ఈ దేశం నెమ్మదిగా దారి తప్పింది ......................................
అనగనగా జంబూ ద్వీపమనే ఒక దేశం ఉండేది.
మిగతా దేశాలలో జనాలు అనాగరికంగా చెట్లూ పుట్టలూ పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఈ దేశానికి ఒక
గొప్ప చరిత్రా, సంస్కృతీ ఉండేవి. ఎవరి శక్తికి తగ్గ వృత్తిని వారు ఎన్నుకొనే వ్యవస్థ ఉండేది. లెక్కకు మించిన
సంపద ఉండేది. అన్నిటికీ మించి వెర్రి భక్తి, మూఢ నమ్మకాలు కాకుండా అధ్యాత్మికత ఈ దేశాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ
ఆదర్శంగా నడిపించేది.
ఐతే ఈ దేశాన్ని అలసత్వం ఆవహించింది.దాని వల్ల ఈ దేశం నెమ్మదిగా దారి
తప్పింది. కాని పునాదులు బాగా గట్టిగా ఉన్న భవంతి ఎలా ఐతే రక రకాల తాకిడులు తట్టుకుని చాలా కాలం
కూలిపోకుండా నిలబడుతుందో, అలాగే ఈ దేశం కూడా వెంటనే భ్రష్టు పట్టలేదు. దానికి కొన్ని వందల ఏళ్ళు పట్టింది.
మెల్లగా ఎవరి
శక్తికి తగ్గ పని వారు చేయాలి అనే సిద్ధాంతం, ఏ పని చేసేవాడి పిల్లలు అదే పని చేయాలి అనే వర్గీకరణ కింద మారిపోయింది. సమాజం నానా వర్గాలుగా విడిపోయింది.
అధ్యాత్మిక జ్ఞానంతో జాతికి దారి చూపాల్సిన వారు అది మర్చిపోయి సంప్రదాయాలలో కూరుకుపోయారు. ప్రతి
పాపాన్ని ఒక పూజతోనో యాగంతోనో కడిగేసుకోవచ్చు అన్న నమ్మకం పెరిగింది. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్న ధోరణి ఎక్కువయ్యింది. తద్వారా
విద్వత్తు కంటే డబ్బుకి పెద్ద పీట వేసే తప్పుడు సంస్కారం జనాలకు అలవడింది.
ఆఖరికి పరాయి దేశస్తులు దండెత్తి వచ్చినా, జంబూ ద్వీపంలో ఒక వర్గం మాత్రమే యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల కలిగిన భయంకర పరిణామం ఏమిటంటే, మిగతా వర్గాలు దేశ రక్షణ అందరి
కర్తవ్యం అనే మాములు నిజాన్ని మర్చిపోవడం. అలా జాతి నిర్వీర్యమయ్యింది.
ఐతే ఎప్పటికప్పుడు కొందరు మహానుభావులు దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రాత:స్మరణీయుల వల్ల పతనం ఆలస్యం
అయినప్పటికీ పూర్తిగా ఎప్పుడూ ఆగి పోలేదు. పాకుడు మెట్ల చందానా జాతి ఒక్కొక్క మెట్టు
దిగజారుతూనే వచ్చింది.
జంబూ ద్వీపం అనేకమార్లు బానిస దేశంగా మారింది. గత అరవయి ఏళ్ళనుండి మాత్రమే స్వతంత్ర్యంగా ఉంది. కానీ
ఏన్నో ఏళ్ళ బానిసత్వం దారిద్ర్యం ప్రజలను క్రుంగ దీశాయి. ఆత్మ గౌరవం అడుగంటి పోయింది.
ఐతే గత పదేళ్ళుగా జంబూ ద్వీపంలో నవోత్సాహం నిండుకుంది. కొన్ని భౌగోళిక పరిణామల వల్ల ఆ దేశం మళ్ళీ
సంపన్నంగా మారసాగింది. ఇది జనాల్లో కొత్త ఉత్సాహానికి దారి తీసింది. మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ప్రజల్లో నమ్మకం పెరిగింది.
ఐతే అందరూ మరిచిపోయిన విషయం ఒక్కటి ఉంది. జంబూ ద్వీపం పతనం బానిసత్వం వల్లో, దారిద్ర్యం వల్లో జరుగలేదు. అవి
కేవలం ఫలితాలు మాత్రమే. కారణాలు కావు.
అసలు కారణం జంబూ ద్వీపం తన ఆత్మ ఉనికి మర్చిపోవడం. ఆధ్యాత్మిక వైఫల్యం.
ఈ సత్యం జంబూ ద్వీప వాసులకు అర్థం కాకపోయినా, దాన్ని బానిసలుగా చేసిన వారికి బాగా అర్థమయ్యింది. అందుకనే
వాళ్ళు జంబూ ద్వీపాన్ని అధ్యాత్మికంగా మళ్ళీ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. జంబూ ద్వీప చరిత్రని మార్చారు. మహా వీరులను కొండ
ఎలుకల్లా చిత్రీకరించారు. నియంతలను ధర్మ ప్రభువులుగా కొనియాడారు. జంబూ ద్వీప వాసుల ఆత్మ న్యూనతను వేయింతలు చేశారు.
ఆ లోటు ఇంకా భర్తీ కాలేదు.
అధ్యాత్మికంగా ఇంకా జంబూ ద్వీప ప్రజలు వెనుకపడే ఉన్నారు. ఎప్పటిదాకా ఆ లోటు పూరించబడదో అప్పటి దాక జంబూ ద్వీపం
తన పూర్వ వైభవాన్ని పొందదు.
ధనం తెచ్చే భద్రత తాత్కాలికమే. విలువలు లేని సంపద చివరికి వ్యర్థమవుతుంది
లేదా మళ్ళీ పరుల పాలవుతుంది.
ప్రస్తుతం జంబూ ద్వీపానికి కావలసింది ఒక కౌటిల్యుడు. అవును కౌటిల్యుడే. అప్రాచ్యులు దండెత్తి వచ్చినప్పుడు, రాజుల నుంచి సామాన్యుల వరకు వర్గ విభేదాలు మరచిపోయేలా చేసి, జంబూ ద్వీపాన్ని ఒక తాటి మీదకు
తెచ్చిన కౌటిల్యుడు. అన్యాయాన్ని సహిస్తూ బతకడం కన్నా ఎదిరిస్తూ మరణించడం
గొప్పదన్న కౌటిల్యుడు. కుటుంబం కోసం సభ్యుడిని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశాని కోసం గ్రామాన్ని ఫణం పెడితే తప్పు లేదని నిర్మొహమాటంగా చెప్పిన కౌటిల్యుడు…
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment