Monday, July 17, 2017

‘ఏది చీకటి, ఏది వెలుతురు?’----- పాట ఒకటే..... చిత్రీకరణలేన్నో!




            పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి!
ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది.
ఆకలి రాజ్యంసినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో అనుకుంటా) ఆ సినిమా చూశాను. అప్పుడే నాకు ఈ పాట చాలా గొప్పగా అనిపించింది.
        ఆకలి రాజ్యం సినిమాలో ఈ పాట వినండి!ఆకలి రాజ్యం లోని పాట ఒరిజినల్ పాట. దీనికి సంగీత వాయిద్యాల సహకారం లేదు. ఒక బ్లాగ్ లో వాయిద్య సహకారంతో ఈ పాట చూశానీరోజు.  విరోధిసినిమాలో కూడా ఈ పాట వాడారని తెలిశాక ఎంత వెనకబడి ఉన్నానా అనుకున్నాను. ఈ సినిమాలో ఈ పాట దృశ్యీకరణ రోమాంచితం అనిపించింది. నీలకంఠం దర్శకత్వం లోని కధ కావడం వలన అలా ఉన్నదనుకుంటాను.
ఈ కవితలో అన్నీ ప్రశ్నలే.
              శ్రీ శ్రీ తెలియకనే ఈ ప్రశ్నలు వేశారా? కాదని నా అభిప్రాయం. నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆయన ఇతర అనేక కవితల ద్వారా చెప్పారు. ఇవి సమాధానాలు తెలియక వేసిన ప్రశ్నలు కాదు. సమాధానాలు అనేకానేకం కళ్ల ముందు కనపడుతున్నా వాటిని ఆవాహన చేసుకోలేని జనాన్ని చూసి వేసిన ప్రశ్నలని నాకు క్రమ క్రమంగా తోచింది.
          పరిసరాల జ్ఞానం ఇంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిఫలించినపుడు పుట్టేదే భావం. ఈ భావానికి, ఎదుట కనిపించే వాస్తవానికి మధ్య అంగీకారయోగ్యమైన పొంతన కుదరని పరిస్ధితుల్లో దైవ భావన పుట్టింది. కానీ శాస్త్రం అభివృద్ధి చెందే కొద్దీ దైవ భావన అంతరించాల్సి ఉండగా మరింత బలం సంతరించుకుంది. దానికి కారణం మానవ సమాజంలో ఏర్పడిన వర్గాలు.
మానవ సమాజంతో పాటు అభివృద్ధి అవుతూ వచ్చిన ఉత్పత్తి సాధనాలను కొద్దిమంది స్వాయత్తం చేసుకోవడంతో అలా చేసుకున్నవారు దోపిడి వర్గంగానూ, ఉత్పత్తి సాధనాలపై పని చేస్తూ కూడా ఆ పని ఫలితాన్ని అనుభవించలేనివారు దోపిడీకి గురయ్యే వర్గంగానూ అవతరించారు.
            ఈ వర్గ దోపిడీని వివిధ దైవ సిద్ధాంతాలు న్యాయబద్ధం (legitimize) చేశాయి. ఏదయితే అసహజమో దాన్ని సహజం అన్నాయి. ఏదయితే కూలిపోవాలో అది నిలవాలన్నాయి. ఏదయితే అశాశ్వతమో అదే శాశ్వతం అన్నాయి. దోపిడీ వర్గాలకు ఏది నీతో అదే అందరికీ నీతి అన్నాయి. ఏది నిజమో దాన్ని భ్రమ అన్నాయి. ఏది భ్రమో అదే నిజం అన్నాయి.
          మనిషి చుట్టూ కమ్మిన ఈ మాయా ప్రపంచం మనిషిని ఇంకా తన బానిసగానే ఉంచుకుంది. మనిషిని అయోమయంలో ఉంచడంలొ అదింకా సఫలం అవుతూనే ఉంది. దానిని మాయ అని గుర్తించినవానికి అనేక పేర్లు పెట్టింది.
         స్పార్టకస్, బ్రూనో, కోపర్నికస్, చార్వాకుడు, కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, వి.ఐ.లెనిన్, జె.స్టాలిన్, మావో జెడాంగ్, నక్సలైట్…. పేరేదైతేనేం? వారిలో కొందరిని నడి బజారులో తగలబెట్టి చంపారు. కొందరిని ఉరి తీశారు. ఇంకొందరిని దేశ దేశాలు తరిమి తరిమి వేటాడారు. ఇంకా వేటాడుతూనే ఉన్నారు.
           శ్రీ శ్రీ కి సమాధానాలు తెలుసు. తనకు తెలిస్తే చాలదు కదా. అది అందరికీ తెలియాలి. అలా తెలుసుకొమ్మని చెప్పడానికి ఆయన ప్రశ్నల కొడవళ్ళను మన ముందు నిలిపి పోయారు. ఆ ప్రశ్నలకు సరిగమలు అద్ది తన్మయత్వంతో మనం ఇప్పుడు పాడుకుంటున్నాం.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card