Thursday, July 13, 2017

నల్ల భేతాళం ........దానికి సరిపోని తాళం



పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా ‘పొన్నూరు ఐలాండ్ సెంటర్లో కొత్తగా వెలిసిన బార్’ వైపు కాకుండా స్మశానము కేసి నడువ సాగాడు.
అప్పుడు శవంలోని  బేతాళుడు, “రాజా, నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకు ముచ్చటేస్తూంది. ఈ రోజు బాగా వర్షం కురుస్తూ చలిగా వున్నా బార్లో వెళ్ళకుండా ,నీ సంకల్పం కోసంవచ్చావు ,నాకు  నచ్చావు .ఐతే ఒకో సారి సంకల్పబలం సదుద్దేశం ఉన్నప్పటికి, కొన్ని తల పెట్టిన కార్యాలు విఫలమౌతుంటాయి.  ఇప్పుడు నీకు అలాంటి కథే ఒకటి చెప్తాను, విను,” అంటూ మొదలు పెట్టాడు.
జంబూ ద్వీపం అనే దేశానికి సంబంధించిన కథ ఇది. ఆ దేశాన్ని ‘గురివింద’  అనబడే ఒక మహోత్తరమైన పార్టీ ఏలుతూంది. గురివింద పార్టీ పేదల కోసమే పుట్టిన పార్టీ. వారికి పేదలంటే ఎంత ఇష్టమంటే, ఎల్లప్పుడూ పేదలకు సేవ చేస్తూ ఉండడానికి, జంబూ ద్వీపంలో అసలు పేదరికం అనేది ఎప్పటికి అంతరించిపోకుండా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
అందులో భాగంగానే మధ్య తగరతి ప్రజల మీద, పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద వేసే పన్నుల వల్ల వచ్చిన ఆదాయంతో జంబూ ద్వీపంలోని అతి పేద వారికి సంక్షేమ పథకాలు నడపడం మొదలు పెట్టారు.
ఆ డబ్బుని పేదలకి రకరకాలుగా పంచిపెట్టారు. తినకపోతే కుక్కుతాంపథకం కింద పేద వారికి వంట సరుకులు ఇవ్వడం, “ఋణం తీర్చక పోయినా, ఏం ఫర్లేదుపథకం కింద రైతులకు అప్పులు ఇవ్వడం, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్ ఫీజ్ కట్టడం, ఉచిత విద్యుత్ ఇవ్వడం, పేదలకు పక్కా ఇళ్ళు కట్టించడం, ఒకటేమిటి పోలింగ్ బూత్‌కి వచ్చి వోటు వేస్తారని నమ్మకం ఉన్న వాళ్ళందరికి రక రకాల వరాలు ప్రసాదించారు.
మరి ఇంత కష్ట పడుతున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయిలో తొంభై పైసలు వాళ్ళే ఉంచుకున్నారు. కొన్ని చోట్ల దీన్ని కరప్షన్ అంటారు. కానీ జంబూ ద్వీప ప్రజలు మాత్రం పట్టించుకోకుండా గురివింద కి జేజేలు పలికారు. ఎందుకంటావు?”
మాట్లాడను అన్నట్టు తన నోటికేసి వేలు పెట్టి చూపించాడు విక్రమార్కుడు.
, మర్చిపోయాను, నువ్వు మౌన వ్రతంలో ఉన్నావు కద. స్మార్ట్ బాయ్! సమాధానం కూడా నేనే చెప్తాను విను. జంబు ద్వీప ప్రజలు చాల గొప్ప మనసు కల వారు. వారికి ఎవరన్నా ఎంతో కొంత పారేస్తే, ప్రపంచం బద్దలయి పోయినా పట్టించుకోరు. డబ్బున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ,చదువుకున్న వాళ్ళు ప్రభుత్వంతో అసలు ‘సున్నం’  పెట్టుకోరు. కాబట్టి ఈ పద్ధతి గురివింద కి బాగా వర్కౌట్ అయ్యింది. ఆల్‌రెడీ ఎన్నికల్లో కూడా గెలిచారు. మళ్ళీ గెలవడానికి ఉర్రూతలూగుతున్నారు.
చెవిలో విపరీతంగా దురద వేయడంతో, ఒక చేత్తో భుజం మీద బేతాళుడిని జాగ్రత్తగా బ్యాలన్స్ చేస్తూనే, ఇంకో చేత్తో తనివి తీరా చెవి గోక్కున్నాడు విక్రమార్కుడు.
ఐతే దురదృష్ట వశాత్తు ఆర్థిక వ్యవస్థ ఇలాంటి దానాలు ధర్మాలు సబ్సిడీల వల్ల నడవదు. ఆర్థిక వ్యవస్థకి కావాల్సింది కట్టుదిట్టమైన infrastructure మరియు శాంతి భద్రతలు. కానీ ఉన్న డబ్బులు అన్నీ తమ మధ్య, పేదల మధ్య పంచుకోవడంతో, రోడ్లు వేయడం, డ్యాములు కట్టడం, దేశం నలు మూలలా విద్యుత్తు ఇవ్వడం, లా అండ్ ఆర్డర్ లాంటి విషయాలపై శ్రద్ధ పెట్టడానికి గురివింద ప్రభుత్వానికి వీలు లేకుండా పోయింది.
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటేఅన్న సూక్తి ప్రకారం, ఈ సంక్షేమ పథకాలన్నిటికీ డబ్బులు తక్కువ పడడం మొదలయ్యింది. దాన్ని సర్దుబాటు చేయడం కోసం ‘బంగారం’ దిగుమతుల మీద పన్నులు పెంచింది గురివింద. జంబు ద్వీప ప్రజలు గాసిప్‌లు లేకపోయినా ఉండగలరు కానీ, బంగారం కొనకుండా ఉండలేరు, కాబట్టి కొన్ని రోజులు అలా అదనపు అదాయం వచ్చింది ప్రభుత్వానికి . కానీ తరువాత అది కూడా సరిపోలేదు.
దిక్కు తోచక ఏం చేయాలో తెలియక మధన పడుతున్న ప్రభుత్వానికి అకస్మాత్తుగా అర్ధరాత్రివేళ ఓ నల్లటి ‘కల’ తళ్ళుక్కున మెరిసింది. ‘నల్లదనం’ చీకట్లో కాంతి కిరణంలా  లా కనపడింది . ప్రజలారా మీ ‘టీ’ ఖర్చులకి అట్టి పెట్టుకుని దాచినదంతా మాకిచ్చేయండి అంది, జనం అంతా ‘పక్కోడు’ వైపు చూసారు వాడే ‘పెద్ద నల్ల ధనవంతుడు’ అని . అంతే గురివింద కి బాగా తిక్కరేగింది ,రాత్రికి రాత్రే మీ దగ్గరున్నవి  డబ్బులు అనుకుంటున్నారా అమాయకులారా అవి చిత్తు కాగితాలు.రేపట్నించి చెల్లవు కానీ మీమీద ప్రేమతో అవి మేం తీసుకుంటాం మీరు మాకిచ్చి ,మీ ఖర్చులకి  మమ్మల్ని అడుక్కోండి  ,వీలయితే కొంత విదిలిస్తాం అని హుకూం జారీచేసింది.
     ఈ మాయాబజార్ లో దారి బాగా తెల్సిన బ్యూరోక్రాట్లు ,సెలబ్రిటీలు  చప్పున గూటికి చేరారు ,పాపం సాధారణ జనం దిక్కూ దారీ తెలీయక  వున్న డబ్బులు బ్యాంకుల్లో వేసి వారి దయ దాక్షిన్న్యాల మీద , విసిరిన దాంతో  బ్రతుకీడుస్తున్నారు.జనం డొక్కల మీద- బ్యాంకులు,వారి చాటున ‘బడాబాబులు’ లాభాల మేడలు కట్టేస్తున్నారు’  
బాగా చెప్పారు సార్! అంత నల్ల ధనం,డబ్బు  కనుక మనకి దొరికితే, ‘అణగారిన ప్రజలకు జీవితాంతం జీతం ఉచితంఅనే పథకాన్ని ప్రవేశ పెట్టేద్దాం. అప్పుడు మనం ఎన్నికలలో ఓడిపోవడం అనేదే ఉండదు,” ఆనందంగా చెప్పాడు ఆంతరంగికుడు.
మీరు నోరు మూయండి. పథాకాలకు పేర్లు పెట్టేది నేను, మీరు కాదు. మీ పని నేను చేయమన్న చోట సంతకాలు చేయడమే!హుంకరించింది ఢిల్లీ
నాలుక కరుచుకున్నాడు ఆంతరంగికుడు. ఇంకా చూస్తావే? వెంటనే మన పురావస్తు పరిశోధన విభాగం యొక్క డైరెక్టర్‌కి ఫోన్ చేసి ఆ పనిలోనే ఉండమని చెప్పు,” పాద దాసుకి ఆర్డర్ వేశాడు ఆంతరంగికుడు. ఆయన ఆ పని చేయడానికి పరిగెత్తాడు.
ఆ తరువాత అన్ని పనులు చక చకా జరిగిపోయాయి. ఏ పని లేకుండా సామాన్య జనంతో  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ క్విజ్ ఆట ఆడుకుంటున్న  పురావస్తు పరిశోధన విభాగం వారు ఎగిరి గంతేసి తవ్వకాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్ళని  ఎడా పెడా తవ్వేశారు.
ఒక ఆర్నెల్లు  తవ్వినా నల్ల ధనం కాదు కద, తెల్ల’ కాగితం కూడా దొరకలేదు వారికి.
కొంప దీసి అక్కడ ఉందో లేదో, ” అనుమానం వెలిబుచ్చాడు పాద దాసు.
ఊరి మీద ఒట్టు, ఖచ్చితంగా ఉంది! ఏదో మన దేశానికి డబ్బు అవసరం అని డిల్లీ వారు  కష్ట పడి కల కన్నారు నాయనా,” చిన్న బుచ్చుకున్నాడు ఆయన  పూజారి.
ఇంకొన్ని రోజులు గడిచాయి. అబ్బే లాభం లేకపోయింది.
స్వామీ, మీరు చూపించిన అన్ని చోట్ల కిందా తవ్వాము. ఆ హడావుడిలో నా జేబులోఉన్న వంద ఎక్కడో పడిపోయింది కానీ, ఏ డబ్బూ  దొరకలేదు. కొత్త చోటు చూపించండి,” కాస్త చిరాగ్గానే అడిగాడు పురావస్తు డైరెక్టర్.
అది నేను చెప్పాలా, నాయనా! ఎక్కడెక్కడ తవ్వలేదో ఆ ప్రదేశాల్లో కూడా తవ్వేయ్యండి,” ఉచిత సలహా పారేశారు ఢిల్లీ గారు.
ఏంటో, కనీసం ఒక కేజీ నల్ల ‘నల్ల ధనం’ ఐనా దొరికితే కాని పరువు దక్కేలా లేదు,” తనలో తాను గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్.
ఇప్పుడు చెప్పు విక్రమార్కా? కేవలం ఒక’ కల’ ఆధారంగా ఇలాంటి నిర్ణయం గురివింద ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఇప్పుడు దీని వల్ల ఎంత డబ్బు నష్టం, ఎంత పరువు నష్టం? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్ప లేక పోయావో, నీ తలలో ఒక కేజీ ‘నల్ల ధనం’ ఉంది అని పాద దాసుకి చెప్తాను. ఆయనే నీ తల వెయ్యి ముక్కలు చేస్తాడు,” నవ్వుతూ అడిగాడు బేతాళుడు.
నీ శ్యాడిజం తగలెయ్యా! ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజల ఇళ్ళ కింద తవ్వించడం వల్ల ఢిల్లీ పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. గవర్నమెంటు ఖర్చుతోనే ఆ పని జరిగింది. ఒక వేళ నల్ల ధనం దొరికి ఉంటే, ఢిల్లీ విజ్ఞత గురించి, ఆంతరంగికుడు’ మాట మీద తనకి కి ఉన్న గౌరవం గురించి దేశమంతా టముకు వేస్తూ తిరిగే వారు. దొరకలేదు కాబట్టి ఆ తప్పుడు నిర్ణయం ఆంతరంగికుడి’దే  అని చేతులు దులుపుకుంటారు. భయపెట్టో బ్రతిమాలో అందర్నీ  ‘గురివింద’ లో చేరేటట్టు చూస్తారు  కనక, ఎలాంటి అపప్రథ వచ్చినా వాళ్ళు లెక్ఖ చేయరు,” బదులిచ్చాడు విక్రమార్కుడు.
ఆ సమాధానం కరెక్ట్ కావడంతో, అతని భుజం మీదనుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు. తృణమో ఫణమో ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చెప్ప గలిగే, పొన్నూరులో కొత్తగా వెలసిన, బార్ అండ్ వైన్స్ దగ్గరకు పరిగెత్తాడు విక్రమార్కుడు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card