Wednesday, September 27, 2017

What does GST mean- ‘G’overnment ‘S’uraksha ‘T’ax



1. “ఒకే దేశం – ‍ ఒకే మార్కెట్ ఒకే పన్నుల వ్యవస్థనినాదంతో వస్తు సేవల పన్ను(GST) చట్టం పట్టాలెక్కింది. కేంద్రం మీద ఆధారపడే దుస్థితి రాష్ట్రాలకు ఏర్పడితే, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిని, దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతుంది.
2. దేశ ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేసే జి.ఎస్.టి. అమలు పర్యవసానాలు ఎలా ఉండబోతాయన్న అంశంపైనే వివిధ వర్గాల ప్రజానీకంలో పలు సందేహాలు, అనుమానాలు, ఆందోళనలు నెలకొని ఉన్నాయి. తొలి దశలో కొంత మేరకు ప్రతికూల ఫలితాలను చవి చూడక తప్పదని, అయితే, దేశానికి దీర్ఘకాలిక ఫలితాలు వనగూడుతాయన్న నిశ్చితాభిప్రాయాలను పలువురు ఆర్థిక నిపుణులు బలంగా వ్యక్తం చేస్తున్నారు.
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదానికి అక్రమ మార్గంలో అందుతున్నకరెన్సీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, రెండు, మూడు నెలలు ప్రజలు ఓపికతో సహకరిస్తే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేయబడుతుందని దేశ ప్రజలకు నాడు మోడీ గారు గట్టి వాగ్ధానం చేశారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర సానుకుల, ప్రతికూల ఫలితాల అనుభవాలు అందరికీ విధితమే.
ఒకటి,రెండేళ్ళు క‌ష్ట నష్టాలను బరించడానికి సిద్ధమై ప్రజలు తోడ్పాటును అందిస్తే జి.ఎస్.టి. అమలుతో దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ గారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన‌ వ్యాఖ్యల ద్వారా సమీప భవిష్యత్తులో ప్రజలపై పరోక్ష పన్నుల‌ భారం తగ్గదన్న సంకేతాన్ని విస్పష్టంగానే సెలవిచ్చినట్లుగా భావించవచ్చు.
3. ఆర్థిక సంవత్సరాన్ని కూడా జనవరి డిసెంబరుగా మార్చబోతున్నారు. కాబట్టి కనీసం ఏడాదిన్నర(ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు మరొక ఆర్థిక సంవత్సరం) కాలం వేచి చూస్తే తప్ప జి.ఎస్.టి. అమలు వల్ల దేశానికి, సామాన్య ప్రజలకు వనగూడిన ఆర్థిక ప్రయోజనాలను అంచనా వేయడం ఇప్పుడు కష్టం.
4.పన్నులు ఎగవేసే వారి ఆటలు ఇహ! సాగవని, పన్నులు చెల్లించే వారి సంఖ్య అధికమై ప్రభుత్వాలకు పరోక్ష‌ పన్ను రాబడి బాగా పెరుగుతుందని, డిజిటలైజేషన్ విధానం అమలు వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, ద్రవ్యోల్భణానికి కళ్ళెంపడుతుందని, నిత్యావసర వస్తువుల‌ ధరలు తగ్గుతాయన్న భావనను ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. ఆ లక్ష్యాలు నెరవేరుతాయా! లేదా! అన్నది ప్రభుత్వాలు అనుసరించే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.
5. జి.ఎస్.టి. నూతన విధానం సామాన్య ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గిస్తుందన్న గ‌ట్టి బరోసా లభించడం లేదు.
6. వ్యవసాయ ఉత్ఫత్తులపై పన్ను విధించలేదని గొప్పలు చెప్పుకొంటూ, వ్యవసాయ ఉత్ఫత్తులను ముడిసరుకుగా వినియోగించుకొని అదనపు విలువను జోడించి ఉత్ఫత్తి చేసే వస్తువులపై(వ్యాల్యూ యాడెడ్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్) పన్ను విధిస్తున్నారు. ఉదా: చెరకు నుండి బెల్లం, పసుపు నుండి పసుపు పొడి, మిర్చి నుండి మిరప పొడి, పండ్ల నుండి పండ్ల రసాలు, ధాన్యం మరియు తృణ ధాన్యాలను సుభ్రం చేసి బ్యాండెడ్ ప్యాకెట్స్ గా తయారు చేస్తే పన్ను విధిస్తారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలంటే వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన రంగాలపై పన్ను విధిస్తే ఆశించిన ఫలితాలు లభించవు.
           గ్రామీణ చేతి వృత్తులైన చేనేత రంగం వంటి రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో జీవన్మరణ పోరు సాగిస్తున్నాయి. చీమకుర్తి గ్రానైట్, తదితర క్వారీ పరిశ్రమపై కూడా భారం వేశారు. అత్యధికంగా ఉపాథి కల్పనా రంగాలుగా ఉంటూ సంక్షోభంలో ఉన్న అసంఘటిత రంగాల పట్ల‌ ప్రత్యేక దృష్టి సారించడానికి బదులు పన్ను రాబడే ముఖ్యమనుకొంటే దుష్పలితాలను చవిచూడాల్సి వస్తుంది.
7. ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను వ్యవస్థ అన్న నినాదం పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి సంక్లిష్టమైన వ్యవస్థగానే జి.ఎస్.టి. చట్టాన్ని రూపొందించారు. ద్రవ్యోల్బణానికి హేతువు పెట్రోల్ ఉత్ఫత్తులు. రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఆర్థిక వనరు కాబట్టి, వాటిపై పన్ను విధించే హక్కును వదులు కోవడానికి రాష్టాలు ఒప్పుకోలేదన్న సాకుతో జి.ఎస్.టి. పరిథి నుండి పెట్రోల్ ఉత్ఫత్తులను మినహాయించారు. అలాగే మద్యాన్ని, స్థిరాస్థి వ్యాపారాన్ని కూడా పక్కన బెట్టారు. ప్రజలపై పన్నులు, సెస్ ల రూపంలో ఆర్థిక భారాలు మోపి ప్రభుత్వ ఖజానాలను నింపు కోవడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నైజంగా నడచిన చరిత్రకు అంత సులభంగా ముగింపు పలుకుతారా! అన్న సందేహం లేక పోలేదు.
8. ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మన దేశ మార్కెట్ లోకి వచ్చి పడుతున్నాయి. పర్యవసానంగా దుష్పలితాలను అనుభవిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. ద్వారా నియంత్రణ చేస్తామంటున్నహామీ అమలు తీరు తెన్నులపై ఈ అంశం ఆధారపడి ఉన్నది.
9. జి.ఎస్.టి. అమలులోకి వచ్చాక జి.ఎస్.టి. కౌన్సిల్ నిర్ణయాల మేరకే పన్నులు విధించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి అవకాశం కల్పించేలా జి.ఎస్.టి. కౌన్సిల్ సభ్యుల పొందిక ఉండడం సమర్థనీయం కాదు. జి.ఎస్.టి. సభ్యుల పొందిక విషయంలో సమతుల్యత సాధించాలి.
10.కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, అలాగే రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య భవిష్యత్తులో సమస్యలు ఉద్భవించవచ్చు. పన్నుల ఆదాయం వృద్ధిని 14% ను ప్రామాణికంగా పరిగణించి ఆపైన వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించదని, 14% లోపు ఉండే రాష్ట్రాలకు మాత్రమే ఏ మేరకు తగ్గితే ఆ మేరకు ఆదుకొంటుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల ఆదాయం వృద్ధి రేటు 22%గా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే జి.ఎస్.టి. అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్నికేంద్రం భరించదన్న మాట. ఈ తరహా సమస్యలు అనేకం ఆచరణలో ఎదురు కాబోతున్నాయి. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఎస్.టి. కౌన్సిల్ వేదికగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలసి ఉంటుంది.
11. జి.ఎస్.టి. వ్యవస్థ పూర్తిగా సమాచార, సాంకేతిక వ్యవస్థ(ఐటి నెట్ వర్క్)పై ఆధారపడి నిర్మితమై ఉన్నది. మన దేశం ఐటి రంగంలో ముందడుగు వేస్తున్నా, ఇంకా బలమైన, పటిష్టమైన వ్యవస్థగా ఆవిర్భవించ లేదు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటలైజేషన్వైపు ప్రయాణించాలని ప్రజలను ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఎలాంటి సమస్యలు ఎదురౌతున్నాయో గమనిస్తూనే ఉన్నాం. మౌలిక వసతులను విస్తరించుకొని, పటిష్టమైన భద్రతా వ్యవస్థను నెలకొల్పుకొంటే తప్ప జి.ఎస్.టి. విధానాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
12. పన్ను ఎగవేతకు అలవాటుపడ్డ అక్రమార్కులు _కామర్స్విధానాన్నివాడుకొనే అవకాశమూ లేక పోలేదు. ‍ఇ_కామర్స్ విధానంలో ఏది వస్తువో! ఏది సేవో! నిర్వచించడంలోను, వ్యాపారస్తునికి వ్యాపారస్తునికి మధ్య, వ్యాపారస్తునికి వినియోగదారునికి మధ్య, వినియోగదారునికి వినియోగదారునికి మధ్య సంబంధాలను నిర్వచించడంలోను కూడా సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.
13. జి.ఎస్.టి. అమలులో ఎదురయ్యే సమస్యలను రాజ్యాంగం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజానుకూల దృకథంతో పరిష్కరించుకొంటూ అడుగు ముందుకేస్తే సత్ఫ‌లితాలు వనగూడతాయి. సరళీకృత ఆర్థిక విధానాల నీతికి బానిసలై కార్పోరేట్ రంగం సేవలో నిమగ్నమై ఉన్న పాలకులు అదే బాటలో జి.ఎస్.టి. విధానం అమలులో కూడా నడక సాగిస్తే సామాన్యుల ఆశలు అడి ఆశలుగానే మిగిలి పోతాయి.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card