Friday, May 12, 2017

భారతావని జబ్బు పడ్డది-(పద్మజా షా గారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం రెండవ భాగం)




భారతావని జబ్బు పడ్డది-(పద్మజా షా గారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం రెండవ భాగం)


ప్రధానంగా స్వజాతి వివాహాల వలనా, పురుషులు స్త్రీలు మధ్య వయసు తేడా విషయమై ఖచ్చితమైన నిబంధనలు ఉండటం వలనా భారత దేశంలోని వివాహ సాంప్రదాయాలలో ప్రేమ ఎన్నడూ ఒక అంశంగా లేదు. వివాహంలో లైంగిక సంపర్కం అంటే అది కేవలం పునరుత్పత్తి విధిని నిర్వర్తించటం మాత్రమే; దానిని ప్రేమతో ముడి పెట్టాలన్న సందిగ్ధతకు అక్కడ తావు లేదు. కొన్ని జంటలు ఈ పరిస్ధితిని అధిగమించి వివాహం అనంతరం ప్రేమను సంపాదించడంలో విజయవంతం అవుతారు, కానీ నిజంగా అయితే అక్కడ ప్రేమను ఆశించలేము. 
            కొత్త పెళ్లి కూతుళ్లు అనేక సార్లు తమ జీవిత భాగస్వాములు తమ పట్ల ఉదాసీనంగా ఉండటం గురించి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తుంటారు. త్వరగా ఒక బిడ్డను కనెయ్యమని తల్లులు వారికి తరచుగా సలహా ఇస్తుంటారు. బిడ్డను కని పడేయటం ద్వారా ఆ కుటుంబంలో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని వారి అంచనా. అంతటితో సరి! తన బిడ్డ ద్వారా (అత్తగారి) కుటుంబంలో నివాసానికి చట్టబద్ధ హక్కును సాధించడం అన్నమాట! ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని నమ్మాలి. కానీ అనేక కేసుల్లో బిడ్డ పుట్టినా పరిస్ధితిలో ఏ మార్పు ఉండదు. ఆ తర్వాత మహిళకు క్షణం తీరిక లేకుండా పోతుంది. తన లోపల నిండా నిండి ఉన్న అనంతమైన ఖాళీతనం గురించి కాస్తంత కూడా ఆలోచించలేని పని ఒత్తిడి ఆమెను చుట్టి వేస్తుంది.
                         కులము, సమాజం, మతం లాంటివి ముఖ్యమైన చోట కూడా ఈ తరహా సంబంధాలే వివాహాలకు పునాదిగా ఉంటాయి. తాను ఏ సమూహంలో అయితే మసులుతుందో ఆ సమూహం నిర్దేశించిన విధంగా పెళ్లి కూతురు కుటుంబంలో, సమాజంలో తన స్ధానాన్ని అర్ధం చేసుకుని ఆ విధంగా నడచుకుని తీరాలి. కొత్తగా ఎటువంటి భావజాలాన్ని వెంటబెట్టుకుని రావలసిన అవసరం లేదు. అది వృధా శ్రమ మాత్రమే. మొదటి రోజునుండే కుటుంబంలో ఇమిడిపోయే విధంగా ఆమె సంసార పక్షంగా, క్రమ శిక్షణతో పెంచబడినదిగాఉండాలి. ప్రేమ ఎన్నడైనా ఆమె ముఖంలోకి తేరిపార జూస్తే అలాంటి దాన్ని గుర్తించడానికి ససేమిరా వీలు లేదు.
                            యువ పెళ్లి కూతురు వంట వండడంలో నిష్ణాతులై ఉండటానికి ఎంచక్కా అనుమతి ఉంటుంది. భర్త కోసం కుటుంబం కోసం ఆమె వంట కళలో పొద్దస్తమానం మునిగి తేలుతుంటే దానిని చూసి తరించడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. ఆమెకు గొప్ప గృహిణి అన్న గుర్తింపును గ్యారంటీ చేస్తుంది. పెళ్లి కూతురు నిరంతరాయంగా కుటుంబంలో సమగ్ర భాగమై కలిసిపోతూ ఉండాలి. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో స్త్రీ పురుషుల మధ్య వయసు తేడాను గట్టిగా నిర్దేశించడానికి ప్రాధమిక కారణం ఏమిటంటే ముదిమి వయసులో పురుషుడికి సేవలు చేసేందుకు స్త్రీ తగినంత పుష్టిగా ఉండాలని ఆశించడమే. వివాహం అన్నది ప్రాధమికంగా ఇల్లు చూసుకోవడానికి చేయబడ్డ వెట్టి చాకిరీ ఏర్పాటు మాత్రమే. యువకులు తమకు నచ్చిన విధంగా భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో ఎదుర్కునే ఆదుర్దాకు పునాది కూడా ఇదే. స్వతంత్రంగా వ్యవహరించే మహిళ తనకు అప్పగించబడిన పాత్రను పోషిస్తుందా లేదా అన్నదే వారి ఆదుర్దా. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా విద్యావంతులైన పెళ్లి కూతుళ్లు కొందరు తమ కొత్త కుటుంబాల అంచనాలను నీరు గార్చడం ఆశా సౌధాలను నిలువునా కూల్చివేయడం పూర్తిగా వేరే సంగతి.
                   పునరుత్పత్తి, పోషణ కార్యక్రమంలోనూ, వంశవృక్షాన్ని నిరంతరాయంగా పరిరక్షించడంలోనూ భార్యలు పూర్తిగా మునిగిపోయి ఉంటే పురుషులకు ఎటువంటి సామాజిక అపప్రథ ఎదుర్కొన వలసిన అవసరం లేకుండానే తమ ఆనందాలను ఇంకెక్కడో వెతుక్కోవటానికి స్వేచ్ఛ లభించడం మనం చూస్తున్నాం. దేవదాసీలు, జోగినులు లాంటి వ్యవస్థలు దేవతలు, దేవుళ్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో మత పెద్దల పూర్తి ఆమోదంతో  ఎవరికి చెందని స్త్రీలను కళాత్మకంగా దోచుకునే దుర్మార్గాలు. అలాగే ప్రతి మహిళని వారి కుటుంబాలకు ఆవల పీక్కుని తినే క్రూర సాహసకృత్యాలు పురుషులకు సమాజంలో అందుబాటులో ఉన్నాయి. వారి వేట విజయవంతం అయితే సాధారణంగా అది మళ్ళీ మహిళ తప్పే అవుతుంది.
సాంప్రదాయక ఆలోచనాపరులకు ఈ ప్రేమ అనే అంశం చాలా ప్రమాదకరమైన భావోద్వేగం. అది మరొక జీవిలోని సుఖంతో సంబంధం కలిగి ఉంటుంది; వారికి చిరపరిచితమైన తమకు ఆమోదనీయమైన సామాజిక సంబంధాలకు ఆవల మాత్రమే అది వృద్ధి పొందుతుంది. కనుక సంతోషాతిశయంతో ప్రేమలో జీవించే జంటను చూసినప్పుడల్లా వారి సాంప్రదాయక మెదడు కోపంతో రెచ్చిపోతుంది. ఎందుకంటే తమ నిషిద్ధ ప్రపంచంలో ఎప్పుడోకప్పుడు వారు అనుభవించిన ఏ కాస్త ప్రేమ అయినా జారత్వంతో ముడిపడి ఉంటుంది గనుక. మీరు పెళ్లాడిన మంచి క్రమశిక్షణతో పెరిగినఅమ్మాయి ప్రేమకు సంబంధించిన ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండకూడదు. ఒక మహిళలోని ఆ జ్ఞానం పురుషుడి ఆధిపత్యానికి సవాలుగా పరిణమించే స్వతంత్రతా చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది మరి!
  (.......ఇంకా ఒక భాగం వుంది.....)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681













No comments:

Post a Comment

Address for Communication

Address card