Tuesday, February 21, 2017

ఆడపెండ్లి వారికే పెండ్లి ఎందుకు భారంగా మారాలి? అని యువతులు ఎలుగెత్తి ప్రశ్నిస్తే?




                      
    శనిసింగ్నాపూర్‌లోని శనిదేవుడి అరుగుపైకి తమనూ అనుమతించాలని, మహిళలు ఉద్యమించారు. శబరిమల గుడిలోకి తమను వెళ్లనివ్వాలని సుప్రీంకోర్టు మెట్లెక్కారు. దర్గాల్లోకి మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వరని ముంబయి మహిళలు నిలదీశారు. మసీదుల్లోకి వెళ్లి కూడా ప్రార్థన చేసుకొనే హక్కు తమ కుండాలని కొంతకాలం క్రితం యూ.పీ.లో మహిళలు పోరాడారు. ఈ మహిళా చైతన్యం పెండ్లిండ్లలో పాటిస్తున్న అనాచార ఆచారాలను కూడా ప్రశ్నించాలి. అమ్మాయి కుటుంబంపై ధన వ్యయ ప్రయాసల భారం మోపే ఆచారం మన దేశంలో అన్ని మతాల్లోనూ సాగుతోంది. మహిళల దగ్గరికొచ్చేసరికి అన్ని మతాలూ ఒకే తీరులో వ్యవహరిస్తాయన్న మాట. ఫలానా మతంలో మహిళలు దుర్మార్గంగా అణిచి వేయబడుతున్నారు. వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాల్లేవ్‌..! వారి పెండిండ్లకు రక్షణ లేదంటూ వాదనలు చేసేవారు తమ మతంలో జరుగుతున్నదేమిటో ఆలోచించరు.
                  మనం అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతున్నామని, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నాం. నిజానికి మహిళల దుస్థితిలో ఏమాత్రం మార్పులేదు. పూర్వకాలంలోని సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి దురాచారాలు అనేక మంది సంస్కర్తల కృషి వల్ల దాదాపుగా రూపుమాసిపోయి స్త్రీవిద్య, వితంతు పునర్వివాహాలు లాంటివాటిని ఆమోదించే స్థాయికి సమాజం ఎదిగింది. మరోవైపు వరకట్నం దురాచారం అంతకంతకూ పెరగడం ఆశ్చర్యం కలుగుతోంది. మారుతున్న సమాజంతోపాటు క్రమంగా తగ్గాల్సిన వరకట్న దురాచారం పెరుగుతున్న చదువు, విజ్ఞానంతో పోటీ పడి పెరగడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ దురాచారానికి వ్యతిరేకంగా చట్టాలు చేసే వారిలోనూ, అమలు జరిపే వారిలోనూ చిత్తశుద్ధి లేదు. వారే బహిరంగంగా కట్నాలు తీసుకోవడంతోపాటు పురుషాధిక్య సమాజపు భావజాలాన్ని నరనరానా జీర్ణించుకోవడమే ఇందుకు కారణం. ఎంతో ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ లక్షల డాలర్లు సంపాదించే వారూ వరకట్నాల కోసం వెంపర్లాడుతున్నారు.పనికిమాలిన విదేశీ సంస్కృతిని ఒంట పట్టించుకుంటున్న మన వారు వారి దగ్గర్నుంచి వరకట్నం తీసుకోకుండా వివాహం చేసుకునే మంచి సాంప్రదాయాన్ని మాత్రం నేర్చుకోవడంలేదు.    

                  దీనిపై భారత అత్యున్నత ధర్మాసనం స్పందిస్తూ.. వాళ్లు ప్రతిసారీ వధువులను సజీవ దహనం చేస్తూనే ఆత్మహత్య చేసుకున్నదని చెపుతారు. స్త్రీని దేవతగా పూజిస్తూనే, మరోవైపు వారికి నిప్పంటించి చంపుతుంటారు, ఇది ఆటవిక ప్రవృత్తి. నాగరిక సమాజ విలువలకు వ్యతిరేకం అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది                 
                     మహారాష్ట్ర బీడ్‌ జిల్లా వారులేతాండ గ్రామం యువతులు ఏడాదిపాటు పెళ్లిళ్లు చేసుకోరాదని నిర్ణయించుకొన్నారట. మూడేండ్లుగా ఆ ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. తిండిగింజలు కూడా లేవు. ఈ సమయంలో పెండ్లి అన్నది తమ తల్లితండ్రుల మీద కోలుకోలేని బరువు మోపుతుంది. అందుకనీ, ఆ అమ్మాయిలు ఇప్పట్లో తమకు పెండ్లివంద్దని... భావించారు. ఏడాది కాలం పెండ్లి మాటెత్తరాదని నిర్ణయించుకొన్న యువతులను మెచ్చుకోవాల్సిందే
                             గతంలో కూడా ఇలాంటి వార్తలు అక్కడక్కడా వచ్చాయి. కానీ యువకులు అలాంటి నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు రావు. ఎందుకంటే యువకులకు పెళ్లి లాభసాటి బేరం. కరువు కాటకాలు భారతదేశానికే కాదు ఇతర దేశాల్లోనూ సంభవిస్తుంటాయి. అక్కడ కూడా యువతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటారా? అలాంటి వార్తలు వినలేదు. విదేశాలు కూడా మగపెత్తనానికి కొదువలేదు. మనదేశంలోనయితే మగపెత్తనం లేని రంగంలేదు. పెండ్లిండ్లు మరీనూ. అక్కడ ''ఆ నుండి క్ష'' వరకు మగపెండ్లివారి ఆదేశాల మేరకు ఇదంతా జరగాల్సిందే.

                            ఆడపెండ్లి వారికే పెండ్లి ఎందుకు భారంగా మారాలి? అని యువతులు ఎలుగెత్తి ప్రశ్నిస్తే, అలా ప్రశ్నించడానికి పదిమందినీ పోగేస్తే...? అసలు సమస్యను రంగం మీదికి తెచ్చినట్టవుతుంది.
                           ఇంత ఆధునిక ధోరణి ప్రదర్శించే సినిమాల్లో కూడా పెండ్లిఖర్చులు ఆడపెళ్లి వారి మీదే ఎందుకు రుద్దాలని మాత్రం చర్చించరు. అసలు పెండ్లి కోసం డబ్బులు ఎందుకు తగలపెట్టాలని ప్రశ్నించరు.
                       పెండ్లి అనేది తల్లితండ్రుల బాధ్యతగా, కర్తవ్యంగా ఎంతకాలం కొనసాగుతుందన్నది కూడా ఇప్పుడు ఒక పాయింటే. చావుకు వచ్చిన బంధుమిత్రుల వ్యాఖ్యానాలు కూడా ఇదే ధోరణితో ఉండటం మనం గమనించవచ్చు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశాడు. అన్ని బాధ్యతలూ తీరిపోయాయి అంటూ ఊరడించే మాటలు చెప్తుంటారు. అమెరికాలో స్థిరపడిన కుటుంబాలు అమ్మాయి కోసం ఇండియాలో వెతుకుతుంటాయి. లక్షల్లో సంపాదించే పిల్లలు పెళ్లిళ్లలో లక్షలు ఖర్చు చేయడానికీ వెనుకంజ వేయరు. ఈ ఖర్చు అవసరమా? అన్న చర్చకు కూడా అవకాశంలేని స్థితికి తల్లితండ్రులు ఒకవైపు మెల్లమెల్లగా చేరుతుండగా, సరిపడు ఆదాయాల్లేని ఆడపిల్లల కుటుంబాలు మరింత చితికిపోతున్నాయి.
                       ఇండియా పర్యటనలో భాగంగా  ఓచోట మన మన పెళ్లి తంతు ఆసక్తిగా గమనిస్తూన్న ఓ విదేశీ యుడికి వరకట్న సమస్య గురించి వివరించడమంటే నాకు తలప్రాణం తోకకొచ్చింది. అమ్మాయికి డౌరీ ఎందుకివ్వాలి అంటూ అతను ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు. ఆ కాలంలో అమ్మాయి తరపువారు సంపన్నులయితే పెండ్లి సందర్భంగా ఇలాంటి కానుకలిచ్చి అత్తవారింటికి పంపేవారని ,ఈ కానుకల గురించి చెప్పడానికి డౌరీ అనేమాట వాడారని చెప్పాను. భారత దేశంలో డౌరీ పేర కానుకలతో పాటు నగదు కూడా ఇస్తుంటారని విదేశీకి చెప్పాను. అతను మాత్రం అంతటితో వదల్లేదు.
                ఇదెప్పుడో వందేండ్ల క్రితం నాటి ఆచారం కదా? అంటూ ప్రశ్నార్థక మొహం పెట్టాడు. అవును స్వామీ..! మేమింకా అక్కడే ఉన్నాం..! అని చెప్పుకోవాల్సి వచ్చింది. చేయగలిగిందేమీ లేదు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card