Tuesday, May 02, 2017

జస్ట్ బార్న్ బేబీస్ ను బేస్ చేసుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్



జస్ట్ బార్న్ బేబీస్ ను బేస్ చేసుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్

వాళ్లు బేర్ మనగానే డాడీ, ఇతర బంధువులు ఛలో మమ్మీ కేర్ అంటారు. వేలకు వేలు ఖర్చు తప్పదు. జస్ట్ బార్న్ అన్న పేరే గానే, మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇందులోనే వుంది. దీంతో బడా కంపెనీలు బుడ్డాడి కోసం బిగ్ బజార్లు పెట్టడానికి పోటీ పడుతున్నాయి.
  చిట్టి చిట్టి చేతులు.. పొట్టి పొట్టి కాళ్లు. చూడముచ్చటగా వుండే ముద్దు ముఖాలు. వాటికి మరింత వన్నె తెచ్చేలా.. వారి ఆరోగ్యం బావుండేలా.. చూసుకోవాలంటే కావలసినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జరగాలంటే బోలెడు వస్తువులు కావాలి. అలాంటి వస్తువులన్నీ ఒకే చోట దొరికే చైన్ షాపులు పెట్టడం ఇప్పుడో పెద్ద బిజినెస్.
చిన్న పాపాయి నవ్వులు చిందిస్తుండాలంటే పెద్ద కసరత్తే చేయాలి. వారు పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకూ తీసుకోవల్సిన జాగ్రత్తల లిస్టు చాలా పెద్దదే. దీంతో ఈ చిట్టిపొట్టి చిన్నారి పిల్లల చుట్టూ పెద్ద మార్కెట్టే విస్తరిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలకు చోటు గాడు, బడా బిజినెస్ ఇస్తున్నాడు. దీంతో ఆయా కంపెనీలు జస్ట్ బార్న్ బేబీస్ ను బేస్ చేసుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్ వర్కౌట్ చేస్తున్నాయి.
ఇంతకు ముందు వారిని పిల్లలే కదాని వదిలేసింది మార్కెట్. ఇప్పుడు సీన్ అలా లేదు. వాళ్లు పిల్లలు కాదు పిడుగులన్న నిర్ధారణకు వచ్చేశారు మార్కెట్ పండితులు. ఈ బిజినెస్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల పాలిట కల్పవృక్షంగా మారింది.
మాములుగా అన్న అడుగేస్తే మాస్ అంటారు. అది ఓల్డ్ డైలాగ్. చిన్నోడు పిస్ కొట్టినా బిజినెస్ ఇది లేటెస్ట్. నాపీ ప్యాడ్స్- దగ్గర నుంచి సాక్సులు- ఫారెక్సు ఇతర అనేకానేక బేబీకేర్ ప్రొడక్ట్స్ ను ఒకే చోట అమ్మకాలు సాగిస్తూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు
ఇంతకు ముందు పిల్లలంటే నాలుగు పాత బట్టలపే వాడి మేనేజ్ చేసేవారు. ఉన్న ఆ బట్టల్నే అటు ఇటూ మార్చి పిల్లాడ్ని పెద్ద చేసేవారు. అందుకే ఇంట్లో పిల్లలు మొండి మొలలతో తిరుగుతూ కనిపించే వారప్పట్లో. ఇప్పటి పరిస్థితి అలా  లేదు. పాపాయి పుట్టిందంటే రూపాయి పరుగు పెడుతుంది. పకడో పకడో అంటూ ఎంత వెంట పడ్డా వీలు కాదు. కారణం వారు పుట్టీ పుట్టక ముందే వాడాల్సిన దుస్తుల, వగైరాల కథాకమామిషు మాములుగా వుండదు.
నెత్తి మీద పెట్టే క్యాప్ నుంచి కాళ్లకు వేయాల్సిన సాక్స్నడుముకు నాపీ ప్యాడ్. వారిని పడుకోపెట్టబోయే ముందు వాడాల్సిన బెడ్ వారికి మాత్రమే వాడాల్సిన టవల్స్, నాప్ కిన్స్. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆ ఆడంబరానికి ఓ అంతంటూ వుండదు. ఇక బాడీ మొత్తం కవరయ్యేలా  ఓ డ్రెస్ సెటప్. ఇదో పెద్ద ప్యాకేజ్.
ఇది జస్ట్ బార్న్ బేబీ గురించి. ఇక వాళ్లు బాలచంద్రుడిలా పెరిగి పెద్దవుతూ వస్తుంటే ఆ సైజులన్నీ మారిపోతూ.. ఎప్పటికప్పుడు కొత్తవి కొంటూ పోతుంటే.. ఇంట్లో పెద్దాళ్ల బట్టలకన్నా పిల్లల బట్టలే ఎక్కువ కనిపిస్తాయి. అలాగని అవి డెడ్ చీప్ గా దొరుకుతాయా అంటే అదీ లేదు. పెద్ద వాళ్ల ఫ్యాంటూ, షర్టులకన్నా.. పిల్లల బట్టలు  ఎక్కువ ధర పలుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు. పిల్లలకు బట్టలు కొనాలంటే ఏ బ్యాంకులోనో లోన్ పెట్టాల్సిన పరిస్థితి.
 అంతే కాదు, ఈ షాప్స్ లో తల్లులకు మెటిర్నిటీ క్లాత్స్, ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవలసిన జాగ్రత్తలకు చెందిన పుస్తకాలను కూడా విక్రయిస్తున్నారు. పాపాయి పుట్టడం ఆలస్యం డబ్బున్న కుటుంబాలు గో మదర్ కేర్ అంటున్నాయి. లేకుంటే జస్ట్ బార్న్, మామ్ అండ్ మీ అంటున్నాయి. ఒక మోస్తరు సూపర్ మార్కెట్ కల్చర్ కు అలవాటు పడ్డ వారు కూడా  బేబీ పుట్టగానే ఈ షాపులకు షాపింగ్ వచ్చి తమ జేబులకు చిల్లు పెట్టేసుకుంటున్నారు. తాము పుట్టినప్పుడు ఇన్నేసి వస్తువులు లేవు. ఆముదం పోసి, సున్నిపిండి పూసి.. మమ్మల్ని పెంచారు తెలుసాఅని బిల్ కౌంటర్ లోని అమ్మాయిలతో అంటూ కార్డులిచ్చి మరీ గీకించుకుంటున్నారు.
చోటూల చుట్టూ విస్తరిస్తున్న బడా బిజినెస్ చూసి.. కంపెనీలు కూడా తెగ ఆనంద పడుతున్నాయి. బుజ్జాయి బేస్ చేసుకుని ఇంత వ్యాపారమా? అయితే ఈ మార్కెట్ ను మరింత డెవలప్ చేస్తాం. తమ ప్రాడొక్టులను కస్టరమర్లలో మంచి డిమాండ్ వుందని చెబుతూ తెగ ఆనంద పడిపోతున్నాయి.
దీంతో రీటైల్ దిగ్గజాలు, కిడ్స్ వేర్ ఇండస్ట్రీ విస్తరణకు ఇంట్రస్ట్ చూపుతున్నాయి. చోటూ కోసం.. వీధికో బిగ్ బజార్ పెట్టడానికి సిద్ధం అంటున్నాయి. గతంలో ఈ విభాగంలో కొన్ని కంపెనీలు దెబ్బ తిన్నాయంటే అందుకు కారణం పాలనా పరమైన తప్పులు. అంతేకానీ  బిజినెస్ మోడల్లో ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు.
ఆన్ లైన్ లోనూ బుడ్డోడి బిగ్ బజర్ భారీగా విస్తరించింది. ఆఫర్ల మీద ఆఫర్లు. క్లిక్ అంత దూరంలో బేబీ కేర్. దీంతో ఈ బిజినెస్ మూడు ఆన్ లైన్ ఆర్డర్లు- ఆరు డెలివరీలుగా సాగుతోంది. అంతే కాదు చిల్డ్రన్ సెంటర్ గా చేసుకుని గుప్పిస్తున్న అడ్వర్టైజ్ మెంట్లు కూడా తక్కువేం లేవు. దీంతో ఆన్ లైన్ కూడా అదరహో అంటోంది. 
పిల్లలు వారి వస్తువుల విషయంలో వచ్చే ప్రకటనలు కూడా అన్నీ ఇన్ని కావు. వారి వారి ప్రొడక్టులను అమ్మడంలో భాగంగా  గమ్మత్ గమ్మత్ గా ప్రకటనలు గుప్పిస్తూ పిల్లలతో పాటు చూపరులను సైతం ఆకర్షిస్తున్నారు.
పిల్లలను సంతోషపెట్టడానికి తల్లిదండ్రులు ఏమైనా చేస్తారన్న గట్టి నమ్మకంతో కంపెనీలు కూడా ప్రొడక్టుల మీద ప్రాడక్టులను తయారు చేస్తున్నాయి. "మా వాడు ఇది కావాలన్నాడంటే  అప్పు చేసైనా ఆ వస్తువు కొనాల్సిందే" అన్న మాట వుండనే వుంది. దీంతో కంపెనీలు రెట్టింపు వుత్సాహంతో రెచ్చిపోతున్నాయి. "డాడీ వింటాడు మమ్మీ మాట.. ఆ ఇద్దరు కలిపి వినాలి ఆ ఇంటి బుజ్జాయి" మాట అనుకోక తప్పదు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు కాదు. అదొక ఆర్డర్. అంతకన్నా మించినది కూడా.   కంపెనీలు కూడా "పిల్లలూ దేవుడూ చల్లని వారే" అని పాట పాడుకుంటా తమ వ్యాపారం మూడు పువ్వులు- ఆరు కాయలు చేసుకుంటున్నాయి.
      మాములుగా చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీములు హెల్త్ డ్రింక్స్  పిల్లలకు చెందిన ప్రొడక్టులు. వీటి విషయంలో గుప్పించే ప్రకటనల్లో పిల్లలు కనిపించడం ఒక పద్ధతి. కానీ ఇది మరింత విస్తరించింది. కార్లు, టివి కమర్షియల్ యాడ్స్ నిండా చిన్నపిల్లలే కనిపిస్తున్నారు.
తమకు సంబంధం లేని వస్తువుల ప్రకటనల్లోనూ పిల్లలు ప్రత్యక్షమవుతున్నారు. లాభాల కోసం పిల్లల మైండ్ సెట్ ను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.  ప్రతి అడ్వర్టైజ్ మెంట్లో పిల్లలు కనిపించేలా చూసుకుంటున్నారు. కారణం ఎంతటి వారైనా వారి బుల్లి బుజ్జి అమాయక ముఖం చూస్తుండి పోవల్సిందే అని కంపెనీలు పసిగట్టడం వల్ల. ఈ కారంణ చేత  పెన్నూ- పెన్సిల్ నుంచి వాషింగ్ పౌడర్ ల వరకూ అన్నింటా మన బుజ్జాయిలే దర్శనమిస్తున్నారు.
యాడ్స్ కూడా పిల్లలకు నచ్చినట్టే డిజైన్ చేసేందుకు  సిద్దపడుతున్నాయి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు.   అందుకే కంపెనీలు పిల్లలా మజాకా! అంటున్నాయి.
ఇక పిల్లలకు చెందిన బేబీ కేర్ సెంటర్లదొక వ్యాపారం. బుజ్జాయిలను బేస్ చేసుకుని ప్లే స్కూళ్లది మరొక వ్యాపారం. ఇలా ఎటు చూసినా పిల్లల చుట్టూ వ్యాపారం ఓ పెద్ద వ్యవహారంగా మారిపోయింది. వేలు లక్షల రూపాయల టర్నోవర్లు సాధిస్తున్నారు.
మమ్మీ డాడీ ఇద్దరూ విధిగా ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో బేబీ కేర్ సెంటర్ లనేవి ఏర్పడ్డ విషయం ఇప్పుడు క్వైట్ కామనైపోయింది. దీని చుట్టూ పెద్ద మార్కెట్టే అల్లుకుని వుంది.  పిల్లల తల్లిదండ్రులు, ఈ బేబీ కేర్ సెంటర్లకు నెలకు కొన్ని వేల రూపాయలను చెల్లించాల్సి వుంటుంది. దీంతో ఇది కూడా ఒక బిజినెస్ డెవలప్ అయ్యింది.
ఇక ప్లే స్కూల్ బిజినెస్ కూడా ఇటీవల బాగా వూపందుకుంది. ప్రతి స్కూల్లో ప్లే- నర్సరీ విభాగాలు తప్పక ఏర్పాటు చేస్తున్నారు. వేలల్లో ఫీజులను తీసుకుంటున్నారు.
             ఇవన్నీ దాదాపు వారి వారి ఉద్యోగ- వ్యాపార లాభాలను ఆశించి చేస్తున్నవని గుర్తించాల్సి వుంది. ఫలానా షాంపూ రుద్ది ఫలానా సోపుతో స్నానం చేయిస్తే కానీ పిల్లలకు సరిగా వుండదన్న అపోహలను కట్టి పెట్టాలి. ఇవేవీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు పెరిగి పెద్ద వారై ఆరోగ్యవంతులుగా జీవించి వున్నారని గమనించాలి. అవసరం వున్నా లేకున్నా ఆయా వస్తువులను వాడేయడం మంచిది కాదు. డబ్బు వుంది కదాని ఏది పడితే అది కొనేయడం తగదు. తాము పెద్ద బిజీగా లేకున్నా బేబీ కేర్ సెంటర్లలో చేర్పించడం వగైరా తప్పు. ఇవన్నీ తల్లిదండ్రులు గమనించాల్సి వుంది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681




No comments:

Post a Comment

Address for Communication

Address card