Friday, May 26, 2017

ఇంట్లోనే అసలు సమస్య



ఇంట్లోనే అసలు సమస్య ........................................
ముస్లింలలో విడాకులు తీసుకొనే దంపతుల శాతం తక్కువ. ఇది హిందువుల్లో కంటే ఎక్కువగా వీరిలో ఉండకపోవచ్చు. ముమ్మారు తలాక్‌ఘటనలూ మరీ ఎక్కువగా లేవనే భావిస్తున్నా. దేశంలో మహిళల గౌరవానికి అసలు సమస్య ఇంట్లోనే ఎదురవుతోంది. గృహ హింస రూపంలో! భారత్‌లో మతాలకతీతంగా మూడింట రెండొంతుల మంది మహిళలు దీనిని ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. మహిళల గౌరవం పట్ల మనకు చిత్తశుద్ధి ఉంటే అన్నింటి కంటే ముందు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. మహిళలను గౌరవించడాన్ని బాల్యం నుంచే అలవర్చాలి. ఈ సందర్భంలో, చరిత్ర గతిలో మహిళ స్థానం ఎలా మారుతూ వచ్చిందో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఒకప్పుడు పురుషుడి దృష్టిలో కామ వస్తువుగా ఉన్న మహిళ క్రమక్రమంగా స్వేచ్ఛా జీవిగా, పురుషుడితో సమానురాలిగా అవతరించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ముస్లింలకే కాదు అన్ని మతాల వారికీ ఉపయోగపడుతుంది. పేరుకు ఉదారమైన పర్సనల్‌ లాఉన్నా ఆచరణలో అంత ఉదారత కనిపించని మతాలకూ ఇది వర్తిస్తుంది.
విఫలం కానివ్వరాదు
భారత్‌లో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లే ఎక్కువ. అయినప్పటికీ పెళ్లి విషయంలో ఆధునిక ప్రేమ వివాహాల్లో ఉండే కొన్ని సానుకూలాంశాలను క్రమంగా స్వీకరిస్తున్నారు. చిత్రాలు, ఇతర అంశాల ప్రభావంతో మధ్యతరగతి మగవారిలో ఆధిపత్య ధోరణులు తగ్గుతున్నాయి. మహిళలు కూడా ఇంతకుముందున్నంతగా లొంగి ఉండటం లేదు. ఈ మార్పు మున్ముందు మరింతగా విస్తృతమవనుంది. అదే సమయంలో, వివాహ వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ విఫలం కాకుండా జాగ్రత్త పడాలి.
ముమ్మారు తలాక్‌కు తప్పకుండా ముగింపు పలకాలి. అయితే దేశంలో స్త్రీ సమానత్వం కోసం అంతకుమించి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆధునికత ఆదర్శాలను భారతీయులు తమలో భాగం చేసుకోవాల్సి ఉంది. పాశ్చాత్య పోకడలను అనుకరించడం కాకుండా, స్వేచ్ఛ, సమానత్వ మార్గంలో సాగాల్సి ఉంది.
               తలాక్‌ లాంటి సామాజిక సమస్యలను రాజకీయ లేదా మతపరమైన వ్యాఖ్యానాలతో, మీడియా జరిపే విచారణతో పరిష్కరించలేం. వివాహ బంధం నుంచి శాశ్వతంగా విడిపోయేందుకు తలాక్‌ను నిజాయతీగా ఉపయోగించే పురుషులతో ఈ విధానానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీనిని విచక్షణరహితంగా ప్రయోగించేవారితోనే సమస్య. తలాక్‌ను దుర్వినియోగం చేసే వారికి ముస్లిం పర్సనల్‌ లా బోర్డు చెప్పినట్లు సామాజిక బహిష్కరణ విధించినా సమస్య తొలగిపోదు. ఈ బహిష్కరణ ఎంతమేర ప్రభావం చూపిస్తుంది? దీన్ని అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? భర్త తలాక్‌ చెప్పడంతో అతడి నుంచి విడిపోవాల్సి వచ్చిన పేద మహిళకు దీనితో కలిగే ప్రయోజనమేంటి? చట్ట సవరణ వల్ల కూడా ఈ సమస్య తొలగిపోదు. మహిళకు గౌరవం దక్కేలా, సమానత్వం సాకారమయ్యేలా భారతీయుల దృక్పథంలో విప్లవాత్మకమైన మార్పు రావడమే సిసలైన పరిష్కారం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card