Saturday, July 29, 2017

భ్రష్టుపట్టిన వ్యవస్థతో రాజీపడేందుకు సిద్ధపడుతున్నామా






(నిన్నటి -నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ అవ్యవస్థనుఇంకా ఎంతకాలం భరించాలని,వ్యాసానికి ముగింపు)
సర్కారు తమ బాగుకోసమే ఉందని జనం నిజంగా నమ్మితే ఒనగూరే అభివృద్ధికి హద్దులు నిర్దేశించడం ఎవరివల్లా కాదు. నల్లధనాన్ని కట్టడిచేసి ప్రజావిశ్వాసం పొందడమే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం       దేశంలో 70శాతం ప్రజలు రోజుకు రూ.20కు మించి ఖర్చు చేయలేని పరిస్థితుల్లో- అయిదువందలు, వెయ్యి,రెండువేలు రూపాయల నోట్లను ఇబ్బడి ముబ్బడిగా ముద్రించడంలో అర్థం లేదని 'అర్థక్రాంతి' స్పష్టం చేస్తోంది.
                          కోట్ల రూపాయల సొమ్మూ ఓ సూట్‌కేసులో ఇమిడే ఈ పరిస్థితి నల్లధనం కోరసాచడానికి కారణమవుతోంది. ప్రజల అవసరాలను ప్రతిబింబించని కరెన్సీ నోట్ల చలామణీవల్లే లెక్కాపత్రాలకందని భూముల కొనుగోళ్లు, ఆస్తుల క్రయవిక్రయాలు, అవినీతి విస్తరిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పాతిక లక్షల గరిష్ఠ పరిమితిని దాటి ఒక్కో అభ్యర్థి పదికోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టే స్థితికి చేరారంటే గరిష్ఠ విలువగల కరెన్సీనోట్ల విచ్చలవిడి చలామణీయే కారణం. నల్లధనం రూపేణా సమాంతర ఆర్థికవ్యవస్థ స్థిరపడిన దేశంలో కనీసం 70శాతం ప్రజలు అన్ని అవసరాలకూ ప్రైవేటు వడ్డీవ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యవస్థలపట్ల ప్రజల్లో నమ్మకం క్రమంగా కొడిగడుతోంది. ప్రభుత్వ విధాన లోపాలవల్ల వ్యవస్థీకృతమైన ఈ అవినీతి బాధ్యతలేని సమాజాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో మేటవేసిన అవినీతి, అక్రమాలను నిర్మూలించే పునాది స్థాయి పరిష్కారాలతో, విశిష్ట సిద్ధాంతంగా ముందుకొచ్చిన 'అర్థక్రాంతి'ని అక్కున చేర్చుకోవడం నేటి చారిత్రక అవసరం.

                మానవ నైజంలోనే స్వార్థం ఉందని సరిపెట్టుకుంటూ, దారితప్పిన వ్యవస్థలతో సర్దుకుపోయే నైరాశ్యాన్ని వదిలించుకోవాల్సిన తరుణమిది. అవినీతిని సహజసిద్ధమైనదిగా తీర్మానించిన పరిస్థితివల్లే లక్షల కోట్ల రూపాయల నల్లధనం యథేచ్ఛగా దేశపు సరిహద్దులు దాటుతోంది. రెక్కల కష్టంతో దేశప్రజలు సృష్టించిన సంపద పూర్తిగా జాతి సంక్షేమానికే వినియోగమయ్యేలా చూడటం ఇప్పుడు అందరి బాధ్యత. దోపిడిని కొత్త రూపాల్లో ప్రోత్సహిస్తూ, అసమానతలను పెంచిపోషించే భ్రష్టుపట్టిన వ్యవస్థతో రాజీపడేందుకు సిద్ధపడుతున్నామా అన్న ప్రశ్నకు జవాబు వెదుక్కోవాలిప్పుడు. నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ అవ్యవస్థను ఇంకా ఎంతకాలం భరించాలని ప్రశ్నించుకోవాల్సి ఉందిప్పుడు. ఇట్లా బతకడానికి సిద్ధంగాలేమని సమాధానం చెప్పుకొనే పక్షంలో- తప్పులను సరిదిద్దే ప్రత్యామ్నాయ వ్యవస్థ దిశగా వడివడిగా అడుగులు కదపడం తప్పనిసరి. ఆ క్రమంలో నల్లధనానికి ఏ కోశానా ఆస్కారమివ్వకుండా పన్ను విధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న అర్థక్రాంతి... చీకట్లను చీల్చుకొచ్చే సూర్యతేజం! జాతికి హితం చేకూర్చే ఈ విధానాన్ని ఇంకా చర్చల దశలోనే నాన్చకుండా సత్వరం పట్టాలకెక్కించినప్పుడే దేశప్రజలకు సిసలైన సంక్రాంతి!
'అర్థక్రాంతి' అంటే ఏమిటి?
1. పన్నుల వ్యవస్థలో సమూల మార్పులను సూచిస్తున్న ఆర్థిక సిద్ధాంతమిది.
2. దిగుమతి సుంకాలు మినహా దేశంలో అమలులో ఉన్న అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయాలి.
3. అన్నిరకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి. ప్రతి లావాదేవీపైనా రెండు శాతం పన్ను
4. ప్రతి సంవత్సరం కొత్తగా పెరిగే సంపద పైనా రెండు శాతం పన్ను.(ప్రతీ ఆదాయం ఏదోలా సంపద గా మారాల్సిందే)
5. యాభైరూపాయలకు మించి విలువగల కరెన్సీ నోట్లన్నింటినీ ఉపసంహరించుకోవాలి.
6. రూ.2000లకు మించిన లావాదేవీలపై చట్టబద్ధ పరిమితి.
దీనివల్ల ప్రయోజనాలేమిటి?
1.ప్రభుత్వాదాయం వూహాతీతంగా పెరిగి ఖజానా కళకళలాడుతుంది.
2. ఆదాయపన్ను రద్దువల్ల ఉద్యోగులకు పూర్తి జీతాలు చేతికొస్తాయి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.
3. పన్నుల మోత లేనందువల్ల పెట్రోలు, డీజిలు సహా అన్ని వస్తువుల ధరలూ సుమారు 40శాతం మేర తగ్గుతాయి.
4. పన్నుల ఎగవేత వూసే ఉండదు. నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థలు సాకారం అవుతాయి.
5. అధికవిలువ గల కరెన్సీ నిలిచిపోతుంది. ఫలితంగా దొంగనోట్ల చలామణికి అవకాశమే ఉండదు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Friday, July 28, 2017

నేరం, నల్లధనం నీడగా వెంటాడుతున్న ఈ ‘అవ్యవస్థను’ ఇంకా ఎంతకాలం భరించాలని



 

          'తీసుకురాదలచిన మార్పు అవసరమైనదీ, సమంజసమైనదీ అయినప్పుడు దాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు రాజకీయ మద్దతు కూడగట్టుకోవడం తప్పనిసరి' అన్నది కార్ల్‌ మార్క్స్‌ వ్యాఖ్య.

               వ్యవస్థలు పట్టుతప్పి, అసమానతలే ప్రబలంగా మారిన భారతీయ సమాజంలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. దేశ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి, ప్రజల జీవితాల్లో సానుకూల విప్లవం తీసుకురాగల 'అర్థక్రాంతి' ఆలోచన ఈ అనివార్యతలనుంచే ఆవిర్భవించింది. పన్ను చెల్లింపుదారులు జారిపోతున్నారని బాధపడటంకన్నా- ఆదాయం వెల్లడించడానికి సిద్ధపడని వర్గం ఎందుకింతలా పెరుగుతోందన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం సరైన పని.
                         అధిక విలువగల కరెన్సీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్టవేసి లావాదేవీలన్నింటినీ బ్యాంకుల ద్వారానే నిర్వహించాలన్నది ఈ సిద్ధాంతంలోని మూల సూత్రం. తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు స్వీకరించే ప్రతి ఒక్కరినుంచీ, ప్రతి లావాదేవీకీ రెండు శాతం చొప్పున బ్యాంకు లావాదేవీల పన్ను(బీటీటీ) వసూలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. లెక్కకు మిక్కిలి పన్నులు, మేధావులకు తప్ప అంతుపట్టని నిబంధనల స్థానే ఎలాంటి గందరగోళమూ లేని ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు ఆసాంతం మారిపోయే అవకాశాలు పుష్కలం. దేశంలో ప్రస్తుతం 20శాతం ప్రజలు మాత్రమే బ్యాంకుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి ద్వారా జరుగుతున్న లావాదేవీల మొత్తం విలువ రోజుకు రూ.2.7లక్షల కోట్లు. సెలవు దినాలను మినహాయించి బ్యాంకులు సగటున ఏడాదికి 300రోజులు పనిచేస్తాయనుకుంటే- సంవత్సరానికి 800లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట. ఆ ప్రాతిపదికన ప్రతి లావాదేవీపైనా రెండు శాతం బీటీటీ విధిస్తే ఏడాదికి ప్రభుత్వానికి సమకూరే మొత్తం రూ.15లక్షల కోట్లకు పైమాటే ఉంటుంది. సవాలక్ష పన్నులతో సామాన్యుల నడ్డివిరుస్తూ సర్కారు ఏడాది కాలంలో సమకూర్చుకుంటున్న సుమారు రూ.11.5లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే అర్థక్రాంతి విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమపడే మొత్తం ఎక్కువే. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ బ్యాంకింగ్‌ సేవలను విస్తరించి మిగిలిన 80శాతం ప్రజలనూ బ్యాంకు లావాదేవీల పరిధిలోకి తీసుకువస్తే- బీటీటీ రూపంలో ఏటా రూ.40లక్షల కోట్లు సమకూరుతుందని స్వయంగా భాజపా అగ్ర నాయకత్వమే ప్రకటిస్తోంది. అయినదానికీ కానిదానికీ పన్నులు చెల్లించే ఈ దురవస్థను పరిమార్చడంతోపాటు; నల్లధనాన్నీ, అవినీతినీ చావుదెబ్బకొట్టే 'అర్థక్రాంతి' ప్రతిపాదన దేశానికి దివ్య ఔషధం వంటిది.
                        ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, July 27, 2017

ఏంటీ.. దీనిక్కూడా జీఎస్‌టీనా.......?




 
                సాయంత్రం కావస్తోంది. వర్షం రావొచ్చేమో  వాతావరణం చల్లగా వుంది.‘టీ’ అనే సాకు తో  పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ‘నవరంగ్’  వద్ద కి చేరాము .కొద్దికొద్దిగా జనాలు రోడ్డు మీదకి చేరుకుంటున్నారు. వారిలో డ్యూటీలు దిగినవారు,వెయింటింగ్ ప్రయాణీకులు. రిటైరయిన పక్షులూ ఉన్నాయి. యింకా మాలాంటి పనీ పాట లేని  ‘చర్చల’ పక్షులూ ఉన్నాయి.
            నేను, ప్రక్కనే చెట్టుకింద ఓ మూలనున్న బెంచీమీద సెటిలయ్యా. యింతలోనే  వెంకటేశం ఏంటో గురూగారూ.. ఈమధ్య ఎక్కడ చూసినా జీఎస్‌టి గోల ఎక్కు వయిపోయింది. పేపర్లలో సగం వార్తలవేఅన్నాడు. దాంతో నేను నవ్వేసి ఏదో అనబోయా. యింతలో కొంచెం అవతలగావేడీ..వేడీ.. చనక్కాయలుఅంటూ అరవడం వినిపించింది. దాంతో వెంకటేశం ఆబగా తలతిప్పి చూశాడు. అసలయితే  ఆ వేరుశనక్కాయల మాటెలా ఉన్నా ఆ వేడీ..వేడీఅనడమే ఎక్కువ నోరూరించేలా ఉంది. దాంతో వెంకటేశం ఆ శాల్తీని పిలిచేశాడు. తర్వాత నా వైపు తిరిగి గురూగారూ.. మీరూ తింటారు కదాఅన్నాడు. నేను తలూపా. ఈలోగా ఆ వేరుశనక్కాయలవాడు రెండు పొట్లాల వేరుశనక్కాయలు యిద్దరికీ  యిచ్చాడు. వెంకటేశం జేబులోంచి ఓ యిరవై రూపాయలు తీసిచ్చాడు. అయితే అప్పుడో గమ్మత్తు జరిగింది.  అతగాడు అది తీసేసుకుని మరి జీఎస్‌టి యివ్వరాఅన్నాడు. దాంతో ‘గురుశిష్యులిద్దరం’ అదిరిపోయాం. వెంకటేశం అనుమానంగా ఏంటీవేరుశనక్కాయులకి జీఎస్‌టీనా..!అన్నాడు. అతగాడు ఏమాత్రం తగ్గకుండా అవును బాబూ.. ఫుడ్‌ ప్రోడక్ట్‌ల మీద 28 శాతం జీఎస్‌టీ తెలుసా.. మరిది ఫుడ్‌ ప్రోడక్టే కదా. మామూ లుగా అయితే  మీరు కొన్న దానికి జీఎస్‌టి అయిదూ అరవై పైసలు. ఏదో తెలుసున్నవాళ్ళు కదా. ఓ అయిదు రూపాయలివ్వండి చాలుఅన్నాడు. అప్పటికే షాక్‌లో ఉన్న వెంకటేశం ఓ అయిదు రూపా యలు అతగాడి చేతిలో పెట్టాడు.

             యింకో పావుగంట తర్వాత మేమిద్దరం అక్కడనుంచి నుంచి బయటకొచ్చాము. ఆపాటికి కొంచెం చీకటి పడుతోంది కూడా. యింతలో యింకో తమాషా జరిగింది. మేమలా బయటికొచ్చామో లేదో పక్కనున్న బిచ్చగాడు ధర్మం సెయ్యండి బాబయ్యాఅంటూ చేయి చాపాడు. వెంకటేశం ఓసారి జేబులు వెతికి ఓ రూపాయి బయటికి తీసి ఆ బిచ్చగాడి చేతిలో పెట్టి పండగ చేసుకో అన్నట్టుగా చూశాడు. అయితే ఆ బిచ్చగాడు ఆ రూపాయేదో వెనక్కిచ్చేస్తూ ఏంటి బాబయ్యా.. రూపాయి ధర్మం చేసేసి డైరెట్టుగా సోర్గానికి ఎల్లి పోదావనుకుంటున్నావాపది రూపాయలన్నా ధర్మం చేయాల్సిందేఅన్నాడు. దాంతో మేమిద్దరం నోరెళ్ళబెట్టామ్. యింతలో ఆ బిచ్చగాడు అవును బాబయ్యామా సంఘపోళ్ళే... పదిరూపాయలకి తక్కువ తీసుకోవద్దని నిర్ణయించారుఅన్నాడు. దాంతో వెంకటేశం ఏడ్చుకుంటూ ఆ రూపాయి వెనక్కి తీసుకుని బొచ్చెలో పదిరూపాయలు వేశాడు. అయినా వాడు కదల్లేదు. ధర్మం చేశారు బానే ఉంది. మరి జీఎస్‌టి సంగతేంటి బాబయ్యా..అన్నాడు. దాంతో వెంకటేశం కోపంగా ఏంటీ.. దీనిక్కూడా జీఎస్‌టీనా?” అన్నాడు. బిచ్చగాడు తలూపి అవును బాబయ్యాఓ మూడు రూపాయలు జీఎస్‌టీ కింద యిప్పించండిఅన్నాడు. నేను అయితే జరిగేదంతా నవ్వుతూ చూస్తున్నా. వెంకటేశం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమీతుమీ తేల్చేసుకునే పనిలో పడ్డాడు. యింతకీ నువ్వా జీఎస్‌టీ కడుతున్నావా?” అని అడిగాడు. దానికా బిచ్చగాడు నేను డైరెట్టుగా కట్టను బాబయ్యా. మరి ఏం కొనుక్కున్నా అన్నిటిమీదా జీఎస్‌టీ కడుతున్నా కదాఅన్నాడు. యింకేముందిఆ బిచ్చగాడి లాజిక్‌తో బుర్ర పాడయిపోయిన వెంకటేశం యింకేం మాట్లాడకుండా బొచ్చెలో యింకో మూడు రూపాయలూ వేసేసి బయల్దేరాం.  
                                       అక్కడ్నుంచి యింకో పావుగంటలో నేను మాఆఫీసుకి చేరుకున్నా. గుమ్మంలోనే మా మేనల్లుడు బూస్టుగాడు ‘ఎదురయ్యాడు. వాడు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. దాంతో నా మనసేదో కీడు శంకించింది. యింతలో బూస్టుగాడు  మావయ్యా.. నేను పిక్నిక్‌కి వెడుతున్నా. డబ్బులివ్వవా..అన్నాడు. నేను తలూపి అలాగే యిస్తాగానీ.. ఎంత?” అన్నా. వాడేవో లెక్కలేసుకుని మినిమమ్‌ రెండొందలు. ఆపైన నీ యిష్టంఅన్నాడు. దాంతో నేను నేనెప్పుడూ మినిమమే యిస్తా కదరాఅంటూ ఓ రెండొందలు తీసిచ్చా. అది తీసేసు కునివాడుమరి జీఎస్టీ మావయ్యాఅన్నాడు. దాంతో నేను అదిరిపోయి ఏంట్రాజీఎస్టీనా..అన్నా. వెంకటేశం మాత్రం వస్తున్న నవ్వునాపుకుంటూ దీన్నంతా చూస్తున్నాడు. యింతలో బూస్టుగాడుఅవును మావయ్యాఅందరూ అంటున్నారు కదా. అందుకే నేనూ అడిగేశాఅన్నాడు. దాంతో నేను కయ్యిమని తంతా వెధవాని..అంటూ చెయ్యెత్తా. దాంతో ఎందుకయినా మంచిదని బూస్టుగాడు తుర్రుమన్నాడు. ఈసారి వెంకటేశం గట్టిగానే నవ్వడం మొదలెట్టాడు.

                             మొహంమీద వేడిగా పొగ తగిలేసరికి  కుర్చీలోనే కునికి పాటు పడుతున్న వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎదురుగా నోట్లో సిగరెట్తో నేను నిలబడున్నా. ఏవివాయ్‌ వెంకటేశంతెగ నవ్వేసుకుంటున్నావ్‌.. కలలో ఏ సినిమా హీరోయిన్‌తోనయినా గంతులేస్తున్నావా?” అన్నా. దాంతో వెంకటేశం నిట్టూర్చి అంతదృష్టం కూడానా…” అంటూ తనకొచ్చిన కల చెప్పాడు. అంతా విన్న నేను అవునోయ్‌.. యిప్పు డంతా జీఎస్టీ హడావిడే కదా. అందుకే యిలాంటి కలొచ్చిందిఅన్నా.
                          వెంకటేశం అనుమానంగా అంటే గురూగారూజీఎస్టీ సమస్యాత్మకమయిందా?” అని అడిగాడు. దాంతో నేను నవ్వేసిజీఎస్టీ అమల్లో ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే యిండియాలో జీఎస్టీ  ఎక్కువే. అలాగే జీఎస్టీ మీద  అందరికీ యింకా సరయిన అవగాహన రాలేదన్నది నిజం. వీటి వలన ఆ జీఎస్టీని కొందరు భూతంలా చూపించి,  తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు. అదే సింబా లిక్‌గా నీ కలలో వచ్చింది. యింకో విషయమేంటంటేరకరకాల వస్తువుల మీద రకరకాల శ్లాబుల్లో టేక్సులు వేయడం జరిగింది. అయితే తర్వాత వాటిల్లో కొన్నింటికి మార్పులు చేశారు. అయినా ఈ మార్పుల గురించి అవగాహన యింకా అందరికీ రానేలేదు. దాంతో యింతకుముందు ఎక్కువున్న ,టాక్సులు తగ్గించిన వస్తువుల ధరలు కూడా తగ్గించకుండా అమ్మేస్తున్నారు. యింకో పక్క టాక్సులు పెరిగి పోయాయంటూ చాలా వస్తువుల ధరలు పెంచి మరీ అమ్ము తున్నారు. అందుకే జీయస్టీ అంటే భారం అనే భావం అందరిలో పెరిగిపోయింది.
అయితే వాస్తవంగా చెప్పాలంటే.. జీఎస్టీ వలన అందరూ తాత్కాలికంగా యిబ్బందిపడుతున్నారన్నది నిజం. అయితే  తొందర్లోనే అందరికీ జీయస్టీ గురించి అవగాహన రావడం, అల వాటు పడడం జరుగుతుంది. అయితే ఈ జీఎస్టీ వలన వ్యవస్థ బలో పేతం కావడం, అందరికీ ఆర్థిక లబ్ధి చేకూరడం ఖాయం. అయితే దానికి కొంత సమయం పడుతుందిఅంటూ వివరించా. అంతా విన్న వెంకటేశం ఆ.. బాగా చెప్పారు సార్.. అన్నాడు. యింతలో వెంక టేశం అవునూ.. ఆ జీఎస్టీ దెబ్బేదో మీ సిగరెట్ కీ పడినట్టుంది.  మానే స్తారా?” అన్నాడు. దాంతో నేను కంగారుపడిపోయి అమ్మో.. యింకేవయినా ఉందా.. యిది లేకపోతే నేను లేను. ఏదో ఎడ్జస్టే అవడమేఅన్నా.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Address for Communication

Address card