Friday, February 17, 2017

వాడు 'అంగజగురుడు '. ఇంక చెప్పవలసిన దేమున్నది ? రాత్రంతా ఆమెకు నిదురపోవు అవకాశమెక్కడిది






యధాలాపంగా  పాత పాటలు వింటుండగా ఒక పాత కీర్తన వినటం జరిగింది ,వెంటనే మరో కొత్త కీర్తన జ్ఞాపకాని కొచ్చింది .ఆ  కొత్త పాట “తెలవారదేమో స్వామీ” మరి ఆ పాత పాట?  చదవండి.......


“తెలవారదేమో స్వామీ”  శృతిలయలు చిత్రంలోనిది- ఈ పాట అన్నమాచార్య కీర్తనే నేమో అనిపించేలా వ్రాయడం సిరివెన్నెల గారికే చెల్లింది
ఓ స్వామీ, నీ దేవేరి అలమేలు మంగకు తెలవారలేదా (అంటే నిద్ర లేవలేదా)?
(ఎందుకు నిద్ర లేవలేదూ అంటే )- అలసింది కాబట్టి - అలసిన దేవేరి
ఎందుకు అలసిపోయింది? నువ్వు మక్కువ (ఇష్టం) మీరగ (ఎక్కువకాగా) అక్కున (కౌగిట) చేర్చి అంగజు కేళిని (మన్మధ కేళి లో, సంభోగంలో) పొంగుచు తేల్చగ (వివశురాలయే విధంగా అలరించావు).
సంభోగము ముగిసినా ఆవిడ మిగతా రాత్రి అంతా ఆ వివశత్వాన్ని మరిచి పోలేక మరీ మరీ తలుచుకుంటూ మెలకువగానే ఉండిపోయింది - దాంతో అలసిపోయింది. అంచేత పొద్దున ఆమెకింకా తెల్లవారినట్లు లేదు.
 ఇది పదకవితాపితామహుని అద్భుత దివ్య శృంగార కీర్తన - "పలుకు తేనెల తల్లి పవళించెను" కి ఒక  సరసమైన అనుకరణ అనిపిస్తుంది
‘తెల వారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ , నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ’ అనే పాట మీ అందరికీ తెల్సు కాబట్టి మళ్ళీ వ్రాయటలేదు.

కానీ అన్నమాచార్య అసలు కీర్తన ఇలా వుంటుంది.
పలుకు తేనెల తల్లి పవళించెను ! కలికితనముల విభుని గలసినది గాన

1.
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైనదాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపతిమనసు జట్టిగొనెగాన

2.
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగదరుణి బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన

3.
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున దరుణి పవళించెను
తిరువేంకటాచలాధిపుని కౌగిటన్ గలసి ! అరవిరై నును జెమట నంటినది గాన
పలుకుతేనెల తల్లి కలికితనములతో విభుని మెప్పించి, కలసి, పవ్వళించినది.
 

నాకర్ధమైన భావం:
1.‘చెలి పగలైనదాక పవ్వళించినది. ఆమె నిగనిగలాడు మోమున కిరువైపుల వినీల కుంతలములు చెదరినవి. జగదేక పతి మనస్సును తన యవ్వనముచే ఆకట్టు కొన్నది. కలిమి కాంతకు’ స్వాధీనము కాని దేమున్నది ? రేయి సరసములు తెల్లవారు వరకు సాగినవి. అందుకే పగలైనప్పటికీ పడక వదలలేదు.

2.తరుణి బంగారు మేడపై పవ్వళించినది. కొంగు జారినది. చనుగుబ్బల మెరుగులు వ్యాపించినవి. రాత్రి ఆమె శ్రీనివాసునితో కలసి, అలసినది. వాడు 'అంగజగురుడు '. ఇంక చెప్పవలసిన దేమున్నది ? రాత్రంతా ఆమెకు నిదురపోవు అవకాశమెక్కడిది ? ఆమె కనుగొనలు ఎర్రవారినవి. అవి చెంగులువ కనుగొనల తొలకిన సింగారములు.

3. వనిత మురిపాల నటనతో, పారవశ్యముతో ముత్యాల పానుపుపై పవ్వళించినది. ఆమె తారుణ్య లావణ్యములు పరచినట్లున్నవి. వేంకటేశ్వరుని బిగికౌగిలి నలుగుట వలన ఆమె మేన చిరుచెమట వ్యాపించినది. సగము విచ్చిన పూవు వలె అలమేలు  మంగ పవ్వళించి నది

సన్నివేశం ఒక్కటే సందర్భం ఒకటే భావం ఒకటే –ఎవరుకి ఎవరు సాటి? . తేల్చటానికి మనం ఏ పాటి ?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card