Wednesday, February 22, 2017

పనిలేనివాడు చేసే పని కాదు, పనిలో ఆరితేరినవాడు మాత్రమే చేయగల పని



   


    ‘పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడని’ సామెత, దీనివల్ల  ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ఉపయోగపడని పని చేస్తుంటే వారిని ఉద్ధేశించి ఆ సామెత ప్రయోగిస్తాం.ఈ సామెత అసలు రూపం "పని లేని మంగలి ‘పిలిచి’ తల గొరిగినట్లు" - అయితే అది ఇలా అపభ్రంశం చెందింది.
             పనిలేని క్షురకుడు పిల్లి తల క్షవరం చేశాడనే సామెతలో ఎంత దుర్మార్గమైన అపవాదు వుందో తెలుసా..?క్షురకవృత్తి చేసే కార్మికుడు పిల్లి తల జోలికి ఎప్పుడు వస్తాడో చెప్పండిసానపెట్టిన కత్తికి ఒక్క తలకాయా దొరక్కపోవడం వల్ల వస్తాడు. బస్తీలో అందరూ గడ్డాలూ మీసాలూ పెంచేసుకుని గల్లీకొక బాబా చొప్పున జనాల్ని మోసం చేయడంలో బిజీగా వున్నప్పుడు, గుంపులు గుంపులుగా జనమంతా మెడమీద వాటాలన్నీ (తలలు) వడ్డీకాసులవాడికి మొక్కుకుని కల్యాణకట్టలో వాలిపోయినప్పుడు, మన వూరి కార్మికుడికి దక్కాల్సిన కనీస ఆదాయం ఏదీ కనుచూపుమేరలో లేకుండాపోయినప్పుడుకనీసం జుట్టు గొరిగించు కోవటానికి కూడా డబ్బులేనంత దరిద్రంలో సమాజం వుంటే... అప్పుడు.... కేవలం అప్పుడే...తన వృత్తిని మర్చిపోకుండా వుండేందుకు నిరుపేద అయిన ఆ క్షురకుడు ఒక పిల్లిని దొరకబుచ్చుకోవచ్చు.
              నోరులేని ఆ జీవాన్ని మనిషిమాదిరి నాగరికుడ్ని చేసే ప్రయత్నంలో గడ్డాలూ మీసాలూ తీసేపని పెట్టుకోవచ్చు.. ఇది రాజద్రోహం కాదు, పస్తులున్న అతని కుటుంబానికి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వదిలేసిన ఈ సమాజమో, రాజ్యమో చేస్తున్న హింస అని నేను అంటాను. అయితే దీనివల్ల పిల్లితో సహా ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు కదా అనే లా పాయింటు మీరు నన్ను అడగచ్చు. ప్రయోజనంలేని పన్లతో దేశమంతా కిటకిటలాడ్డంలేదా. నిండునూరేళ్ళపాటు నిద్రపోవడానికే పదవి పుచ్చుకున్న మాజీమంత్రివర్యులు దేవెగౌడ వల్లగానీ, డబ్బుచేసిన ఒక సుపుత్రుడు ఇటీవల చేసుకున్న అయిదురోజుల పెళ్ళివల్లగాని, పాలాభిషేకాలు, నట, రాజకీయ ,వారసత్వ పట్టాభిషేకాలు....ఇంకా ఇంకా అనేకానేక పనికిరాని పన్ల వల్లగాని దేశానికేమిటి ప్రయోజనం అని నేను అడగను. ఎందుకంటే కొన్ని వార్తలు వినడం మూలంగా, ఎలా బతకడం దేశానికి అనర్థమో తెలుస్తుంది. గీటురాయికి మంచి నకళ్ళే కాదు, చెడ్డ నకళ్ళు కూడా కావాలి.
                ఈ నేపథ్యంలో పిల్లికి గడ్డం చేయడంకంటే సృజనాత్మక మరియు మానవీయ దృశ్యం మరొకటి లేదని నా అభిమతం.అసలు పిల్లికిగడ్డం చేయడమంటే ఎంత కష్టమో ఒకసారి ఊహించండి. మొదట భయపడి పారిపోతున్న దానిని ప్రేమతో బుజ్జగించాలి. చిన్నగిన్నెలో పాలు తాగించాలి. పాలు తాగుతున్నంతసేపు దాన్ని వెన్నుమీద నిమురుతూ మన ఉనికివల్ల దానికి భరోసా కలిగించాలి. ఇంతచేసినాసరే సాన మీద కత్తిని తిప్పగానే గుర్రున అరిచి గుడ్లు పీకేయవచ్చు. నువ్వు కత్తి పట్టుకున్న కారణం దానికి తెలియదు కదా. ఆ సందర్భంలో కూడా నిలదొక్కుకొని, సహనంగా పసిబిడ్డ మాదిరి దానిని ఒడిలో కూర్చోపెట్టుకొని క్షవరకార్యం పూర్తిచేయాలి.
                  కాబట్టి అది పనిలేనివాడు చేసే పని కాదు, పనిలో ఆరితేరినవాడు మాత్రమే చేయగల పనియని విన్నవించదలుచుకున్నాను. ఎందుకంటే, దీనివల్ల ఎలాంటి పారితోషికమూ ఉండదు. తట్ట పట్టుకొని కెమెరాకి ఫోజులిచ్చే జన్మభూమి అధికారుల మాదిరి కాకుండా, జీవకారుణ్యంతో, నిజాయితీతో కత్తి నడపాలి. ఎక్కడ తెగకుండా, రక్తం చిందకుండా, కాచిన జున్నుగడ్డ మీద మిరియాలపొడి అద్దినంత నైపుణ్యంతో మార్జాల నీలాల్ని తీసేయాలి.
                   కాబట్టి పనికి వంకలు పెట్టేవాళ్ళు నిజంగా పనిలేనివాళ్ళుగా మనం గుర్తించాలి..అంటే దేశంలో ఎవరి జీవితాన్నైనా తన చేతిలోకి తీసుకొని, వాడి మెదడులోని గుజ్జంతా తినేసి ఆ తరువాత అత్యంత ప్రేమతో కోతికొమ్మొచ్చి ఆడించేవాడు.
                 ‘టూ మచ్‌ పొసెసివ్‌నెస్‌’  అనబడు ఈ జబ్బుకి తెలుగు నిఘంటువులోతీవ్రాతి తీవ్రంగా జొరబడి ఏలుకునే గుణంఅని రాసి ఉంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card