Tuesday, August 01, 2017

అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో అన్నింటి పైనా నిషేధం ఉండేది.





(ఆంగ్ల మూలం: ‘Making Do, 1943: రచయిత: ఇటాలో కాల్వీనో...  కి నా స్వేచ్చానువాదం...)

అలా నిషేధం లేకుండా ఉన్నది పిచ్చుంగుంటలు ఆట ఒక్కటే. మరి, నిషేధం లేనిది ఆ ఒక్క ఆటపైనే కాబట్టి ఊళ్ళో వాళ్ళంతా కూడళ్ళలోనూ, చావిళ్ళలోనూ, చెరువు గట్ల మీదా, చింత తోపులో చెట్ల కిందా గుమిగూడిపోయి పిచ్చుంగుంటలు ఆడుకుంటూ రోజులని గడిపేస్తూ వుండేవాళ్ళు.
నిజానికి అన్నింటి మీదా నిషేధం అదాటున ఒకేసారిగా అలా ఏమీ రాలేదు. కాలక్రమేణా ఒక్కొక్క దానిపైనా నిషేధం అమలవుతూ వచ్చింది. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలు, సైన్యాధ్యక్షులు ఒకసారికి కేవలం ఒకే ఒకదాన్ని నిషేధించడం, అలా నిషేధించడానికి ఒక మంచి కారణం ఉందని చూపించడంతో ఫిర్యాదులంటూ ఎవరూ చేయలేదు. చేయడానికి కారణం కూడా ఏమీ అంతగా కనిపించలేదు. పెద్దగా ఇబ్బంది పడకుండానే ఒక్కో నిషేధానికి క్రమంగా అలవాటు పడిపోతూ వచ్చారలా ఆ ఊరివాళ్ళు.
కొన్నేండ్లు అలా గడిచినై. ఆ ఊరి ప్రభుత్వపు పెద్దలకు ఉన్నట్టుండి ఒక రోజు, ఇలా అన్నింటి మీదా నిషేధం ఉండాల్సిన అవసరమేమీ ఇక అనిపించలేదు. వెంటనే సైనికులని పిలిచి ఊరు ఊరంతా చాటింపు వేయించమని ఆజ్ఞాపించారు. సైనికులు అలానే దండోరాగాళ్ళని వెంటేసుకొని కూడళ్ళకీ, చావిళ్ళకీ, చెరువు గట్లపైకీ, ఊరి దాపుల్లో ఉన్న చెట్ల తోపుల్లోకీ వెళ్ళి మరీ చాటించారు – “ప్రజలారా! బహు పరాక్! బహు పరాక్! మన ఊళ్ళో ఇప్పుడు దేని మీద కూడా నిషేధం లేదు. అందువల్ల, మీరు మీకిష్టమొచ్చిన దేదైనా సరే స్వేచ్ఛగా చేయచ్చు!అనేసి.
ఊళ్ళోవాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు పిచ్చుంగుంటలు ఆడుకుంటూనే వున్నారు.
మీకు అర్థం కావటం లేదా? నిషేధాలన్నీ పెద్దలు ఎత్తేశారు. ఇప్పుడు మీ మీద ఏ ఆంక్షలూ లేవు. మీకిష్ఠమొచ్చింది, అది ఏదైనా సరే స్వేచ్ఛగా మీరు చేయచ్చు,” అని సైనికులు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పారు. మరింత గట్టిగా టముకు కొట్టించారు, మరిన్ని సార్లు చాటింపేయించారు.
సరే!అన్నారు ఊళ్ళోవాళ్ళు, “మేము స్వేచ్ఛగా పిచ్చుంగుంటలు ఆడుకుంటున్నాం.
వాళ్ళకి అర్థమయేట్టుగా చెప్పాల్సిన బాధ్యత సైనికులకే అప్పగించారు పెద్దలు. సైనికులు ఊళ్ళోవాళ్ళకి రకరకాలుగా నచ్చచెప్పారు. నిషేధాలు లేకముందు ఊళ్ళోవాళ్ళు ఎన్ని రకరకాలైన పనులు చేసేవాళ్ళో, ఎన్ని రకరకాలైన వ్యాపకాల్లో ఉండేవాళ్ళో, ఎన్ని ఆటలు ఆడేవాళ్ళో, పాటలు పాడేవాళ్ళో ఊరిస్తూ గుర్తు చేశారు. మళ్ళీ ఆ వ్యాపకాలన్నీ మొదలెడితే ఎంత బాగుంటుందో మరీ మరీ వర్ణించారు. ఊళ్ళోవాళ్ళు కనీసం అటు కాలు ఇటు ముడవకుండా, అటు చూపు ఇటు తిప్పకుండా, ఊపిరి సలపనీకుండా పిచ్చుంగుంటలు ఆడుతూనే ఉన్నారు.
తమ ప్రయత్నాలన్నీ అలా వమ్ముకావడంతో సైనికులు ఊరి పెద్దలు, సైన్యాధ్యక్షుల దగ్గరికెళ్ళి మొర పెట్టుకున్నారు, “అయ్యల్లారా! మేమెంత చెప్పినా ఊళ్ళోవాళ్ళంతా పిచ్చుంగుంటలు ఆడుతునే వున్నారుఅని.
ఓస్, అంతేనా!అన్నారు పెద్దలంతా. ఇదేమంత కష్టమైంది కాదు. పిచ్చుంగుంటలు నిషేధిస్తే సరి!
అది జరిగిన మరుక్షణం ఆ ఊళ్ళోవాళ్ళంతా ఒక పెద్ద విప్లవం లేవదీసి ఆ పెద్దలనందరినీ చంపేశారు. ఆ తర్వాత, కాలయాపన కాకుండా వెంటనే తిరిగి పిచ్చుంగుంటలు ఆడుకోడం మొదలు పెట్టారు.
(మూలం: Making Do, 1943: ఇటాలో కాల్వీనో.  స్వేచ్చానువాదం...)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card