Thursday, May 18, 2017

లైకులొస్తే.. అప్పిస్తారు



లైకులొస్తే.. అప్పిస్తారు
                                   సాధారణంగా సామాజిక వేదికల్లో ఫొటోలు పంచుకుంటాం.. మిత్రుల పోస్టులకు లైకులు కొడుతుంటాం. దీనికి భిన్నంగా ఎవరైనా తమ అవసరం గురించి తెలియజేస్తూ.. లైకులు కొట్టమంటే.. అలా వచ్చిన లైకులను బట్టి, అప్పు దొరికితే.. ఇలాంటి వినూత్న ఆలోచనతోనే టాటా క్యాపిటల్‌ సలామ్‌ లోన్స్‌ పేరుతో రుణాలను మంజూరు చేస్తోంది.
                                   రకరకాల కారణాలతో వ్యక్తిగత రుణాలు దొరకని వారెందరో. ఇలాంటి వారికి రుణాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా టాటా క్యాపిటల్‌ ‘సలామ్‌ లోన్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వార్షికాదాయం రూ.3లక్షలకు మించని వారు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం కావాలనుకునే వారు తమకెందుకు అప్పు అవసరం ఉందో తెలియజేస్తూ ఒక చిన్న వివరణను సమర్పించాలి. వెంటనే దీనిని www.doright.in వెబ్‌సైటులో 3-4వారాలపాటు కనిపించేలా చూస్తారు. దీంతోపాటు టాటా క్యాపిటల్‌ ఫేస్‌బుక్‌ పేజీ, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేస్తారు. వీటిల్లో వచ్చిన లైకులు/సలామ్‌ల ఆధారంగా టాటా క్యాపిటల్‌ రుణాన్ని మంజూరు చేస్తుంది. అయితే, రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తుల పూర్తి సమాచారం సేకరించి, వ్యక్తిగత చర్చల అనంతరమే అప్పు మంజూరు చేస్తుంది.
                                  కనీసం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకూ రుణం ఇస్తారు. దరఖాస్తుదారుడి కనీస వయసు 21ఏళ్లు ఉండాలి. ఉద్యోగం చేసే వారికి గరిష్ఠ వయసు 60 ఏళ్లు. స్వయంఉపాధి పొందేవారికి 65ఏళ్లు. తీసుకున్న రుణాన్ని 12 నుంచి 36నెలల్లో తిరిగి చెల్లించవచ్చు. సాధారణ వ్యక్తిగత రుణాలకంటే.. 2-3% తక్కువకే ఇస్తారు. హామీలు, సిబిల్‌ స్కోరులాంటివేవీ అక్కర్లేదు. వ్యక్తిగత, చిరునామా, ఆదాయ ధ్రువీకరణలు, ఆరు నెలల బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే సరిపోతుంది.
                                 రుణం కావాలనుకునే వారు సొంతంగానూ లేదా.. వారి తరఫున ఇతరులెవరైనా సరే వెబ్‌సైటులో వారి అవసరాన్ని పేర్కొంటూ దరఖాస్తును దాఖలు చేయవచ్చు. సొంతంగా దాఖలు చేయలేని వారు SALAAM అని 56161561కు సంక్షిప్త సందేశం పంపించినా సరిపోతుంది.------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card