Saturday, July 08, 2017

రామా ఏమిటీ ఖర్మ


విద్యావ్యవస్థలో ప్రమాణాలు ఉండవల్సిన స్థాయిలో లేవని అందరికీ తెలుసు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వేల సంఖ్య లో పాఠశాలలను, కళాశాలలను ఏర్పాటుచేసినప్పటికీ, వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించుకున్నప్పటికీ ఫలితాలు ఆశించినస్థాయిలో లేవన్న విషయం అన్ని కమిటీలు తేల్చిచెప్పాయి. ఉన్న త విద్యను అభ్యసించిన విద్యావంతులు కూడా తమ మాతృభాషలో తప్పుల్లేకుండా నాలుగు వాక్యాలు రాయలేని పరిస్థితి కనీస విషయ పరిజ్ఞానం లేని దుస్థితి తరుచూ మన అనుభవంలోకి వస్తుంది. అటువంటి పరిస్థితికి అద్దం పట్టే ఆడియో ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఒక తెలుగు ఉపాధ్యాయుని నియామకానికి ఎం.ఏ. ఎంఈడీ విద్యార్హతలున్న అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసిన సందర్భమది. ఆ ఆడియోను విన్నప్పుడు అంత నమ్మదగినదిగా అనిపించలేదు. కల్పితమైనదయి ఉండవచ్చని భావించాను. ఆ ఆడియో నూటికి నూరు శాతం నిజమేనని నిర్ధారణయింది. మన విద్యావ్యవస్థలోని ప్రమాణాల పరిస్థితికి అద్దంపట్టే సంభాషణ అది.
కరస్పాండెంట్: ఏ పోస్టుకు ఐప్లె చేసుకున్నారు?
అభ్యర్థి: తెలుగు పోస్టు సర్.
ప్రశ్న: ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఉందా?
జవాబు: ఉంది సర్. ఒక ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ తెలుగు చెప్పాను.
ప్ర: సవర్ణదీర్ఘ సంధి సూత్రం చెప్తారా?
జ: అ,ఇ,ఉ,ఋ లకు అవే అచ్చులు పరమైనచో వాటి ధీర్ఘాలు ఏకాదేశమగును.
ప్ర: ఉదాహరణ చెప్తారా? జ: రాముడు, ఆంజనేయులు...
ప్ర: రాముడా!? రా+ముడునా!? జ: అవును సర్.
ప్ర: ఇక్కడ అ, ఉ,లు ఎక్కడ వచ్చినాయి?
జ: ర, దగ్గర అ వచ్చింది. ము కాడ ఉ వచ్చింది.
ప్ర: మరి దీర్ఘం ఎక్కడ వచ్చింది? జ: ర పైన దీర్ఘం ఉంది సర్.
ప్ర: గుణసంధి సూత్రం చెప్తారా?
జ: ఆ,ఈ,ఉ, ఋలకు క్రమంగా ఏ,ఓ,ఆర్‌లు వస్తాయి సర్.
ప్ర: ఆ,ఓలు తెలుసు. ఆర్ ఏమిటి? ఇంగ్లీషు అక్షరము కదా!
జ: ఆర్ అంటే నకరాపొల్ వస్తది సర్ ఆఖరికి.
ప్ర: నకరాపొల్? అదేంటది!? ఇప్పటిదాకా విన్నట్లు లేదు.
జ: రా పూల్, నకరాపొల్ సర్.
ప్ర: ఎప్పుడు విన్నట్లు లేదు. బహుశా నాకు తెలియకపోయుండొచ్చు.

జ: అవును సర్. నకరాపొల్ వస్తది సర్.
ప్ర: ఉదాహరణ చెప్పండి?
జ: రామేశ్వర్ సర్. అంటే న కు నకురాపొల్ లాస్ట్‌కు, ఆఖరికి ఆర్ వచ్చింది సార్. అంటే అది గుణసంధి సర్.
ప్ర: మీకు నచ్చిన కవి ఎవరండి? జ: బమ్మెర పోతన సర్.
ప్ర: ఆయన రచించిన గ్రంథమేది?
జ: వీరభద్ర విజయం, బోగిని దండకం, నారాయణ శతకం సర్.
ప్ర: శ్రీమదాంద్ర మహా భాగవతం ఎవరు రాశారు?
జ: బమ్మెర పోతన సర్
ప్ర: మీకేదైనా పద్యం వచ్చా?
జ: వచ్చు సర్.. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ గూర్చుండు విశ్వంభరుడు అలితిపోడు.
ప్ర: విశ్వంభరుడు అంటే ఎవరండి?
జ: విశ్వంభరుడంటే ఇక్కడ విష్ణుమూర్తి సర్. అంటే అన్ని ఒకటేసారి తీసుకపోతాడు సర్.

ప్ర: అంటే ఎక్కడికి తీసుకపోతాడు?
జ: ఆ కులము వంశములోని అన్ని రాజ్యములు మూడు లోకాలు కావాలనుకొంటాడు సర్ విష్ణుమూర్తి. దానము చేస్తాడా చెయ్యడా అని కొంచెము టెస్ట్ చేస్తాడు సార్.
ప్ర: ఎవరు దానం చేస్తారని? జ: బలిచక్రవర్తి సార్.
ప్ర: బలిచక్రవర్తి ఎవరు ? జ: విలోచనుని మనుమడు సర్.
ప్రశ్న: పరవస్తు చిన్నయసూరి గురించి తెలుసా?
జ: అంటే ఇంతవరకు రాలేదు సార్.
ప్రశ్న: గురజాడ అప్పారావు గురించి తెలుసా?
జ: దాని గురించి రాలేదు సార్. అంటే సిక్త్స్ వరకే ఉంటది సార్. నేను టెన్త్ వరకే తీసుకున్న సర్.
ప్రశ్న: దాశరథి రంగాచార్యుల పేరు ఎప్పుడన్నా విన్నారా ?
జ: శ్రీరంగం శ్రీనివాసరావా సార్ ?
ప్రశ్న: పోనీ శ్రీరంగం శ్రీనివాసరావు గురించి ఏమై నా తెలుసా ?
జ: తెలుసు సార్.
ప్రశ్న: ఎవరాయన?
జ: రచయితల్లో ఫేమస్ సర్.

ప్రశ్న: ఎట్లా ఫేమస్ అయ్యాడు?
జ: ఆయన సంపదలోనే మూలధనంలోనే ఇతరులకు సహాయం చేసే గుణం సర్ ఆయనది.
ప్రశ్న: అంటే డబ్బులు బాగా సంపాదించి ఇతరులకు సాయం చేస్తాడా ?
జ: అవును సార్.
ప్రశ్న: జమీందారా ఆయన?
జ: అంటే జమీందార్ కుటుంబంలో జన్మించిన వ్యక్తి సర్.
ప్రశ్న: ఏమి ఆస్తులు దానం చేసాడాయన?
జ: తాను దాచుకున్న డబ్బులను కూడా ఇతరులకిస్తాడు.
ప్రశ్న: ఆయనకు ఆదాయం ఎక్కడినుంచి వచ్చేది ?
జ: ఆయన తండ్రి నుంచి ఆస్తి నుంచి కొంచెముండే సార్ ఎమౌంటు.
ప్రశ్న: దానం చేయటం కాకుండా ఏమైనా పుస్తకాలు రాసిండా?
జ: పుస్తకాలంటూ ఏమి లేవు సర్.

ప్రశ్న: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు అని ఎవరో ఒకాయిన రాశాడు.. ఎవరో ఐడియా ఉందా? జ: నిశబ్దం. (జవాబు చెప్పలేదు)
ప్రశ్న: జగన్నాథ రథచక్రాలంటే ఏమిటండి? మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది... పోదాం పోదాం పైపైకి అన్నాడు ఒకాయిన. ఎవరాయన?
జ: ముందుకు పోవటం.
ప్రశ్న: మరో ప్రపంచం అంటే ఏమిటి?
జ: అంటే వేరే ప్రపంచంలో యుద్ధాలు కాకుండా.. అంటే వేరే కంట్రీలోకి.
ప్రశ్న: అంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోకా?, జ: అవును సార్.
ప్రశ్న: ఆయన పిలుపు మేరకేనా మనవాళ్లు వీసాలు తీసుకొని అమెరికా కు వెళ్ళిపోతున్నారు? జ: అవును సర్.
ప్రశ్న: ఆయన రాసి మన సమాజానికి ఎంత ఇబ్బంది పెట్టాడు. మనవాళ్ళేమో వీసాలు తీసుకొని వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు. మరి ఆయనను అరెస్ట్ చేయాలె కదండి!
జ: ఆల్‌రెడీ జైలులో ఉన్నాడు సార్.
ప్రశ్న: సాలరీ ఎక్స్‌పెక్టేషన్ ఎంతండి?
జ: అక్కడ ట్వంటీ ఫైవ్ థౌసెండ్స్ ఇచ్చారు.

ఆరవ తరగతి విద్యార్థికి ఉండవల్సిన కనీస భాషా, విషయ పరిజ్ఞానం కూడా లేవని అర్థమవుతున్నది. మరి అతను రెండు పీజీ డిగ్రీలు ఎలా సంపాదించాడు? అంటే అతనిలో కనీస అభ్యసన స్థాయిలు లేకున్నా సంబంధిత పరీక్షల్లో పాస్‌చేసి పై తరగతులకు పంపిస్తున్నారన్నమాట. ఈ తంతు ఒకటవ తరగతి నుంచి మొదలుకొనే యూనివర్సిటీ వరకు కొనసాగుతుంది. ఇలా అయితే మానవ వనరుల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ పరిస్థితికి ఏ ఒక్కరినో తప్పుపట్టి ప్రయోజనం లేదు. విద్యావ్యవస్థ లోని ప్రక్రియలైన ఉపాధ్యాయ శిక్షణ, బోధనాభ్యసన కార్యక్రమం పరీక్షల నిర్వహణ వంటివి అన్ని యాంత్రికమైపోయినవి. జీవనదిలా సజీవంగా తొణికిసలాడాల్సిన ఈ ప్రక్రియలన్నీ క్రమంగా నిర్జీవంగా మారుతున్నవి. విద్య అంతిమ లక్యం ఏదో విధంగా పరీక్షలన్నీ పాసై మార్కులు, గ్రేడులు, డిగ్రీ లు సంపాదించటంగా మారిపోయింది. ఒకప్పుడు గ్రామాల్లో పాఠశాలలు లేవు. ఎటుచూసిన నిరాక్ష్యరాస్యత కనిపించేది. రాయటం రాకపోయినా నాటి గ్రామాల్లోని కొంతమంది సుమతీ శతకం, వేమన శతకం, భాగవతంలోని పద్యాలను సందర్భోచితంగా వల్లె వేస్తూ వాటిలోని తాత్వికతను అన్వయించి సమస్యలు పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు తెలుగులో పీజీ డిగ్రీ చేసిన విద్యార్థులు కూడా నాలుగు పద్యాలను భావయుక్తంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల నుంచి మొదలుకొని యూనివర్సిటీ ఆచార్యుని వరకు, ప్రధానోపాధ్యాయుల నుంచి విశ్వవిద్యాలయ కులపతి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వరకు ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. పర్యవేక్షణను పటిష్ఠం చేయవలసి ఉన్నది. మదింపు నివేదికలను క్రమంప్ తప్పకుండా తెప్పించుకునే పరిస్థితులను కల్పించుకోవాలి. లేకపోతే ఎన్ని వేలకోట్లు కుమ్మరించినా, ఎన్ని నియామకాలు చేపట్టినా ఆశించిన ప్రయోజనం లభించలేదు....ధరనికోట సురేష్ కుమార్, ఆడిటర్, పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card