ఈ లోకంలో డబ్బున్నవాళ్ళకి మల్లే - చదువుకున్నవాళ్ళకీ అహంకారం వుంటుంది.
అందువల్ల సామాన్యుల ఇష్టాయిష్టాల్ని అర్ధం చేసుకోవడంలో వాళ్ళెప్పుడూ వెనకే
వుంటారు.
చరిత్రకారులు చరిత్రని (దిండ్లని మరిపించే) పుస్తకాల్లో రాస్తారు. ఆ దిండ్ల
వంటి పుస్తకాలు లైబ్రరీలో
నిలువుగా పేర్చి వుంటాయి. ఆ లైబ్రరీలో
(నిశ్శబ్దం పాటిస్తూ) ఆ దిండ్ల మధ్య రోజుల తరబడి కూర్చుని చదివి
చరిత్రని అర్ధం చేసుకోవడం ఒక పద్ధతి. దీనికి
చాలా ఓపిక కావాలి, అందరివల్లా అయ్యే
పని కాదు.
అసలు - చరిత్రని అంత శాస్త్రీయంగా పడీపడీ చదవడం అవసరమా? ఈ సందేహం నాక్కలగడానికి ఒక కారణం వుంది.
మా
పొన్నూరు గూర్చి రోజుల తరబడి పుస్తకాలు చదవండి - మీరు పొన్నూరు నైసర్గిక స్వరూపం,
చరిత్ర వంటి సమాచార "పాండిత్యం" మాత్రమే
పొందగలరు.
చదివే ఓపిక లేదా? రోడ్డు పక్క టీ స్టాల్లో టీ తాగి, గట్టిగా సిగరెట్ దమ్ము లాగుతూ,క్రేన్ వక్కపలుకులు చప్పరిస్తూ - ఒక పూట అలారోడ్లంట
పడి తిరగండి. చక్కటి కల్తీలేని దుమ్ము, నిండైన మురుక్కాలవలు, గుంపుల కొద్దీ
దోమలు,దారీతెన్నూ లేని
ఆటోలు,దారికి అడ్డంగా తోపుడు బండ్లు, కనీసం ప్రక్కకు జరగాలనే సామాజిక స్పృహలేని బాతాఖానీ
బ్యాచులు - మీరు మర్చిపోలేని
"అనుభవం" పొందుతారు.
అంచేత - 'అనుభవం అనేది
పాండిత్యం కన్నా మిన్న' అని నేననుకుంటూ
వుంటాను (ఎన్నో దశాబ్దాల క్రితం ‘రాహుల్ సాంకృత్యయేన్’ కూడా నాలాగే అనుకున్నాడు,అందుకే
లోకం చుట్టాడు).
మీకు నా పాండిత్యం, అనుభవం థియరీ
నచ్చిందా? అయితే మీకు ఆ ప్రదేశ
సంస్కృతి కూడా ఈజీగా అర్ధమవుతుంది. కొన్నిసంఘటనలు చికాకు కలిగిస్తాయి, కానీ అవి అనుభవజ్ఞుడికి చరిత్రకి
ఆనవాళ్ళుగా అగుపిస్తాయి.. ఈ చరిత్ర లైబ్రరీల్లో దొరకదు కదా!
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment