Thursday, September 21, 2017

గతం గొప్పతనం గానీ, మతం గొప్పతనం గానీ ప్రజలకు సంబంధం లేనిది



గతం గొప్పతనం గానీ, మతం గొప్పతనం గానీ ప్రజలకు సంబంధం లేనిది       


 భారత దేశం కుల సమాజంగా ఇంకా ఇంకా తీసుకుంటోంది. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందకుండా, శాస్త్రబద్ధ ఆవిష్కరణలు జరగకుండా కుల, మతాలకు సంబంధించిన వెనుకబాటు భావనలు ఆటంకం కలిగించాయి. ఈ ఆటంకాలను తొలగించడానికి ప్రజలు కంకణబద్ధులై విప్లవాలకు తెగించేలోపు బ్రిటిష్ వాడు దేశాన్ని ఆక్రమించేశాడు. అనగా ఐరోపాలో జరిగినట్లుగా భారత దేశంలో కూడా విప్లవాల ద్వారా పాత వెనుకబడిన సమాజాలను మార్చుకోవడానికి ప్రజలు సిద్ధపడకుండా బ్రిటిష్ వాడు అణచివేశాడు. అదే సమయంలో ఇక్కడి భూస్వామ్య వ్యవస్ధను కాపాడి తనకు సేవలు చేసేదిగా, తన అవసరాలు తీర్చేదిగా మార్చుకున్నాడు.
                       అనగా భారత సమాజంలో పై భాగంలో (తరగతుల )వారు బ్రిటిష్ వాడిని తన్ని తరిమేయడానికి ప్రజల్ని కూడదీయడానికి బదులు వాడి వ్యాపార అవసరాలు తీర్చడానికి, వాడు నేర్పిన విద్యతో వారికి సేవలు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా ఐరోపా దేశాలకు వెళ్ళి ఇంగ్లీషు చదువులు చదివి సివిల్ అధికారులుగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత స్ధానాలు నిర్వహించారు. ఎంత ఉన్నత అధికారి అయినా వాళ్ళు చివరికి బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేసినవారే.
                       కానీ దేశంలో అణచివేతకు గురవుతున్న సాధారణ ప్రజానీకం ఊరుకోలేదు. ముఖ్యంగా రైతులు, వివిధ చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులకు మార్కెట్ లేక ఉపాధి కోల్పోవడంతో తిరుగుబాట్లు లేవదీశారు. కొందరు రాజులు కూడా ఈ తిరుగుబాట్లలో పాల్గొన్నారు. 1857 తిరుగుబాటు ఇలాంటిదే.
                       కాబట్టి మన దేశం పరాయి పాలకుల పాలబడడానికి ప్రధాన కారణం క్షాత్ర పరంపర కలిగిన వర్గాలే తప్ప ప్రజలు కాదు. వారు పరాయి పాలనను ప్రజల సహాయంతో ఎదుర్కోవడానికి బదులు తమలో తాము కొట్టుకుని వెన్నుపోట్లు పొడుచుకుని పాలనను తెల్లవాడికి అప్పజెప్పారు. తెల్లవాడి మీద ప్రజలు తిరగబడినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే బ్రిటిష్ వాడికి అండగా నిలిచి ప్రజల ఆగ్రహాన్ని సేఫ్ గా తమ కింద ఆర్గనైజ్ చేసి తెల్లవాడు గౌరవంగా పక్కకు వెళ్ళే వీలు కల్పించారు.
                            ముఖ్యంగా  కొందరుముస్లిం దాడులుఅంటున్నారు. కానీ ముస్లిం పాలకులు వారివెంట వచ్చినవారు ఈ దేశంలో కలిసిపోయారే గానీ ఇక్కడి మార్కెట్లను ఆక్రమించుకునే భారీ డిజైన్ తో వారు రాలేదు. అనగా వారు కూడా భారత దేశంలో భాగం అయ్యారు. ఒకరు ఇద్దరు విధ్వంసాలకు పాల్పడినప్పటికీ వారి ప్రధాన లక్ష్యం తాము టార్గెట్ చేసుకున్న ప్రదేశంలోని సంపదలే తప్ప మతం కాదు. అసలు భారత దేశ చరిత్రను హిందు, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా సంకుచిత దృష్టితో విభజించడమే వ్యాపార ప్రయోజనం కోసం బ్రిటిష్ పాలకులు చేసినపని. ప్రజల్లో మత విద్వేషాలు నాటే తప్పుడు చరిత్రను ప్రబోధించడం ద్వారా బ్రిటిష్ పాలకులు తమ దోపిడీని సజావుగా సాగించగలిగారు.         
                  గతం గొప్పతనం గానీ, మతం గొప్పతనం గానీ ప్రజలకు సంబంధం లేనిది. గతంలో బాగా బతికిన వర్గాలే నేడు గతం గొప్పతనాన్ని గుర్తు చేసి లేని ఔన్నత్యాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంస్కృతులను, ఆచార వ్యవహారాలను, చరిత్రలను ఎక్కువ, తక్కువ గొప్పతనాలుగా వర్గీకరించడం తగని పని. అదొక వృధా ప్రయాస. ఎందుకంటే ఆయా సంస్కృతులన్నీ ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల నుండి ఆవిర్భవించినవే. దేని ప్రత్యేకత దానిదే. దేని గొప్పతనం దానిదే. ఆయా సంస్కృతుల లోని ఉన్నత విలువలను కాపాడుకోవడమే నేటి అవసరం. పరాయి సంస్కృతుల ఉనికిని ఉన్నది ఉన్నట్లు గుర్తించడం మనం చేయవలసిన పని. వీలయితే వారి నుండి మంచి ఉంటే నేర్చుకోవాలి. చెడు ఉంటే తిరస్కరించాలి. గొప్పల జోలికి పోవడం వల్ల ఏ ప్రయోజనమూ నెరవేరదు------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

.

No comments:

Post a Comment

Address for Communication

Address card