Tuesday, January 24, 2017

జనం సంతోషంగా, శాంతియుతంగా జీవిస్తున్న చోటు ఈ భూమి పైన ఏదన్నా ఉందా


జనం సంతోషంగా, శాంతియుతంగా జీవిస్తున్న చోటు ఈ భూమి పైన ఏదన్నా ఉందా

సూటిగా చెప్పాలంటే లేదు.నేను చెప్పేది సరిఅయినది అయనా కాకపోయినా నాకు తెలిసినంతవరకు వివరిస్తాను
శాంతి అన్నవి సాపేక్షిక అనుభవాలు మరియు భావనలు. ఎన్ని ఉన్నా సుఖ శాంతులు లేని కుటుంబాలు/ వ్యక్తులు/ సమూహాలు ఉన్నాయి. సాపేక్షికంగా చాలా మితంగానే వినియోగ సరుకులు అందుబాటులో ఉన్నా కూడా సంతోషంతో బతుకు ప్రయాణాన్ని సాగిస్తున్నవారూ లేకపోలేదు.
“సంతోషంగా, శాంతియుతంగా” అన్న పదబంధాన్ని క్లుప్తంగా “సుఖ, శాంతులు” అని ప్రస్తావిస్తాను.
విశాల దృష్టితో చూస్తే సుఖ, శాంతులు అప్పటి సామాజిక పరిస్ధితులతో బంధించబడి ఉంటాయి. సుఖ, శాంతుల భావనకు ఒక్కో చోట ఒక్కో అర్ధం ఉండడం కూడా తటస్ధితుంది. ఈ రెండింటిని (సుఖ, శాంతులు) స్ధలము మరియు కాలము అన్న రెండు అస్ధిర (variables) అంశాలకు బంధింపబడి ఉన్నాయని అర్ధం చేసుకోవచ్చు.
సామాజిక వ్యవస్ధల నిర్మాణం ఎల్లప్పుడూ ఒకే విధంగా లేదు. ఆదిమ మానవుడు నివసించిన సమాన సమాజాన్ని ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని సోషియాలజీ నిర్వచిస్తుంది. అనంతరం బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్ (భూస్వామ్య) సమాజం, ఆ తర్వాత పెట్టుబడిదారీ సమాజం సోషలిస్టు సమాజం ఏర్పడ్డాయి.
ఈ సమాజ పరిణామక్రమాన్ని ఎందుకు చెబుతున్నానంటే ఆయా సమాజాల్లోని భావాజాలాన్ని ఆ సమాజాల నిర్మాణాలే నియంత్రిస్తాయి. ఒక సమాజంలో ఏ వర్గం ఆధిపత్యంలో ఉంటే ఆ వర్గానికి ఆమోదయోగ్యమైన భావజాలమే పెత్తనం చెలాయిస్తుంది. వ్యవస్ధ లోతుపాతుల్లోకి సాధారణ ప్రజలు వెళ్లరు. కాబట్టి తాము చూస్తున్నదే నిజం అనీ, శాశ్వతం అనీ మెజారిటీ ప్రజలు భావిస్తారు.
ఇంకా వివరంగా చెప్పాలంటే బానిస సమాజంలో బానిస యజమానిగా ఉంటే సుఖ శాంతులతో ఉండొచ్చని బానిసలు భావిస్తారు. భూస్వామ్య సమాజంలో భూములు ఎంత ఎక్కువగా కలిగి ఉంటే అంత సుఖం అని భావిస్తారు. పెట్టుబడిదారీ సమాజంలో ఒక కంపెనీ, ఒక బ్యాంకు, ఒక పరిశ్రమ, ఒక వ్యాపారం… ఇలా ఉన్నట్లయితే సుఖం, శాంతి ఉంటాయని మెజారిటీ భావిస్తారు.
కానీ బానిస యజమానులు, భూస్వాములు, పెట్టుబడిదారులను కదిలిస్తే వారి కష్టాలు వారు చెప్పుకుంటారు. వారంతా కలిసి శుభ్రంగా కాయకష్టం చేసుకునేవాడే నిజంగా సుఖంగా, శాంతిగా బతుకుతారు అని తీర్మానిస్తారు. అలాగని వారి పరిశ్రమలు, భూములు, వ్యాపారాలు అన్నీ పక్కవాడికి/లేనివాడికి ఇచ్చేసి శారీరక శ్రమ చేయొచ్చుగా అంటే వెనక్కి తగ్గుతారు.
కొందరు శారీరక శ్రమ, మేధో శ్రమల్లో సుఖ సంతోషాల తేడాను చూస్తారు. అనగా శారీరక శ్రమ చేయవలసి రావడం కష్ట భూయిష్టమైన జీవనం గానూ, బుర్రతో పని చేసేవారు సుఖ పడుతున్నవారి గానూ చూస్తారు. కానీ తరచి చూస్తే శారీరక శ్రమ చేసేవారు, ఏ దురలవాట్లు లేకపోతే, ఏ రోగమూ లేకుండా జీవించగలరు. కానీ వారికి చేయడానికి తగిన పని దొరకని సమాజాలలో ఉన్నాం గనుక వారికి ఆ సుఖమూ దక్కడం లేదు. కేవలం మేధో శ్రమ మాత్రమే చేస్తున్నవారు ఒళ్ళు పెరిగి, రకరకాల జబ్బులతో బాధపడడం గమనించవచ్చు. దానితో నడవడం, పరుగెత్తడం, వేలు లక్షలు పోసి యంత్రాలు తెచ్చుకుని ఎక్సర్ సైజ్ లు చేయడం, డాక్టర్ల చుట్టూ తిరగడం… ఇవన్నీ వారి కష్టాలు. ఏదన్నా శారీరక కష్టం చేయాల్సిన పరిస్ధితి వస్తే వారికి మించిన ఒంటరి మరొకరు ఉండరు.
ఉన్నవాడికి ఉన్నది పోతుందేమో అనీ, దానిని ఎలా కాపాడుకోవాలా అని బెంగ. లేని వాడికి రేపు ఎలానా అన్నది బెంగ. ఈ ఇద్దరినీ సమానం చేయగలిగితే ఎవరికీ ఏ బెంగా ఉండదని నా అభిప్రాయం. అన్నీ అందరి వినియోగానికీ అందుబాటులో ఉండాలి.
 
ప్రతి ఒక్కరూ శారీరక, మేధో శ్రమలు రెండూ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ శారీరక శ్రమ, మేధో శ్రమ రెండూ చేస్తారు. ఆ విధంగా శారీరక శ్రమ, మేధో శ్రమల మధ్య వైరుధ్యం రద్దయిపోతుంది. అంతిమంగా శక్తి కొద్దీ పని చేసి, అవసరం కొద్దీ ఫలితం అనుభవించే విలువ సమాజంలో నెలకొన్నట్లయితే ధనిక, పేద తారతమ్యాలు అంతం అవుతాయి. కానీ ఈ పరిస్ధితి ఎలా వస్తుంది?
అంతిమంగా మరోసారి చెప్పవలసిన విషయం: సుఖ శాంతులు సాపేక్షికం.ఆర్ధిక అసమానతలు ఏ మేరకు తొలగిపోతే ఆ మేరకు సుఖ శాంతులు సమకూరుతాయి. ఆర్ధిక అసమానతలు సమాజంలో వైరుధ్యాలకు ప్రధాన కారణం. ఆ వైరుధ్యాలు పరిష్కారం కావాలంటే ఆర్ధిక అసమానతలు తొలగిపోయే వ్యవస్ధ ఏర్పడాలి.. కాబట్టి సకల ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లగల శాశ్వత సుస్యందన నందన వనం కోసం ఆస్తులను సమాజపరం చేయగల రోజు రావాలి.. సమాజాల ప్రయాణం ఎల్లప్పుడూ ఆ దిశలోనే సాగుతోంది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card