Friday, January 27, 2017

చావు తప్పనిసరైనప్పుడు



ఇహముందు రాబోయేదంతా మరింత గడ్డుకాలమే అని చుట్టూగాలులన్నీ వెర్రిగా ఏడుస్తున్నప్పుడు క్లాడ్ మెకై (Festus Claudius “ClaudeMcKay ) రాసిన   చిన్న పవర్ఫుల్ కవిత “ If we must die” అనుసృజన(క్రింద రాసినది అయన ఆంగ్ల కవితకి నా స్వేచ్చా తెలుగు అనువాదం )-మనకేమన్నా కొద్దిపాటి ధైర్యం నేర్పుతుందేమో చూద్దాం .


చావు తప్పనిసరైనప్పుడు’ 
మనందరికీ చావు తప్పనిసరైనప్పుడు
శపించబడిన మనలాంటివారి చుట్టూచేరి
గేలిచేస్తున్న ఆకలి కుక్కల నడుమ
నికృష్టకరమయిన స్థలాలలో వేటాడబడిన పందుల్లా కాకుండా
చివరికి మనల్ని అంగీకరించని క్రూరులు సైతం
ఈ మరణాలని గౌరవించక తప్పదనట్లు
మనందరికీ చావు తప్పని సరైనప్పుడు
మన విలువైన రక్తం నేలపాలు కాకుండా ఘనంగా చావునాహ్వానిద్దాం !
 ఓ సంబంధీకులార !
మనది పరిమిత సంఖ్యే అయినా
వాళ్ళ వేల దెబ్బల ముందు ఒక్క మరణం విలువేమిటో చూపి
మన ధైర్యం చాటడానికి మన సమిష్టి శత్రువుని మనందరం కలవాలి
(వంద గొడ్లని తిన్న రాబందులు ఒక్క తుఫానుకి చచ్చినట్టు ) 
అయినా ,
మన సమాధుల ముందు ఇహ మనకేమి మిగిలుందని
గోడలకేసి నొక్కి పెట్టె హంతక తోడేళ్ళ గుంపులపై తిరిగి పోరాడటం మినహా !
                                                                                      _ క్లాడ్ మెకై  Claude McKay

                 నగ్న నిజాలని హత్తుకొనే ధైర్యం లేకపోయినా కనీసం రెండు చెవుల మధ్య మెదడు తెరచి పెట్టుకొని వినే క్షమత అయినా మిగిలిన వాళ్లందరికీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న.
                బ్యాలెట్ల రక్తం నిరంతర బలవంతపు సామాజిక సంఘీభావాలు  , నియంతృత జాతీయవాదాలుగా మారిపోయి నిరపరాధులను అమాయకులను హతమార్చడం ,ఇన్నోసెంట్ పీడిత మేధావుల అణచివేతకు కేరాఫ్ అడ్రెస్గా ప్రభలుతూ,  నయా మూఢభారతం అసలు వినిపించుకొనే పరిస్థితిలో ఉందా అని  ?
             ఇక్కడ ప్రశ్నలు మూగబోవట్లేదా ? సమాధానాలు నిశబ్దంగా సజీవ సమాధి కాబాడటం లేదా ? ఇహ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు అసలిక్కడ  ?
            బహుశ అధికార నియంతృత్వ మీడియాలో కాకపోయినా కనీసం సోషల్ మీడియాలో సైతం భావప్రకటనా స్వేచ్చ కరువైపోయాక, పౌరుషాలన్నీ ఎటిఎం క్యూల ముందు, బ్యాంకు కౌంటర్ల ముందు , డీలా పడి స్వీయ సంపాదనలలో పావలాకి  అర్ధకి యాచకులైనప్పుడు -భారతదేశం శాంతికాముకుల దేశం కాదిది చేతగాని చవటాయిల రాజ్యమని నిసిగ్గుగా ప్రపంచ దేశాల ముందు ప్రకటించుకుంటున్నప్పుడు , దేవుని పేరిట ,రాజుల పేరిట, మంత్రుల పేరిట ,నాయకుల పేరిట, కధానాయకుల పేరిట  నియంత్రించబడి, కులం మతం, ప్రాంతం గా విభజించి జయించడానికే పరిమితమయిన ‘సాంస్కృతిక రక్షకుల’  మెదడులు, చెవులు మాత్రమే కాదు ఇక్కడ ముక్కలయిన హృదయాలు సైతం మూతపడిపోయాయి అనుకుంటా కదా !

ఇహముందు రాబోయేదంతా మరింత గడ్డుకాలమే అని చుట్టూగాలులన్నీ వెర్రిగా ఏడుస్తున్నప్పుడు క్లాడ్ మెకై రాసిన   పైన చెప్పిన చిన్న పవర్ఫుల్ కవిత “ If we must die” మనకేమన్నా కొద్దిపాటి ధైర్యం నేర్పుతుందేమో చూద్దాం. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681




No comments:

Post a Comment

Address for Communication

Address card