Monday, July 17, 2017

బుద్ధుడ్ని ‘అవతారం’ చేసి చంపినట్లే అంబేద్కర్ ను హతమార్చేస్తున్నారు






                                   మతం-కులం విడదీయరానంతగా పెనవేసుకపోయాయి. కులాన్ని మాత్రమే తొలగించాలని కమ్యూనిస్టులు, సోషలిస్టు కుల నిర్మూలన సంఘాలవారు ప్రయత్నించి విఫలమయ్యారు. మతం జోలికి యెవరూ పోలేదు. అంబేద్కర్ మాత్రమే కొంతవరకు యీ ప్రయత్నం చేసి, బౌద్ధంలో అంటరానితనం, కులం వుండదు గనుక అది స్వీకరించమన్నాడు. ఆయన చెప్పిన బౌద్ధాన్ని యీ దేశంలో ఏనాడో చంపేశారు. మిగిలినదల్లా క్షీణించిన హీనయాన, మహాయాన, వజ్రాయాన జాడ్యాలన్నీ అందులో వున్నాయి. కనుకనే బౌద్ధంలోకి మారిన కులాల వారి స్థితి ఏ మాత్రం మారలేదు.

                                      కులం పోగొట్టడమనేది యెదురీత. రిజర్వేషన్ల పేరిట రాష్ట్రంలో, కేంద్రంలో జరిగే కాండ అంతా కులోద్ధరణకు ఉపకరించింది. ఓట్ల కోసం జరిగే ప్రయత్నంగా మిగిలింది తప్ప ఇందులో మరో దృష్టి కనిపించలేదు. మండల్ కమీషన్ నివేదిక, మురళీధరన్ కమీషన్ నివేదిక,అమలుపరుస్తానని  అన్నప్పుడే యీ ధోరణి వెల్లడైంది. అదే దేశవ్యాప్తంగా కనిపించింది. అంబేద్కర్ పేరిట జరుగుతున్న మోసం కూడా యీ రీతిలోనే వున్నది. అంబేద్కర్ రాజకీయ పార్టీలకు అవసరం లేదు. ఆయన్ని అడ్డం పెట్టుకొని విగ్రహాలు వేసి, ఆరాధనలు చేసి, దండలు వేసి, నినాదాలతో  ఆకర్షించే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ వూబిలో పడి కొట్టుకుంటున్న కులాల నాయకులు నిజాన్ని గ్రహించలేక, వేసిన మేతవరకే తృప్తిపడుతున్నారు. రాజకీయవాదులు యీ బలహీనతల్ని బాగా వాడుకుంటున్నారు. పదవులు పొందిన కులాల నాయకులు, ఉద్యోగాలలో వున్నవారు అంతవరకే చాలు అనుకుంటున్నారు. బుద్ధుడ్ని అవతారం చేసి చంపినట్లే అంబేద్కర్ ను హతమార్చేస్తున్నారు. ఇది మతపరంగా చాకచక్యంతో జరుగుతున్న కులయజ్ఞమే

                                       నా మతం గొప్పది, దాని ద్వారానే మోక్షానికి పోతారని, ఏ మతానికి ఆ మతం బోధిస్తున్నది. నేను నమ్మిన దేవుడే సర్వోత్తముడని భక్తులు నమ్ముతారు. మిగిలిన మతాలు, మిగిలిన దేవుళ్ళు తక్కువే అని అర్థం. ఆ దృష్టితోనే మత మార్పిడులు, మత కలహాలు వచ్చాయి. మత దూషణలు-కాఫిర్లు, మ్లేచ్ఛులు, పేగన్లులాంటి మాటలు వచ్చాయి.
కులమూ అంతే. ఎవరికి వారు నా కుల కట్టుబాటు మంచిది అనుకుంటారు. ఇదీ మతపరంగానే వచ్చింది.
మతం, కులం కట్టుబాట్లు లేకుంటే మానవుడు కట్టలు తెంచిన స్వేచ్ఛతో అరాచకత్వం సృష్టిస్తాడని, భయపెట్టి, స్వర్గం, పాపం, నరకం, దేవుడు, మతం, కులం అనే భయంకర ‘అమానుష ఆయుధాలు’  మన పూర్వీకులు వాడారు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card