Tuesday, February 14, 2017

పూచిన ప్రతి తరువొక వధువు -పువుపువ్వున పొంగెను మధువు


ఎందుకో నాకు ప్రేమికుల ‘దినం’ అన్న పదం వినగానే, చిన్నప్పుడు మన తెలుగు మాస్టారు వేసిన కేకలు జ్ఞాపకం వస్తాయి. దినం, తద్దినం ఏంటోయ్? రోజు అనలేవూ?” అని.

ప్రేమ -
                ఈ దేశపు జీవ నదుల కన్నా నిత్యం వేగంగా ప్రవహిస్తూనే వుంటుంది. స్పందిస్తూనే వుంటుంది. ప్రేమించని వారికి సెల్ ఫోనే తెలీయనట్టు, ప్రేమిస్తున్న వారికి సెల్ ఫోనే లోకమన్నట్టుగా వుంటుంది. పల్లెల్లో పొలాలు, నగరాల్లో రెస్టారెంట్లు ,కొత్తగా దేవాలయాలు, ప్రేమికులతో నిండిపోతున్నాయి.
                అసలు ప్రేమంటే ఏమిటి..? ఎంత మందికి తెలుసు..? దీనికి సమాధానం మేధావులకు, మహా కవులకు కూడా ఇంత వరకు తేలీదు. ఒకటి మాత్రం నిజం.. ప్రేమనేది ఇద్దరి మనుషుల కలయిక కన్నా.. రెండు హృదయాల కలయిక అని, కానీ ఇప్పుడు అలా లేదు. ప్రేమంటే ఓ ఆకర్షణ, ఇది ఇద్దరి మధ్యా ఉన్నంత వరకూ.. ప్రేమ భ్రమగా ఉంటుందంతే.
                 మనసు అంటే ఏమిటో ప్రేమికులకు తెలీడం లేదు.ఇప్పటికీ చాలా మంది ప్రేమికులు మనసును స్టోర్ రూమ్ లో పడేస్తున్నారు. మనసు అనే మాట ఈ రోజుల్లో ఎక్కడా వినిపించడం లేదు. ఆ పదం పాతబడిపోయింది. అమర ప్రేమికులు అనే వాళ్లు కనిపించడం లేదు. ప్రేమికులు అనే వాళ్లు ఎంత మంది తమ ప్రేమకు న్యాయం చేస్తున్నారో తెలియదు కానీ.. పెద్దలు చూసిన పెళ్లి సంబంధానికి న్యాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా... తమ అమ్మాయో లేక అబ్బాయో ఎవర్నీ ప్రేమించనందుకు ఆనందపడిపోతున్నారు. అమ్మాయికి లక్షల కొలదీ కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి.. అబ్బాయికి లక్షాలాది రూపాయల కట్నం తీసుకోడానికి ఇష్టపడుతున్నారు. కట్నం ఇచ్చి పుచ్చుకోడాల్లో సమాజం చాలా అభివృద్ధి సాధించింది.
                  ఇక ప్రేమికులు ఎంత కాలమైనా ప్రేమించుకోవచ్చు. ప్రేమకు ఎవరి అనుమతి అక్కర్లేదు. విడిపోదలచుకుంటే.. విడిపోవచ్చు. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లనవసరం లేదు. ప్రేమను ప్రేమతోనే ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. ప్రేమించుకున్న వారు గుంపుల కొలదీ ఉన్నా.. అందులో దంపతులైయ్యే వారు కొందరే ఉంటున్నారు.
 
                  ప్రేమించుకుంటే ఏమొస్తుంది..? కట్నం రాదు. అమ్మాయికి బుద్ధిమంతురాలు అనే పేరు రాదు. ప్రేమ అనేది కుటుంబానికి పరువు, మర్యాద, గౌరవాన్ని తీసుకురాదనే పెద్దలు గాఢంగా అభిప్రాయపడుతూనే ఉంటున్నారు. కానీ ఇదే పెద్దలు ఒకప్పుడు యువత అని, వారిలో కూడా ఎందరో కొందరు ప్రేమలో మునిగితేలీన వారని మర్చిపోతే ఎలా ? ప్రేమ వివాహాల్ని దాదాపుగా ప్రోత్సహించరు.
                 తాను పెట్టిన ఖర్చుకు తగినంత ప్రయోజనం వచ్చిందా లేదా అని సాధారణ వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో.. తన ప్రేమ ఫలించిందా లేదా అనే ప్రేమికులు కూడా ఆలోచిస్తారని క్రిమినల్ సైకాలజిస్టు ఒకరు విశ్లేషించారు.
                 కాలం పరిగెడుతూనే ఉంది. లోకం మారుతూనే ఉందంటున్నారు. పరిగెడుతున్న కాలం కనిపిస్తున్నా, మారుతున్న లోకం మాత్రం కనిపించడం లేదు, అప్పుడూ ఇప్పుడూ పెళ్ళిళ్లు జరుగుతూనే ఉన్నాయి. శుభలేఖలు అందుకుంటూనే ఉన్నారు. కట్నం ఆశించకుండా జరుగుతున్న పెళ్ళి అని... ఏ శుభలేఖ పైనైనా ముద్రించ గలుగు తున్నారా..? లేదు, ఇది ప్రేమ వివాహం అని.. ఏ శుభలేఖ పైనైనా ప్రచురించగలుగుతున్నారా...? లేదు, ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్లన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ప్రేమికులు ప్రేమను ఉత్తుత్తిగా ప్రేమించడం కాదు. ప్రేమను పెళ్లి కోసం ప్రేమించగలగాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card