Friday, April 28, 2017

జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం



జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం


                       అసలు మానవదేహమే అశాశ్వతము గదా! మళ్ళీ ఈ అశాశ్వత దేహానికి అంతకన్నా
అశాశ్వతమైన ఈ జుట్టెందుకు? ఈ బట్టతల ఒక్క మానవ మగాళ్ళకేనా? దేవుడు మాగాళ్ళకుండదా? ఏమో! దేవుళ్ళకి మాత్రం బట్టతల్లేదని ఎలా తెలుస్తుంది? వాళ్ళెప్పుడైనా కిరీటాలు తీస్తేగదా!
సరే! మళ్ళీ విషయానికొస్తాను.
                    తలపై కత్తిరించు ప్రదేశము తక్కువ కావున కత్తెరకి పని తక్కువ. కాబట్టి డబ్బులు కూడా తక్కువేమో అనుకున్నాను, కానీ కాదుట! నెత్తిమీద జుట్టుతో నిమిత్తం లేకుండా క్షవరానికింత అని స్టాండర్డ్ రేటు వుంటుంది. వాస్తవంగా జుట్టు ఎంత తక్కువుంటే, సొమ్ములు అంత ఎక్కువ వసూలు చెయ్యడం న్యాయమని క్షురకుని అభిప్రాయం! ఎందుకంటే - వున్న కొద్ది వెంట్రుకల్నీ అత్యంత ఏకాగ్రతతో, నిపుణతతో సర్దుబాటు చెయ్యాలి కదా!

                    
నాకు క్షవరం చేయించుకోవటం భలే ఇష్టం! ఒక చేతిలోని దువ్వెనతో దువ్వుతూ, రెండోచేతిలోని కత్తెరని
లయబద్దంగా ఆడిస్తూ, కొంచెం కొంచెం జుట్టు కత్తిరిస్తూ - నాకు ప్రతి క్షురకునిలోనూ ఒక అమరశిల్పి
జక్కన కనిపిస్తాడు, ప్రతి కత్తెర శబ్దంలోనూ ఒక ఇళయరాజా వినిపిస్తాడు.

క్షురక వృత్తి ప్రత్యేకమైనది. ఎంతటి మారాజునయినా తలదింపే శక్తి ఈ వృత్తికుంది. పైగా వారిచేతిలో కత్తెరా,కత్తీ ఉంటాయి. అందువల్ల అందరూ భయభక్తులతో తల దించుకోవాలి. 'ఎవరికీ తల వంచకు' అంటూ ఘంటసాల స్టోన్లో గర్జించిన ఎన్టీవోడిక్కూడా క్షురకుని ముందు తలవొంపులు తప్పవు గదా!

'తల'కి మాసిన మానవాధములకు తైలసంస్కారాన్ని ప్రసాదించే ఈ వృత్తి ఎంతటి పవిత్రమైనది! క్షవరము అనగా జుట్టు కత్తిరించుట. పైకమునకు జుట్టు కత్తిరించుట క్షౌరవృత్తి. కానీ - జుట్టు కత్తిరించకనే
క్షవరము చేయు వృత్తులు అనేకం.

'జుట్టు కత్తిరించకుండా క్షవరమా! కొన్ని ఉదాహరణలిమ్ము.'
           
డాక్టర్లు లేని రోగములకు ఇన్వస్టిగేషన్లు, ప్రొసీజర్ల పేరున క్షౌరము చేయుదురు. కొందరు అత్యాశపరులైన
డాక్టరుబాబులైతే ఏకంగా గుండే గీసేస్తారు. ఆపై ఆ గుండే గీయకపోతే నువ్వు చచ్చేవాడివని దబాయిస్తారు.
క్షమించాలి! కొందరు –అంతే- అందరూ కాదు                
                                    రాజకీయ నాయకులు 'ప్రజాసేవ' అనే క్షవరం చేస్తారు. ఈ క్షురకర్మని నిర్వర్తించుటలో - 'స్కీములు, స్కాములు' అంటూ ఒక్కొక్కరిది ఒక్కో పధ్ధతి. గవర్నమెంటు ఉద్యోగులు 'అమ్యామ్య' పేరుతో క్షవరం చేస్తారు. వీరి క్షౌరశాల తిరుమలలోని కళ్యాణకట్ట కన్నా పెద్దదిగా యుండునని అభిజ్ఞువర్గాల భోగట్టా. వీరి లీలలు అనంతం. ఈ క్షురకాగ్రేశర చక్రవర్తుల చరిత్ర రాసుకొంటూ పోతే మన సమయం క్షవరం అవుతుంది!
          
             మిత్రులారా, ఈ ప్రపంచమే ఓ పెద్ద క్షౌరశాల. అందు మనమందరమూ క్షురకులమే! ఇచ్చట నిరంతరముగా, అత్యంత లాఘవముగా 365 రోజులూ క్షౌరశాలలు నిర్వహించబడును. క్షురకర్మలు చేయబడును. ఇది కలియుగ ధర్మము! క్షవరం చెయ్యడం మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ తరవాత అలవాటైపోతుంది. 'సాధనమున సమకూరు ధరలోన' అన్నారు పెద్దలు. అయినా - 'క్షవరం చేయుటకు నీవెవ్వరు? చేయుంచుకొనుటకు వాడెవ్వడు? అంతా నేనే!' అని గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు (రిఫరెన్స్ అడగొద్దు)!

                 ప్రపంచం విశాలమైందే కాదు, మోసాలపుట్ట కూడా! ప్రతిక్షణం ఒకళ్ళనొకళ్ళని క్షవరం చేసుకుంటూ జీవించడం మానవ నైజం. ఎటువంటి అన్యాయం చెయ్యకుండా ఫిక్సెడ్ ధరలకి క్షవరం చేస్తున్న క్షురకులకి అభినందనలు. మీరే లేకుంటే జుట్టు పెరిగిపొయ్యి దురదలు పుట్టి గోక్కోలేక చాలామంది చచ్చేవాళ్ళు. థాంక్స్ వన్సెగైన్!   
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card