మేళం లేని పెళ్ళి, కామెంటరీ లేని
క్రికెట్ ఆట ఊహించుకోలేం. వాద్యకారుడికి వాయించడం అంటూ రావాలేగాని – పెళ్ళికి పెళ్ళిమేళం, చావుకి చావుమేళం వాయించడం పెద్ద కష్టం కాదు.
సందర్భాన్ని బట్టి రాగాలు మార్చుకోవడం వారివృత్తిధర్మం. ఈ వాయిద్యగాళ్ళ గోత్రీకులే
మాటల వాయింపుడుగాళ్ళు!
ప్రతిఊరికీ ఒక స్మశానం వున్నట్లే - ఓ ఉపన్యాస కళాకారుడు కూడా ఉంటాడు.
సందర్భోచితమైన ఉపన్యాసందంచేసి ఆహూతులని అదర(బెదర)గొడతాడు. ఈ పెద్దమనుషులకి సొంత
అభిప్రాయాలుండవు, సొంతభాషా వుండదు.
"ఈ అశేష ప్రజానీకాన్ని చూస్తే నాకనిపిస్తుంది - 'ఆకాశం చిల్లు పడిందా? నేల ఈనిందా?'
అని. ఇంతమంది ఇక్కడికి
రావడం ముదావహం. ఇది మన సంస్కృతికి జీవగర్ర. మీరంతా మన సాంప్రదాయానికి
పట్టుగొమ్మలు."ఈరకంగా 'సాగు'తుంది వారి ఉపన్యాసం.
అలాగే ప్రతి ఊరికీ సన్మానపత్ర రచయితలు కూడా వుంటారు. ఇంగ్లీషు కన్నా
కష్టమైన భీభత్సమైన తెలుగులో, పాషాణపాక వ్యాకరణంతో పొగడ్తల పత్రం రాయడంలో
వీరు సమర్ధులు. డాక్టర్లు రాసే దొంగ మెడికల్
సర్టిఫికెట్లలాగా వీరుకూడా ఒక స్టాండర్డ్
ఫార్మేట్‌లో సన్మాన పత్రాలు రాసుకుని రెడీగా వుంచుకుంటారని నా
అనుమానం!
సరే! మళ్ళీ మన ఉపన్యాస దురంధరుల విషయానికొద్దాం. వీరు ఆవకాయ జాడీ
దగ్గర్నుండీ అమెరికా అందాల దాకా వీరావేశంతో
ప్రసంగించెదరు. మరుగు దొడ్డి, గోడమీద బల్లి –
కాదేది ఉపన్యాసాని కనర్హము! ఈమధ్య ఈ కళలో ఎంతో ప్రావీణ్యం
పొందిన ఒకాయన పద్మశ్రీ కూడా పొందాడు హైదరాబాదులో. ముసలివయసులో
ఇంట్లోవాళ్ళకి అడ్డంలేకుండా ఇట్ల్లాంటి వ్యాపకాలు ఉంటే మంచిదేగదా!
సందర్భాన్నిబట్టి అతిథుల్ని
ఉబ్బేస్తూ, శ్రోతల్ని
కట్టిపడేస్తూ ఊకదంపుడు దంచేవాళ్ళని 'అద్దె మైకుగాళ్ళు' అనంటారని మొన్నొకాయన శెలవిచ్చాడు. వీరినే 'మైకాసురులు' అని కూడా అంటారని ఇంకొకాయన వాక్రుచ్చాడు. ఇది అనుకున్నంత సులువైన కళ కాదేమో! లక్ష
రూపాయలిచ్చినా మనకిష్టం లేనివాడిని పొగడలేంగదా!
ఆమధ్య ఒక సభలో ఓ ప్రముఖ ‘మైకాసురుడు’ ఓ మంత్రిగారి గొప్పదనం గూర్చి సందులు, సమాసాల భాషలో పొగుడ్తూ తెగ విసిగిస్తున్నాడు.
నన్ను పిలిచిన క్లయింట్ తో "ఏంటండీ ఈ సుత్తి?" అన్నా. ఆయన ఆశ్చర్యపోయాడు. "మీరు
వింటున్నారా! ఎందుకు వినడం? ఇక్కడ మేమెవ్వరం
విండం లేదు. మంత్రిగారొచ్చేదాకా ఆయనలా మాట్లాడుతూనే వుంటాడు. మీరాయన్ని
పట్టించుకోకండి." అన్నాడు. లాగి లెంపకాయ కొట్టినట్లయింది. అంటే ఆయనగారి
ఉపన్యాసం విని విసుక్కున్న అజ్ఞానిని నేనొక్కడినేనన్నమాట! నాకు తప్ప అక్కడెవరికీ
ఏవిధమైన కన్ఫ్యూజన్ లేదు.
ఉపన్యాస కేసరి అప్రతిహతంగా
తన ఉపన్యాసం కొనసాగించాడు. మంత్రిగారు రాంగాన్లే ఆ ఉపన్యాస వీరుడి దగ్గర్నుండి
బలవంతంగా మైక్ లాక్కుని మళ్ళీ ఆ చుట్టుపక్కలకి రానివ్వలేదు. ఆ తరవాత నేనెప్పుడూ ఈ
విధమైన కళాకారుల్ని పట్టించుకోలేదు.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment