Sunday, January 29, 2017

కాలం మారిపోయింది గురూ!..అదే మాకాలంలో అయితేనా?..ఇలా ఉండేదా?



                      హాలీవుడ్ దర్శకుడొకరు ఒక పరిస్ధితిని ఊహించి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్అని సినిమా తీశాడు (నిన్న రాత్రే టీవీ లో చూసాను). అందులో హీరో ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లు చూపిస్తాడు. ఆయన అది ఊహించి తీసిన సినిమా. అది చూసి ఏ రయినా అదెలాగ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.
           మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! 1970 ల ప్రారంభ కాలంలో పురుషులు ధరించిన ఫ్యాంట్ బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. ఫ్యాంట్ విడవాలంటే ఎవరైనా కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగవలసి ఉండేది. కొన్నాళ్ళకి అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. 70 ల దశాబ్దం రెండో అర్ధభాగానికి వచ్చేసరికి ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారి అంతకుముందరి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది. పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది పార్లల్ బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు. ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అది comfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.
మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది.
ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది.
         హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.
ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషితాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన వర్గం ఐక్యంగా లేదు.. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.
చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.
అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card