Thursday, August 03, 2017

ఈ’సిస్టం’ ఉద్యోగానికి తప్ప- తెలివైనవాణ్ని ప్రోత్సాహించి- నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు




 "మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు ఒక స్నేహితుడు. ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.
"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు.
"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.
"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు,మోడీ అని కలవరిస్తుంది.నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ
అన్నాడు.
"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.
"అవును. మన వూరు (పొన్నూరు) లేదా గుంటూరు, లేదా అమరావతి ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి,జగన్ కి  పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు వాడు.
"రేయ్! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.
వాడు మాట్లాడలేదు.మెల్లిగా నడుచుకుంటూ కాఫీ కి బయలుదేరాం.
కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు. "కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ మనూళ్ళో(పొన్నూరు) లేదా గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."
"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.
"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు.
అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు.
"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.
"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు
మనూళ్లోనే (అమరావతి) కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు వాడు.
"రెండో ఆప్షన్?"
"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల ‘వ్యక్తిత్వ వికాసం’గాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు వాడు.
"రేయ్! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.

"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన
విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం.అంతే తేడా" అన్నాడు వాడు.
"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.
"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా ఆలోచిస్తే నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు వాడు.
నేనూ నవ్వాను.
టైమ్ చూసుకుని, "నీకో విషయం చెబ్తాను. మన  ‘రాజకీయ నాయకులు’ ట్రై చేస్తే ,‘ఫ్రాయిడ్’ అర్ధమవుతాడు. కానీ, ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా మన ‘రాజకీయ నాయకులు’ అర్ధం కారు!"
"మరిప్పుడు ఏం చెయ్యాలి?" ఆసక్తి గా అడిగాను.
"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ప్రజలు గానీ వారిని ఏలే ప్రభుత్వాలూ గానీ అనుకోవటల్లేదు. అందుకని నువ్వు హాయిగా  లెక్కల్ని వాటి లోని బొక్కల్ని ఎంజాయ్ చేస్తూ మధ్యమధ్యలో నచ్చిన పుస్తకాలు చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు వాడు.

ఆఫీసు కి రాగానే,టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది!   
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card