Thursday, September 14, 2017

ఏ దిల్‌ అభీ నహీ భరా




     కొత్తదనం అనేది ఈ గడిచిన ఇరవై యేళ్లలో పాతపడిపోయిన మాట. కొత్తదనం ఎందుకోసం అని అడగకూడదు. సెంటర్‌ఫ్రెష్‌ యాడ్‌ లాగా అదొక అబ్సర్డ్‌ థింగ్. కొత్తదనం కోసమే కొత్తదనం. కాలర్‌ ఉన్నపుడు లేనిది కొత్తదనం. తొడలను కప్పేసే జీన్స్‌ బదులు అక్కడ బ్లేడుతో గీతలు పెట్టడం కొత్తదనం. జుట్టు దువ్వుకునే బదులు పైకి లేపుకునే స్పైక్స్‌ కొత్తదనం.
             పాట కూడా అంతే. మామూలుగా సెలయేరులాగా పాట ఉందనుకోండి. మధ్యలో నాలుగు నక్క ఊళలు పెడితే కొత్త దనం. 90లకు ముందు పాటలు సాహిత్య ప్రధానమైనవి. తర్వాత మ్యూజిక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌నెట్‌తో అన్ని దేశాల ట్యూన్స్‌ని ఇండియనైజ్‌ చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ సాహిత్యం అనేది మ్యూజిక్‌కి వెనకాతల వినిపించే కొన్ని ధ్వనులు మాత్రమే. అంతకంటే ప్రాధాన్యమేమీ లేదు. అందులో రిథమ్‌, బీట్‌ ముఖ్యం. ఆధునిక సాంకేతికాభివృద్ధి సింగర్‌కి మ్యుజీషియన్‌కు ఉన్న బంధాన్ని తెంపేసింది. ఒక సాలూరి, ఒక కృష్ణశాస్ర్తి కూర్చుని సార్‌ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా మారిస్తే ఎలా ఉంటుంది అని చర్చించుకునే వాతావరణం లేదు. జనం కాళ్లు చేతులు ఆడించగల శబ్దాలను సృష్టించగలిగిన మ్యుజీషియన్‌ కొన్ని ట్యూన్స్‌ ఇస్తారు. ఎవరో ఒక గీతకారుడు అందులో నాలుగు మాటల్నికూరుస్తారు. పాడువారు వారి సమయాల్లో విడివిడిగా వచ్చి ఎవరి ట్రాక్ వారు పాడిపోతారు. రూపం సారాన్ని ఆక్రమించడమంటే ఇదే. కాళ్లూ చేతులు ఆడాలే కానీ హృదయం ఊగనక్కర్లేదు. మనసున మల్లెలూగాల్సిన అవసరం నేడు అంతరించింది. ఏ దిల్‌ అభీ నహీ భరా అనడానికి దాని అవసరమెక్కడుంది?
                         మార్కెట్‌ మన అవసరాలను కూడా టైలరింగ్‌ చేస్తుంది. కొత్త అవసరాలను సృష్టిస్తుంది. తన దారికి అడ్డుగా ఉన్న అవసరాలను డిలీట్‌ చేస్తుంది. కాళ్లూ చేతులు ఆడించగలగడం మాత్రం నైపుణ్యం కాదా? ఎందుకు కాదు వల్గర్లీ స్కిల్డ్‌.  కాకపోతే నైపుణ్యం ఫర్‌ వాట్‌?  మచ్చుకు ఒక ఇన్‌స్టంట్‌ లక్షణం సంగతే చూద్దాం.
                  ఇవాల్టి పాటలు నాలుగు కాలాల పాటు నిలవడం లేదు అని వినిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు నిలవడం లేదు?  నిలవాలని వారు కోరుకోవడం లేదు. మార్కెట్‌కు ఆ అవసరం లేదు. ఆ టైంలో నాలుగు కాసులు రాలాలి.  ఆ వారంలో అది గోల్డో ప్లాటినమో ఏదో ఒక డిస్క్‌ అనిపించుకోవాలి. అంతే. సినిమా వందరోజులు ఆడాలని మూడొందల అరవై రోజుల రికార్డు సృష్టించాలని అనుకునే వెర్రిబాగుల వాళ్లెవరైనా ఉన్నారా....మొదటివారంలో ఎంత కలెక్షన్‌ వచ్చిందనేదే ముఖ్యం. కాబట్టి అంతిమంగా ఆ రంగంలో విలువలను నిర్దేశించేది మార్కెట్టే.
                 పాడుతా తీయగా, సరిగమప లాంటి కార్యక్రమాల్లో ఎందుకు పాతగీతాలే వినిపిస్తాయి? అవి మాత్రమే గుర్తుంచుకోవడానికి అనువుగా ఉంటాయి కనుక. కొత్త పాటల్లో గుర్తుంచుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. దాన్ని మించి మ్యూజిక్‌ ట్రూప్‌ పూర్తి స్థాయిలో లేకపోతే పాట అస్సలు వినలేం. అన్యాయంగా ఉంటుంది.  ఎందుకంటే దాని ప్రాణం అందులోనే ఉంది కనుక. మున్నీ బద్నామ్‌ హుయీ ఎందుకంత హిట్‌ అయ్యింది. రిథమ్‌.  కొలవెర్రి పాట పాపులారిటీ వెనుక ఏముంది. దీనికి తోడు ఇంటర్‌నెట్‌, మొబైల్‌ చాటింగుల్లో వాడే కత్తిరించిన ఇంగ్లిష్,. స్థానిక భాషతో కలగలిపిన ఇంగ్లిష్‌ వాడడం మరో తెలివైన ఎత్తుగడ. ఈ వెర్రిలో సమాజానికి ఉపయోగపడేదికానీ మరీ దిగజార్చేది కానీ దానికదిగా ఏమీ లేదు కానీ మీడియా దీని వెంట పడడం వెనుక మార్కెట్‌ ఉంది. మీడియా అనే భూతానికి నిరంతరం ఏదో ఒక ఈవెంట్‌ కావాలి. లేకపోతే వాటి ఈవెంట్స్‌ని అవే క్రియేట్‌ చేసుకుంటాయి. ఇంకా వైదిస్‌ కొల’వెర్రి ‘అని అడగాలా!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card