Saturday, August 05, 2017

వారిది రాజీ లేని, కల్తీ లేని కులాభిమానం





              అభిమానం రకరకాలుగా వుంటుంది. అనేకానేక ప్రాంతాల్లో, అనేకానేక వ్యక్తులు, అనేకానేక కారణాలతో కొన్నివిషయాలపట్ల, వ్యక్తుల పట్ల అభిమానం పెంచుకుంటారు. ఆ అభిమానానికి అనేక కారణాలు వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక కవినో, కళాకారుణ్నో అభిమానించేవాళ్ళు వుండొచ్చు. కానీ - మన తెలుగునాట మాత్రం ఆ ఆనవాయితీ వున్నట్లుగా లేదు.
              తెలుగు ప్రాంతం గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగువాడు గొప్పవాడు! ఇట్లా మనవాళ్ళు తమకుతామే ఉదారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసుకుంటారు (ఇంకో భాషవాడైవడైనా వచ్చి కాదండానికి వాడికి మన భాష రాదు కాబట్టి). ఎంతో గొప్పవాడైన ఈ తెలుగువాడు ఎవర్నైనా అభిమానించాలంటే ఆ వ్యక్తి - ఒక సినిమా నటుడో, రాజకీయ నాయకుడో అయ్యుండాలి. కొందరైతే - క్రికెట్ ఆటగాడైనా, అమెరికా ప్రెసిడెంటైనా - తమ కులంవాడైతేనే అభిమానిస్తారు!అవును మరి - వారిది రాజీ లేని, కల్తీ లేని కులాభిమానం! వారికి నా అభినందనలు.
ఇప్పుడు కొంచెంసేపు తెలుగు సినిమా హీరోల వీరాభిమానుల గూర్చి -
            నా కాలేజి రోజుల్లో ఎన్టీఆర్‌కి ,ఏఎన్నార్కీ ,క్రిష్నా కి...వీరాభిమానులుండేవారు. వారు మాటలో, నడకలో వారిని అనుకరించేవాళ్ళు.ఎవరైనా వారిని చిన్నమాటన్నా సహించేవాళ్ళు కాదు, తన్నులాటకి దిగేవాళ్ళు, తన్నులూ తినేవాళ్ళు (ఇంతకన్నా గొప్ప అభిమానం వుంటుందనుకోను)! ఆనాడు సమాజంలో డబ్బు చాలా తక్కువ. కాబట్టి తమ కల్తీలేని నిఖార్సైన అభిమానాన్ని గుండెల్లో నింపుకుని తృప్తినొందేవారు (అంతకన్నా చేయగలిగిందేమీ లేక).
            రోజులు మారాయి. తెలుగు సమాజంలో డబ్బుతో పాటు అభిమానాన్ని చాటుకునే మార్గాలూ పెరిగాయి. మొదటిరోజు మొదటి ఆటకి సినిమా హాల్లో నలిగిన పూలు, నిరోధ్ బూరలు ఎగరేసి ఆనందం పొందిన అభిమానులు - ఆ తరవాత రోజుల్లో హాలు ముందు తమ అభిమాన నటుడితో కలిపి దిగిన ఫొటోల్ని పెద్దపెద్ద ఫ్లెక్సీ బేనర్లుగా ప్రదర్శించే స్థాయికి ఎదిగారు.
           సమాజంలో డబ్బు మరింత పెరిగింది, విలువా తరిగింది!  అంచేత - అభిమానులకి "ఫ్లెక్సీ అభిమానం" చీప్‌గా అనిపించసాగింది! ఫ్లెక్సీ కిక్కు తగ్గి ఇంకా మరేదో కావాలనుకునే స్థితికి చేరుకున్నారు. ఆ 'ఇంకా మరేదో కిక్కు' ఇచ్చునది ఏమిటి? అని తీవ్రంగా మథనపడసాగారు.
ఈ సినిమా హీరోల అభిమానులు ఇలా వుండగా -
           ఒకపక్క - రాజకీయ నాయకుల అభిమానులు చాలా ముందుకు వెళ్లిపొయ్యారు. వారి అభిమానులు తమ నాయకుల విగ్రహాల్ని ఊరూర ప్రతిష్టించుకుని తృప్తినొందసాగారు. ఈ విగ్రహాల ట్రెండ్ సినిమా హీరోల అభిమానుల్ని తాకడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ - ఎప్పుడోకప్పుడు తప్పదు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card