భౌతికంగా స్త్రీ, పురుషులు సమానులు కారు. ఈ అసమానతను కాల గమనంలో సమాజం వ్యవస్థీకృతం చేసింది. అయితే వ్యవసాయం చేయడం మొదలైన తర్వాతే పురుషాధిక్య భావన పెరిగిందనే ఆధారాలు ఉన్నాయి. స్త్రీ కన్నా పురుషుడు సహజంగానే మెరుగైనవాడని, ఆమె పాత్ర పిల్లలకు జన్మనివ్వడం, పురుషుడికి సేవ చేయడం వరకేనని ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ భావించాడు. పూర్వం చర్చి కూడా ఈ అసమానతను వ్యవస్థీకృతం చేసింది. భారత్‌లో మనువు ఇదే చేశాడు.
మహిళను కామ వస్తువుగానో, భోగ వస్తువుగానో చూడటం మాని, శృంగారభరితమైన ప్రేమతో ఆరాధించే భావన 12వ శతాబ్దంలో బాగా వ్యాప్తిలోకి
వచ్చింది. ఫలితంగా సామాజిక కట్టుబాట్లు తెగిపోయి, ఆమెకు కొంత స్వేచ్ఛ, సమానత్వం లభించాయి. ఈ ప్రేమ వైయక్తికమైనది. ఈ ప్రేమ ఉన్న వారు తాము ప్రేమించే వారిని
సమోన్నతులుగా చూస్తారు. అప్పటివరకు మహిళను
వస్తువులా పరిగణించిన పురుషుడు ఈ భావన మూలంగా మనిషిగా చూడటం
మొదలైంది. ఈ భావన పాశ్చాత్య దేశాల్లో పుట్టిందనుకుంటే పొరబడినట్లే. దాదాపు
ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా మూడు చోట్ల ఇది వికసించినట్లు
తెలుస్తోంది. మూడు అసాధారణ రచనల్లో ఇది వ్యక్తమైంది. అవేంటంటే- ఐరోపాలో
జోసెఫ్ బిడీయర్ వెలువరించిన ‘ట్రిస్టన్ అండ్ ఐసోల్డే’, ఇస్లామిక్ పర్షియాలో నిజామీ గంజావీ
రాసిన ‘లైలా మజ్ను’, రాధాకృష్ణుల పవిత్ర ప్రణయంపై భారత్‌లో
జయదేవుడు రాసిన ‘గీతగోవిందం’. ఈ ఉన్నతమైన ప్రేమ భావనకు ముందు చాలా
వరకు కేవలం లైంగికవాంఛతో కూడిన ప్రేమే ఉండేది. అందులో స్త్రీ
కేవలం ఒక వస్తువు. స్త్రీని శృంగారభరితమైన ప్రేమతో ఆరాధించే భావన భారత్, పర్షియాలలో కంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా పరిణతి చెందుతూ వచ్చింది. 18వ శతాబ్దం నాటికి వివేచన భావనగా
రూపాంతరం చెందింది. ఆ సమయంలోనే ఆధునిక వివాహ వ్యవస్థ ఏర్పడింది. అప్పటివరకు స్త్రీ, పురుషుల మధ్య బంధం కుటుంబాన్ని వృద్ధి
చేసుకునే ఆర్థిక ఏర్పాటుగా ఉండేది. దాని స్థానంలో ప్రేమ
ప్రాతిపదికగా నవీన వివాహ వ్యవస్థ వచ్చింది. 19వ శతాబ్దంలో ఓటుహక్కు కోసం పోరాటాలతో, 20వ శతాబ్దంలో మహిళా
ఉద్యమాలతో పురుషాధిక్యాన్ని మగువ సవాలు చేసింది. ఇది పాశ్చాత్య సమాజంలో పెను
మార్పులను తెచ్చింది. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా విడాకులు పొందే వెసులుబాటు, గర్భవిచ్ఛిత్తి హక్కు, ఆస్తి హక్కు, సముచిత వేతనాలు లాంటివి సాధ్యమయ్యాయి. ఇవన్నీ నేడు విశ్వవ్యాప్తమవుతున్నాయి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment