Friday, August 11, 2017

రాజకీయ నటనా శిల్పం




                    తెలీని విషయాల్ని అర్ధం చేసుకోడానికో పద్ధతుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలని క్రమపద్ధతిలో పేర్చుకుంటూ..తద్వారా తెలీని విషయాల్ని అర్ధం చేసుకోవడం అనేది సులువైన పధ్ధతి. అంచేత నేనూ ఇదే ఫాలో అయిపోతుంటాను.
                      తెర మీద కదిలే బొమ్మలు చూడ్డం తప్పించి కథ సరీగ్గా అర్ధం కాని దశలో.. 'పాండవ వనవాసం' చూశాను. ఎన్టీఆర్ గదతిప్పుతూ 'ధారుణి రాజ్యసంపద.. 'అంటు పద్యంమొదలెట్టంగాన్లే ఆవేశంతో ఊగిపొయ్యాను. సినిమా చూశాక.. ఎన్టీఆర్ ఎస్వీరంగారావులు శత్రువులనీ, పొరబాటునఎదురు పడితే గదల్తో కొట్టుకుంటారని ఘాట్టిగా నమ్మాను. కొన్నాళ్ళకి 'గుండమ్మకథ' చూశాను. ఆశ్చర్యం -అందులో రంగారావు ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులు! ఈ సినిమాలన్నీ నిజం కాదనీ, దర్శకుడి సూచనలకిఅనుగుణంగా నటులు నటిస్తారనీ ‘జరుగుల రాధాకృష్ణ’ అని నా ఫ్రెండ్,క్లాస్మేట్  (ఇప్పుడు తెలుగు సినీఫీల్డో  P.R.O గా చేస్తున్నాడు) తన సినీ జ్ఞానభారాన్ని నాకు కొద్దిగా పంచటము వల్ల కొన్నాళ్ళకి అర్ధమైంది.
                    సినిమాలకి సంబంధించిన నా అమాయకత్వం తొలగిపోయింది గానీ రాజకీయాల్లో మాత్రం కంటిన్యూ అయ్యింది. ఇందిరాగాంధీమనకి ఎంతో మంచి చేస్తుందనీ, ఆమెనలా చెయ్యనీకుండా ప్రతిపక్ష నాయకులు అడ్డు పడుతున్నారనీ నమ్మాను. ఆతరవాత ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకుడితో కబుర్లు చెబుతున్న ఫొటో చూసి ఆశ్చర్యపొయ్యాను. వీళ్ళు ఎదురు పడ్డప్పుడు తిట్టుకోవాలి గానీ - ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారేవిఁటి!? అటుతరవాత రాజకీయ నాయకుల మధ్యరాజకీయ విబేధాలే గానీ వ్యక్తిగత వైరాలు వుండవని అర్ధం చేసుకున్నాను. ఆ విధంగా నా రాజకీయ అమాయకత్వాన్నీవదిలేసుకున్నాను.
నా సినిమాల, రాజకీయాల అమాయకత్వానికి కారణమేమి? ఇప్పుడీ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.
                    మనిషి మేధస్సు, అవగాహన, ఆలోచనా విధానం ఒక్కోవ్యక్తికి ఒక్కోరకంగా వుంటుంది. ఒకడు ఒక స్త్రీని గౌరవించాలన్నా, ఇంకోడు అదే స్త్రీని రేప్ చేసిచంపాలన్నా - వారిద్దరికీ సిగ్నల్స్ ఇచ్చే నాడీవ్యవస్థకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మెదడులో వుంటుంది. మానవుని ఆలోచింపజేసేదీ, నడిపించేదీ మేధస్సు. అంచేత - మెదడు ఏ విషయాన్నైనా నలుపు తెలుపులుగా చేసుకుని అర్ధం చేసుకోడానికి మొగ్గు చూపుతుంది (బహుశా మన్లాగే మన మెదడుకీ బద్దకమేమో). అంతేనా?మెదడు బోల్డంత వినోదాన్నీ కోరుకుంటుంది, అందుకోసం విషయాల్ని సింప్లిఫై చేసుకుంటుంది. ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్‌లో - 'మనం vs వాళ్ళు' అనే కాన్సెప్ట్ తయారవుతుంది.
ఇంకిప్పుడు మన ఆలోచనలు ఇలా మారిపోతాయి -
                    నా దేశం vs వాడి దేశం, నా సంస్కృతి vs వాడి సంస్కృతి, నా మతం vs వాడి మతం, నా ప్రాంతం vs వాడిప్రాంతం, నా కులం vs వాడి కులం, నా ఇల్లు vs వాడి ఇల్లు, నా పిల్లలు vs వాడి పిల్లలు.. ఇలా చాలారాసుకుంటూ పోవచ్చు. అన్ని మంచి లక్షణాలు కుప్పపోసి 'నా'కి అప్లై అయితే, అన్ని చెడ్డలక్షణాలుగుంపగుత్తగా 'వాడి'కి అప్లై అవుతాయి.

                   భారత్ పాక్ సరిహద్దులో ఇరువర్గాల మధ్యా కాల్పులు ఏదోక స్థాయిలో జరుగుతూనే వుంటాయి. ఈ వార్త మన్దేశంలో ఇలా రిపోర్ట్ అవుతుంది - భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చి దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్ సైనికులు.ఎదురు కాల్పుల్తో ధీటుగా సమాధానం చెప్పిన మన వీరజవాన్లు. పాకిస్తాన్‌ లో కూడా ఇలాంటి వార్తే రాస్తారు,కాకపోతే అట్టు తిరగబడుతుంది - అంతే తేడా!సైనికుల్ని ఉదాహరణగా చూసినంత సులభంగా రాజకీయాల్లోకి డివిజన్ చూడ్డం మెదడుకు కష్టం. ఎందుకంటే -ఇక్కడ నేను vs వాడు కూడా మనమే కనుక. కానీ - మెదడు ఇన్‌పుట్స్ రిసీవ్ చేసుకోడానికి ఏదోరకంగా డివిజన్అవసరం. ఇప్పుడెలా!?
                  ఈ దేశంలో అనేక కులాలున్నాయి, సామాజిక అసమానతలున్నాయి. కాబట్టి కులాల్ని అధారంగా చేసుకుని పార్టీలుపుట్టుకొచ్చాయి. దక్షిణ భారతంలో బ్రాహ్మణ వ్యతిరేకతతో ద్రవిడ పార్టీ పుట్టుకొస్తే, ఉత్తర భారతంలో జాట్‌లకోసం లోక్‌దళ్ పుట్టుకొచ్చింది. ఈ ప్రయోగాలు ఆయా ప్రాంతాల్లో విజయవంతం కావడంతో ప్రాంతీయ పార్టీల హవామొదలైంది. పార్టీ మనది, మన కులానిది అంటూ అర్ధిక వనరులు సమకూర్చే స్థితిమంతులు (ఆఫ్ కోర్స్, అంతకి పదింతలు రిటర్న్స్ గ్యారెంటీ అనుకోండి).. మన కులం పార్టీ అంటూ గుడ్డిగా అభిమానించే సాధారణ కార్యకర్తలూ (వీళ్ళు మాత్రం అమాయకులు) ప్రాంతీయ పార్టీలకి బలం.
                   ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిద్దాం. ప్రాంతీయ పార్టీల్లాగా ఒక కులాన్నో, ప్రాంతాన్నోనమ్ముకుంటే కేంద్రంలో అధికారం దక్కదు. ఇంకా విశాలమైన ప్రాతిపదికతో ఓటర్లని రెండుగా విడగొట్టాలి. అప్పుడేపార్టీలకి తమకంటూ ఒక ఓటు బ్యాంక్ సృష్టింపబడుతుంది. అందువల్ల మెజారిటీ, మైనారిటీ రాజకీయ వాదాలుపుట్టుకొచ్చాయి.ఒకవైపు రాజకీయ పక్షం మైనారిటీల హక్కులు రక్షిస్తామని హామీ గుప్పిస్తుంది. ఇంకో పక్షం మెజారిటీకి అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. ఇరు పక్షాలు ఎన్నికలప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని ఊదర కొడతారు.అటు మైనారిటీకి వాళ్ళు గానీ, ఇటు మెజారిటీకి వీళ్ళు గానీ ఏదీ చెయ్యరు! ఐదేళ్ళ పాటు ప్రజలు ఒక రాజకీయపక్షాన్ని ఆశగా నమ్మి - ఆపై విసుగు చెంది, మరుసటి ఎన్నికలప్పుడు అవతలి రాజకీయ పక్షం వైపుమొగ్గుతారు. ఇదో see-saw battle.
                 ఇప్పుడు మళ్ళీ 'పాండవ వనవాసం'కి వద్దాం. భీముడికీ, ధుర్యోధనుడికీ పద్యాలు రాసింది ఒకరే, సంగీతదర్శకత్వం వహించింది ఘంటసాలే. ఎన్టీఆర్ ఆవేశంతో తొడగొట్టినా, ఎస్వీఆర్ 'బానిసలు' అంటూ ఈసడించుకున్నా.. ఇద్దరూ కమలాకర కామేశ్వరరావు డైరక్షన్‌లోనే చేశారు. మిక్కిలినేని సావిత్రి చీర లాగలేదు,లాగినట్లు నటించాడు. లాగని చీర కోసం సావిత్రి ఎందుకంత తీవ్రంగా దుఃఖించింది? దీన్నే నటనా కౌశల ప్రదర్శన అందురు! అసహాయంతో గుమ్మడీ, వీరావేశంతో ఎన్టీఆర్, యారోగెన్స్‌తో ఎస్వీఆర్ మనని బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ వైపు నెట్టారు. అంచేత నేను పాండవుల పక్షం వహించి సినిమాని ఎంజాయ్ చేశాను. అందుకే సినిమాసూపర్ హిట్టైంది!
                చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - రాజకీయ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే. అవి అత్యంత తెలివిగా, జాగ్రత్తగా తమలో తాము విబేధాలు ఉన్నట్లుగా నటిస్తాయి. పార్లమెంటుని స్తంభింపజేసేందుకు మేచ్ ఫిక్సింగ్ కుట్రలు చేసుకుంటాయి. అవి సృష్టించిన - మనం vs వాళ్ళు అనే ట్రాప్‌లో పడిపోయి రెండుగా విడిపొయ్యి విమర్శించుకుంటాం. వాస్తవానికి ఇక్కడ మనం లేదు, వాళ్ళు లేదు! ఉన్నదల్లా సామాన్య ప్రజలు, వారిఅవసరాలు, కష్టాలు మాత్రమే!
              సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ మాత్రమే చాలెంజిలు చేసుకోవాలి, పద్యాలు పాడుకోవాలి. వాళ్ళ గోలలేవో వాళ్ళకున్నాయి.మధ్యలో ఏ విదురుడో, వికర్ణుడో దూరబోతే - ఇద్దరూ కలిసి పద్యాలు పాడ్డం కొద్దిసేపు ఆపుకుని, తమగదల్తో వాళ్ళ బుర్ర రాంకీర్తన పాడించేస్తారు! అలాగే ప్రధాన రాజకీయ పక్షాలవాళ్ళు వారి రాజకీయం చేసుకుంటూవుంటారు. మధ్యలో ఇంకెవరికీ అవకాశం రాకూడదు. ఎప్పుడైనా ఆ ప్రమాదమే వస్తే - ఇరు పక్షాలు ఏకమై ఆమూడోవాడి పని పడతాయి - అదీ సంగతి!
             అంకితం -'జగన్ ఇంకా జైలుకెళ్ళలేదేమిటి!? '‘చంద్రబాబు నోటుకి ఓటు కేసు వుందా పోయిందా’ 'అయోధ్యలో రాముడి గుడి ఇంకా మొదలెట్ట లేదేమిటి!?'  ’రాబర్ట్ వాద్రా జైలు కెల్తాడ లేదా’
ఇట్లాంటి ప్రశ్నలతో బుర్ర ఖరాబు చేసుకునే అమాయకులకి..  
                        ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card