Wednesday, August 09, 2017

పదహారణాల తెలుగమ్మాయి అంటే?





ఉర్దూలో పావలా (25 పైసలు) ను చార్ అణ అంటారు. అనగా నాలుగు అణాలు. నాలుగు పావలాలు కలిపితే రూపాయి. అనగా పదహారు అణాలు ఒక రూపాయి.
కన్నడం నుండి వచ్చిందా లేక ఉర్దూ నుండి వచ్చిందా అనే దానితో సంబంధం లేకుండా అణ అచ్చమైన తెలుగు కొలమానమే అన్న అవగాహనలో తెలుగు అమ్మాయిని పదహారు అణాలుగా కొలిచారు.
ఇలాంటి సాంస్కృతిక పరమైన భారాలు ఎక్కువగా స్త్రీలపైనే మోపడం దాదాపు అన్నీ సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. స్త్రీని కోరబడునదిగా పురుషుడిని కోరేవాడుగా చూడడం ఇందులో గమనించవచ్చు. అంటే స్త్రీని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాక పురుషుడి అవసరాలు తీర్చే వస్తువుగా పరిగణించడం.
అయితే ఏ సంస్కృతి  అయినా కల్తీ లేకుండా మనగలగడం సాధ్యమేనా? మానవ సమాజం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అది ఎప్పుడూ స్ధిరంగా ఉండదు. అలా స్ధిరంగా ఉన్నట్లయితే ఎదుగూ బొదుగూ లేకుండా పడి ఉందని అర్ధం. కానీ మానవ సమాజం ఏదో ఒక రూపంలో నిరంతరం మార్పుకు లోనవుతూ ఉండడమే వాస్తవం.
మార్పులు అనేక రూపాల్లో ఉండవచ్చు. పైకి స్ధిరంగా కనపడుతూ లోలోపల మార్పులు జరుగుతూ ఉండవచ్చు. రూపంలో మార్పులకు లోనవుతూ సారంలో పాత సంబంధాలు కొనసాగుతూ ఉండవచ్చు. భౌతిక, రసాయన, జీవ, సామాజిక, ఆర్ధిక, రాజకీయ…. ఇలా అనేకానేక రూపాల్లోనూ మార్పులు జరుగుతూ ఉండవచ్చు. మార్పు శాశ్వతం.
ఈ మార్పులు ఎలా జరుగుతాయి? మార్పులకు మూలం ఏమిటి? సమాధానం: వైరుధ్యాలు.
ప్రతి అంశంలో ఉండే పరస్పర విరుద్ధమైన అంశాలే ఆ నిర్దిష్ట అంశం మార్పు చెందడానికి కారణం అవుతాయి. పరస్పర విరుద్ధ అంశాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ, ఐక్యం అవుతూ ఉంటాయి. ఈ ఐక్యత, ఘర్షణలలో ఏది పై చేయి సాధిస్తే అది ఆ అంశం యొక్క మార్పు లక్షణాన్ని నిర్ధారిస్తుంది.
విశ్వం మొత్తాన్ని ప్రకృతి, సమాజం, ఆలోచన అని మూడు అంశాలుగా చెప్పుకోవచ్చు.
ప్రకృతిలో ఆయా కాలాలకు అనుగుణంగా జరిగే మార్పులు మనకు తెలిసినవే. ప్రారంభంలో అణు రూపంలో ఉన్న విశ్వం బిగ్ బ్యాంగ్ద్వారా నేటి రూపం సంతరించుకుందన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు దాదాపు నిర్ధారించారు.
సమాజం ప్రారంభంలో ఆదిమ కమ్యూనిస్టు సమాజంగా ఉంది. అనంతరం బానిస సమాజం అయింది. ఆ తర్వాత ఫ్యూడల్ సమాజంగా మార్పు చెందింది. అదేమో పెట్టుబడిదారీ సమాజంగా మారింది. కొన్ని దేశాల్లో మార్పు చెంది సోషలిస్టు సమాజాలు అవతరించినా మారినా అవి మళ్ళీ వెనక్కి ప్రయాణించి పెట్టుబడిదారీ సమాజాలుగా మార్పు చెందాయి.
మనిషి ఆలోచన కూడా ఆయా సమాజాలకు అనుగుణంగా మార్పు చెందుతూ వచ్చింది.
మార్పులకు కారణం ప్రతి అంశంలో ఉండే విరుద్ధ అంశాలు. ఆ విరుద్ధ అంశాలు నిరంతరం ఘర్షణ పడుతూ, ఐక్యం చెందుతూ మార్పులు కలుగ జేస్తాయి. ఈ సబ్జెక్ట్ ఇంకా విస్తారమైనది. ఇక్కడితో ఆపేస్తాను. మళ్ళీ మన ప్రశ్నకి వస్తాను.
విధంగా సమాజంలో మార్పులు వస్తున్నట్లే ఆ సమాజంలో భాగం అయిన సంస్కృతిలో కూడా మార్పులు రావడం సహజం. అలాంటి నిరంతరం మారే సంస్కృతిని ఏ స్త్రీ అయినా, పురుషుడయినా అచ్చంగా ప్రతిబింబించడం సాధ్యమేనా?
విద్య, కళలు, భాష, కట్టుబడి, పండుగలు, మతం, అలవాట్లుఇలాంటివన్నీ సంస్కృతి కిందకు వస్తాయి. గతంలో ఉన్న విద్యనే ఇప్పుడూ చదవాలంటే అది కుదురుతుందా? సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికా వెళ్ళి తెలుగులోనే మాట్లాడడం సాధ్యమా? యంత్రాల మధ్య పని చేస్తూ ఖచ్చితంగా లంగా, ఓణి, పరికిణీలే ధరించాలంటే అయ్యే పనేనా? సంపాదన కోసం విదేశాలు పంపిస్తూ అక్కడి సంస్కృతికి ప్రభావితం కాకూడదని ఆంక్షలు ఎలా విధిస్తారు?
నిజానికిపాతదే గొప్పదిఅంటూ వాదించేవారే కొత్త కొత్తగా వచ్చే సౌకర్యాలను ఆబగా వాటేసుకుంటూ తాము మారలేదని చెప్పేందుకు తాపత్రయపడుతుంటారు. అది కేవలం నటన మాత్రమే.
అయితే ఉనికినన్నా కోల్పోవాలి లేదా మార్పులకు అనుగుణంగా తానూ మారుతూనయినా ఉండాలి. మారనన్నా మారాలి లేదా అంతం అయినా కావాలి. మరో దారి ఉండదు. ఈ నేపధ్యంలోపదహారణాల తెలుగమ్మాయిఅన్న భాషా ప్రయోగాలు లేదా ఆంక్షలు ఆయా వ్యక్తుల కోరికలను, మానసిక స్ధితిని మాత్రమే తెలియజేస్తాయి తప్ప వాస్తవాలను కాదు.
జాగ్రత్తగా పరిశీలిస్తే పదహారణాల తెలుగమ్మాయిఅనడంలోనే రెండు సంస్కృతుల సంగమం చూడవచ్చు. పదహారణాలు అన్నది దేశీయ కొలమానం కాగా అది వ్యక్తం చేసే పూర్తి విలువ’ (రూపాయి) విదేశీ కొలమానం. వంద అనేది మెట్రిక్ కొలమానంలో భాగం.సంపూర్ణతను రూపాయిలో కొలుస్తూ తెలుగుదనాన్ని మాత్రం పదహారు అణాలలో కొలవడమే ఒక హిపోక్రసీ!
తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడానికి నామోషి ఎందుకన్న ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఈ ఒరవడిలోనే వెతుక్కోవచ్చు.
భారత దేశం ఇంకా బానిస, ఫ్యూడల్ దశలను దాటి రాని కాలంలో వలస పాలకులు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. వాళ్ళు తమ అవసరాల కోసం ఇక్కడి వ్యవస్ధలో మౌలిక నిర్మాణాలను అట్టే పెట్టి పైపైన కొన్ని మార్పులు చేశారు. అనగా ఫ్యూడల్ సంబంధాలను అలాగే కొనసాగనిస్తూ వర్తక వర్గాలను తమ వ్యాపారాలకు సేవచేసే వర్గాలుగా మార్చుకున్నారు. ఫలితంగా పాత ఫ్యూడల్ సంస్కృతీ సంబంధాలు, విలువలు కొనసాగుతూనే వలస పెట్టుబడిదారీ సంబంధాలకు అనుగుణమైన సంస్కృతీ సంబంధాలు వచ్చి చేరాయి.
ఫ్యూడల్ సంబంధాల్లో నిలబడిపోయిన మనసులేమో సనాతన విలువలను గొప్పగా పరిగణిస్తుంటే, వలస వ్యవస్ధ, తదనంతరం ప్రవేశించిన సామ్రాజ్యవాద (విదేశీ బహుళజాతి కంపెనీల ఆర్ధిక దోపిడి) వ్యవస్ధలేమో తమకు కావలసిన ఆంగ్ల చదువుల విలువలను ప్రోత్సహిస్తున్నాయి.
సమాజంలో అయినా ఆధిపత్య స్ధానంలో ఉన్న అంశాన్ని గొప్పగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆంగ్లమే గొప్ప అన్న భావన వలస పాలన నుండి మనకు సంక్రమించిన జబ్బు. వలస పాలనలో ఆంగ్లేయులు ఆధిపత్య వర్గాలు. కాబట్టి వారి భాష, అలవాట్లు, మతం, సంస్కృతి అన్నీ గొప్పగా పరిగణించబడ్డాయి. అలాంటి సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఆధిపత్య శక్తులు ఉద్దేశ్యపూర్వకంగా పెంచి పోషిస్తారు.
భాష అనేది సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఆ విధంగా వలస ఆధిపత్య వర్గాల భాష అయిన ఆంగ్లం గొప్ప భాష కాగా దేశీయ, స్ధానిక భాష తెలుగు రెండో తరగతి భాషగా మారింది. పాలకుల భావాలను పాలితులు అనుకరిస్తారు. ఆ విధంగా ఆంగ్లం గొప్ప అన్న భావన మనవారిలో ప్రవేశించి ఇప్పటికీ కొనసాగుతోంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానమే ఆర్ధిక వ్యవస్ధలను శాసిస్తున్నందున ఆ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఆంగ్లం అత్యవసరం అయిపోయింది. తద్వారా ఆంగ్లం మరింత పైకి, తెలుగు మరింత కిందికి వెళ్తున్న భావన కలుగుతోంది.
ఇలాంటి ఆధిపత్యాన్ని ఉద్యమాల ద్వారా ఎదుర్కొని సొంత భాష, సంస్కృతులను కాపాడుకోవచ్చు. తమిళులు దాన్ని నిరూపించారు కూడా.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card