా!
‘శీర్యదాశా వృంత శిథిలితాసు లతాంత మసియాడ వీపనల్విసర రాదు’
ప్రియుడి కోసం ఆమె శరీరం శుష్కించిపోయింది. కాస్త గాలి వేస్తే తొడిమ నుంచి జారిపోయే పుష్పంలా ఉంది ప్రాణo. ఇటువంటి పరిస్థితిలో ఆమెకు విసనకర్రలతో స్వాంతన చేకూరిస్తే, వేగంగా వచ్చే ఆ గాలికి మొత్తం ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనని చెలికత్తెలు సంశయిస్తున్నారు.
‘శ్రమబిందు తారకాగమఖిన్న కుచకోకముల చంద్ర నామంబు దలపరాదు’
విరహతాపంతో మరుగుతున్న ‘కుచ ద్వయాని’కి కర్పూర లేపనం రాద్దామని అనుకున్నారు. కాని చక్రవాక పక్షుల్లా ఉన్న ఆమె స్తనాలపై మన్మథ తాపం వల్ల ఉద్భవించిన చెమట బిందువులు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అటువంటి సమయంలో వాటికి కర్పూరం వ్రాయకూడదు. కారణం, కర్పూరానికి మరో పేరు 'చంద్ర'. చక్రవాక పక్షులకి చీకటంటే భయం. అసలే దిగులుగా ఉన్న స్తనాలనే చక్రవాకాలకి నక్షత్రాలతో పాటూ చంద్రుణ్ణి కూడా తోడిస్తే మరింత కష్టం కదా.
మోహోపదేశ తమో ముద్రితములైన - కనుదమ్ముల హిమాంబులునుప రాదు. హృదయ పాత్రాంతరాళపొంగి పొరల చల్లని పటీర సలిలంబు చల్లరాదు.
మోహం అనే చీకటి వల్ల ముడుచుకుపోయిన కమల నేత్రాలకి సూర్యరశ్మి కావాలి తప్ప నీళ్ళెందుకు? అయినా. ఆమె మనసే సలసలా కాగే నూనెలా ఉంది. వాటిమీద నీళ్ళు జల్లితే అంతకంటే ప్రమాదం మరొకటి ఉంటుందా?
ఈ విధంగా కవి ఊహలతో సోయగమైన ఆ విరహ వర్ణన అప్రతిహతంగా అపూర్వంగా సాగుతుంది.
ఇంత గొప్ప తెలుగుని మనం కోల్పోతున్నాం. పునరుక్తి అనుకోకపోతే, తెలుగును బ్రతికించండి. మన మాతృభాష అయినందుకు కాదు. ఇంతకన్నా గొప్ప భాష ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ప్రతి భాషవాడూ ఇలాగే అనుకుంటూ ఉండవచ్చు గాక. కానీ ఒక్కసారి పరిశీలించి చూడoడి. మీకే అర్థం అవుతుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card