భారత ప్రధాని నరేంద్ర మోదీని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని గాఢాలింగనంలో చూసినప్పుడు,
ఆ దృశ్యంలో ఏదో అసంబద్ధత కనిపించింది. ఆ కౌగిలి అసమానమైనదన్న అవగాహన గురించి తరువాత చూద్దాం. ఈ ఉధృత
కరచాలనాలను, దేహచాలనాలను యథాతథ అర్థంలో స్వీకరించడానికి ఇటీవలిచరిత్ర
అడ్డం పడుతున్నది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీకి అమెరికన్ ప్రభుత్వం-
అదీ రిపబ్లికన్ల జార్జి బుష్ ప్రభుత్వం-
మతస్వేచ్ఛను భంగపరిచినందుకు గాను వీసా నిరాకరించింది. ఆ నిషేధం బరాక్ ఒబామా కూడా
కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు అమెరికా ప్రవేశానికి మోదీకి అవకాశం దక్కలేదు. అప్పటి యూపీఏ
ప్రభుత్వం సూచన మేరకే
అమెరికా ఆ చర్య తీసుకున్నదని చెబుతారు. యూపీఏ అమెరికాకు అట్లా సిఫారసు చేయడం కానీ, అమెరికా దాన్ని పాటించడం కానీ వాంఛనీయం కాదు.
భారత ప్రజలు, ప్రభుత్వం మోదీ విషయంలో కానీ, మరెవరి విషయంలో కానీ తమకు తోచినట్టు వ్యవహరించవచ్చును, కానీ, ఒక పరాయి ప్రభుత్వం భారతీయ నాయకుడి
విషయంలో నిషేధాలకు
పాల్పడడం భారతప్రజలు హర్షించేది కాదు. గుజరాత్ హింసాకాండలో మోదీ ప్రమేయాన్ని అధికారికంగా గుర్తిస్తూ
వచ్చిన అమెరికా, మోదీ భారత ప్రధాని అయ్యే సమయానికి ఆంక్షలను ఎత్తివేసింది.
అదే మోదీ చేత అమెరికన్ కాంగ్రెస్‌లో ఉపన్యసింపజేసింది. ఇప్పుడు వైట్‌హౌస్‌కు ఆహ్వానించి
విందులు చేసింది.
ఊపిరాడని కావులింతల్లో తబ్బిబ్బు చేసింది. ఆ సమయంలో మోదీ ఏమనుకుని ఉంటారు? ఒకనాడు కాదన్న అగ్రరాజ్యం తన దారికి వచ్చిందనుకుని ఉంటారా? చిన్నపాటి అతిశయపు విజయహాసం ఆయన మనసులో అయినా
మెరిసి ఉంటుందా? ఆ ‘విజయం’ మూల్యం ఎంతో ఆయనకు తెలుసునా?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment