మన పొన్నూరుకి దగ్గర్లో తెనాలి పట్టణం వుంది.
అనాదిగా తెనాలి కళలకి నిలయం.'అనాదిగా' అని రాయడానికి నాకున్న కారణం - కాంచనమాల,
గోవిందరాజుల సుబ్బారావు
మొదలైన లబ్దప్రతిష్టులైన సినిమా నటులు కాదు. అందుక్కారణం - బి.వీరాచారి!
నలభయ్యేళ్ళ క్రితం సినిమాలు చూసినవాళ్ళకి - 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు', 'హాలులో పొగత్రాగరాదు', 'ఏ కారణము చేతనైనా ఆట ఆగినచో డబ్బు వాపసు
ఇవ్వబడదు' మొదలైన స్లైడ్స్
గుర్తుండేవుంటాయి. ప్రతి స్లైడ్‌కి కింద ఓ మూలగా చిన్న అక్షరాలతో - 'బి.వీరాచారి, తెనాలి' అని వుంటుంది.
ఆవిధంగా - రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళల్లో
తన స్లైడ్స్ ద్వారా తెనాలికి ఖ్యాతి తెచ్చిన బి.వీరాచారిని అభినందిస్తున్నాను.
బి.వీరాచారిని కన్న పుణ్యభూమియైన తెనాలి పట్టణంలో అనేకమంది శిల్ప తయారీ నిపుణులు, శిల్ప వ్యాపారులు
వున్నారు. వారిలో కొందరు నాకు తెలుసు.
కొన్నేళ్ళ క్రితం ముఖ్యమంత్రి
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అటుతరవాత జరిగిన రాజకీయ
పరిణామాల్లో ఆయన విగ్రహాలకి విపరీతమైన గిరాకీ వచ్చింది. ఆ సీజన్లో తెనాలి
శిల్పులకి రాంత్రింబగళ్ళు ఒకటే పని. వాళ్ళు తమ పాత అప్పులు తీర్చేసు కున్నారు,
భార్యలకి కొత్తగా నగలు
చేయించుకున్నారు. తామంతా రాజశేఖరరెడ్డికి ఎంతో ఋణపడి వున్నామని ఆ కుటుంబాలవాళ్ళు
నాకు చెప్పారు.
'ఆ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టిస్తారు? ట్రాఫిక్‌కి అడ్డం కాదా?' వంటి చెత్తప్రశ్నలు మధ్యతరగతి మేధావులకి రావొచ్చు
- మనం పట్టించుకోనవసరం లేదు. విగ్రహం చేయించినవాడే ఏవో తిప్పలు పడి - ఎక్కడోక చోట నిలబెడతాడు.
అప్పుడు - తెనాలి శిల్పులకి గిరాకీయే కదా?
ఇదంతా ఎందుకు రాశానంటే - ఈమధ్య పవన్ కళ్యాణ్
అనే ఒక తెలుగు సినిమా నటుడి విగ్రహం తయారైందిట. అది త్వరలో ఎక్కడో
నిలబడబోతుంది. త్వరలోనే మనం మరిన్ని
సినీనటుల విగ్రహాలు చూడబోతున్నాం (ఆ నటుడి ఎగస్పార్టీవాళ్ళు దద్దమ్మలుకాదు). అంటే
- శిల్ప కళాకారులకి మరింత ఉపాధి.
సినీ హీరో అభిమానులు కాలుష్య కారణమైన ఫ్లెక్సీ
పరిశ్రమ వదిలి - ఎంతో క్రియేటివిటీ వున్న శిల్పకళని పోషించే దిశగా వెళ్తున్నదుకు
ఆనందిస్తున్నాను, వారిని
అభినందిస్తున్నాను కూడా! ఈ స్పూర్తితో తెలుగునాట శిల్పకళ గొప్పగా అభివృద్ధి
చెందుతుందని కూడా నేను భావిస్తున్నాను.
ముగింపు -
ఈ పోస్ట్ చదివారుగా! ఇకనుండి మీకు ఏ విగ్రహం
కనిపించినా - ఆ విగ్రహం మొహం పట్టించుకోకండి. అది
ఎవరిదైనా కావచ్చు - మనకనవసరం. మీకా విగ్రహంలో -
విగ్రహానికి అచ్చులు పోసి మెరుగులు దిద్దిన
కార్మికులు కనిపిస్తే సంతోషిస్తాను.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment