Saturday, September 02, 2017

వాళ్ళు మాంసం తినరు..అందుకే సరస్వతి వాళ్ళ నాలిక మీద ఉంటుంది



 
తెలుగు వారికి సినిమా కబుర్లన్నా, రాజకీయ చర్చలన్నా పిచ్చి ఎక్కువని పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా తెలుసు..బయటికి చెప్పుకోరు కానీ వీళ్ళకి ఇష్టమైంది మరోటి ఉంది..'కుల వాదం'.
'ఛీ ఛీ..వెధవ కుల పిచ్చి, కుల గజ్జి నాకు లేవండీ' అని అంటూనే ఏ ప్రముఖుడు ఏ కులం వాడో తెలుసుకుని వాడు తమ కులం వాడైతే లోలోపల అదో రకమైన ఆనందం పొందడం, ఎవడిది ఏ కులమో తెలుసుకుని వాడి గురించి ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం మనవాళ్ళకి మామూలే...
ఒక కొత్త గాయకుడు పాట బాగా పాడుతుంటే అతని కులం తెలుసుకుని, "ఓహో..ముందే అను కున్నాను. ..బ్రాహ్మలకి కాక సంగీతం ఎవరికి అబ్బుతుంది...వేరే కులం వాడు పాడాడంటే గొప్ప గానీ, బ్రాహ్మలు పాడటంలో ఆశ్చర్యమేముంది", అన్నారు ఒక చౌదరి గారు..అదేమంటే ఘంటసాల, ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇప్పటి తరం హేమ చంద్ర వరకు గుక్క తిప్పు కోకుండా బ్రాహ్మణ గాయకుల పేర్లు చెప్పాడు...
'మరి ఎమ్మెస్ సుబ్బలక్ష్మో'..అన్నాను నేను..
'ఆవిడా అదే చూస్తే తెలీదు  , ఆ కట్టూ బొట్టు..విష్ణు సహస్ర నామాల్లో ఆవిడ ఒత్తులు పలికిన తీరు...ఏది ఎమైనా సంగీతం, సాహిత్యం బ్రాహ్మల తర్వాతే ఎవరైనా. ఎందుకంటేవాళ్ళు మాంసం  తినరు..అందుకే సరస్వతి వాళ్ళ  నాలిక మీద ఉంటుంది, మెదడు పదునుగా ఉంటుంది..బ్రాహ్మలు విష్ణు మూర్తి నోట్లోంచి వచ్చారంటారు అందుకే' అంటూ చెప్పుకుపోతున్నాడు..
సుబ్బలక్ష్మిది బ్రాహ్మణ కులం కాదని అతనికి చెప్పినా నమ్మలేదు..'నీకు తెలీదు ఊరుకో' అన్నాడు.. చాలా యేళ్ళ క్రితం అరుగు మీద కూర్చుని స్వాతి కిరణం లో 'సంగీత సాహిత్య సమలంకృతే..' పాట వింటూ 'ఏరా! ఇది రాసిన నారాయాణ రెడ్డి బ్రాహ్మడే కదా' అని అడిగాడు నా స్నేహితుడు..వాడి మొహాన్ని అదోలా చూసాను..కాసేపు ఆలోచించాక లొపల దీపం వెలిగినట్టుంది.. నాలుక కరుచుకుని 'ఛా...పేరులో రెడ్డి ఉంది గా..' అని నవ్వుకున్నాడు.. మాంసం తినకపోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందంటే నాకెందుకో నమ్మ శక్యంగా ఉండదు...ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరికరాలన్నీ గత కొన్ని శతాబ్దాలుగా కనిపెడుతున్నది గొడ్డు మాంసం తినే పాశ్చాత్యులే...సంగీతం........ కూడా శాకాహారులకే అబ్బుతుందంటే ప్రపంచాన్ని ఊపేసిన గాయకుడు మైకేల్ జాక్సన్ శాకాహారా? నాకు తెలీదు...అసలు బ్రాహ్మణులు ఉల్లిపాయ తినకూడదు అని ఎక్కడో ఉంది కాని మాంసం తినకూడదు అని వేదంలొ చెప్పలేదట. అసలు వేదాల్లొ అశ్వమేధ యాగం వగైరాల్లో జంతు బలి ఇవ్వడం, ఆ మాంసాన్ని ప్రసాదంగా వండడం ఉండేదట....బ్రాహ్మల్లో శాకాహారం అనేది రాజకీయ అవసరంగా సంక్రమించిందే తప్ప అది కుల ధర్మం ఎప్పుడూ కాదని సర్వేపల్లి రాధాకృష్ణ ఒక వ్యాసంలో రాసారు...
         మంత్రం చదివే బ్రాహ్మణుడు, ఖర్చు పెట్టే క్షత్రియుడితో పాటు, జంతు మాంసంతో వ్యవహరించే మాదిగ వేద కాలంలోని మత ధర్మంలో కీలక పాత్ర పోషించే వారు...వాళ్ళల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరిగేవి..గౌతముడు అహల్యను పెళ్ళి చేసుకోవడం, వశిష్టుడు అరుంధతిని చెసుకోవడం ఈ బాపతే...అయితే తక్కిన కులాల వాళ్ళకి యజ్ఞ యాగ విధుల్లో పెద్ద పాత్ర ఉండేది కాదు...
 

          కానీ బెంగాల్ లోనూ, ఒరిస్సాలోను బ్రాహ్మలు చేపలు తింటారు..వాటికి జలపుష్పాలు అని పవిత్రంగా పిలుచుకుంటారు కూడా. అందుకు కారణం ఆర్ధిక పరిస్థితి. కూరగాయలకన్నా చవకగా దొరికేవి చేపలు ఆ  రోజుల్లో. అధిక సంతానం, స్వల్ప ఆదాయం ఉన్న వాళ్ళుఏం చేస్తారు? చేపల వరకు మినహాయింపు విధించు కున్నారు. అలాగే కాష్మీర్ లో బ్రాహ్మలు గొర్రె మాంసం తినడం పరిపాటే..అందుకు కారణం అక్కడి వాతావరణ ప్రభావం. పెద్దగా రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, కూరగాయలు పండని మంచుకొండల్లో మరి మాంసాహారమే శరణ్యం అయి కూర్చుంది.
        ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card