ఒకటి ప్రజలలో తీవ్రమైన భావోద్వేగాలు రగిలించే
దేశభక్తికి చెందిన అంశం. రెండవది ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే
డబ్బుకూ, దానితో ముడిపడి ఉన్న అవినీతికీ సంబంధించినది.
ఉరి ఉగ్రదాడి తర్వాత కొద్ది రోజులకు
భారత సేనలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో
సర్జికల్ స్ట్రయిక్స్ జరిపాయి. అలా
అని ప్రభుత్వం ప్రకటించింది. సర్జికల్
స్ట్రయిక్స్ వార్త దేశాన్ని ఒక
కుదుపు కుదిపింది. వెంటనే ఇది కొత్త
విషయమేమీ కాదనీ, యూపీఏ ప్రభుత్వ హయాంలో
ఇలాంటి మెరుపు దాడులు మూడుసార్లు
జరిగాయనీ కాంగ్రెస్ ప్రకటించింది.
ఎన్డీఏ ప్రభు త్వంలో రక్షణమంత్రి మనోహర్
పర్రికర్ కాంగ్రెస్ ప్రకటన
అబద్ధమంటూ కొట్టి పారేసారు. ఆ తర్వాత
మూడు రోజులకే అబద్ధం ఆడుతున్నది
పర్రికర్ మాత్రమేననీ కాంగ్రెస్ కాదనీ
అధికారికంగా వెల్లడయింది. విదేశాంగ
కార్యదర్శి జై శంకర్ విదేశీ
వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై
గతంలో కూడా సర్జికల్ స్ట్రయిక్స్
జరిగాయనీ, తేడా అల్లా ఆనాటి ప్రభుత్వాలు ఆ సంగతిని గోప్యంగా
ఉంచితే, ఈ ప్రభుత్వం బయటకు వెల్లడించిందనీ ఆయన కమిటీకి చెప్పారు.
ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడంలో బీజేపీని అడ్డుకోలేకపోవడమే కాక, ఒక నిజాన్ని నిజంగా ప్రచారం చేయడంలో కూడా కాంగ్రెస్ విఫలం కావడం ఇక్కడ విషాదం.
దేశభక్తిపూరిత అంశాలను రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవడంలో నేర్పుపై
బీజేపీ ఎప్పుడో పేటెంట్ హక్కు తీసుకుంది. సర్జికల్ స్ట్రయిక్స్ ప్రకటన దాని కొనసాగింపే. పోనీ,
రాజకీయ ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా మొన్న
సెప్టెంబర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్
‘ఛప్పన్ కా ఛాతి’ ఘనత కాదనీ, అలాంటి దాడులు
మామూలేననీ తేలిపోయింది. పైగా
దాని వల్ల ఫలితం లేదనీ కూడా
తేలిపోయింది. అయినా సరే బీజేపీ ఈ అంశాన్ని
అయిదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారానికి
ఉపయోగిస్తున్నది.
నోట్ల రద్దు నిర్ణయాన్ని
ప్రకటిస్తూ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినపుడు
ప్రధానంగా రెండు లక్ష్యాల గురించి చెప్పారు. నల్లధనాన్ని నిర్వీర్యం చేసి
తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేసేందుకూ,
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో
కుమ్మరిస్తున్న దొంగనోట్లను అరికట్టేందుకూ ఈ చర్య తీసుకున్నట్లు
పేర్కొన్నారు.
నోట్ల రద్దు, దాని చుట్టూ
అల్లుకున్న ఆంక్షల ఫలితంగా దేశం ‘క్యూ’లమయం అయి పోయింది. ఈ శిక్ష చాలామంది ప్రాణాలనే బలితీసుకున్నది. రైతులు, రైతు కూలీలు, కార్మికులు, చేతివృత్తులవారు, చిన్న చితకా
వ్యాపారులు చెప్పరాని కష్టాల
పాలయ్యారు.నోట్ల రద్దును విమర్శిస్తున్న
రాజకీయ పక్షాలన్నీ నల్లధనానికీ, అవినీతికీ కొమ్ము కాస్తున్నాయని ఆరోపించడాన్ని మించిన తెంపరితనం ఏముంటుంది?
భారత దేశంలో రాజకీయ అవినీతి గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. అంతవరకూ బాగానే
ఉంది. అవినీతిమయమై పోయిన రాజకీయ వ్యవస్థ పాపం అంతా ప్రతిపక్షాలదేననీ, అధికారంలో ఉన్న బీజేపీ అందుకు ఆమడ దూరంలో ఉందనీ మోదీ అంటారు. రాజకీయ
గంజాయి వనంలో బీజేపీ ఒక్కటే తులసి మొక్క అని మనల్ని నమ్మమంటారు.
రాజకీయ అవినీతిని
రూపుమాపేందుకు ఇక ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారిస్తానని మోదీ అంటున్నారు. రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి
వస్తాయన్న కేంద్ర సమాచార కమిషన్ తీర్పు నిర్ద్వందంగా వ్యతిరేకించిన
పార్టీలలో బీజేపీ కూడా ఒకటి. విదేశీ బ్యాంకులలో భారతీయులకున్న ఎక్కౌంట్ల
వివరాలను వెల్లడి చేయడానికి నిరాకరిస్తున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ
ప్రభుత్వమే. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల సమాచారం వెల్లడి చేయడానికి సైతం ఎన్డీఏ
ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర
మోదీ మాత్రం రాజకీయ అవినీతిని రూపుమాపే విషయంపై పార్లమెంటు వెలుపల మాత్రం ధారాళంగా
ప్రసంగిస్తారు.
సరే ప్రతి పక్షాల
విమర్శలనూ, మోదీ తెంపరితనాన్ని కాస్సేపు పక్కనపెడితే, నోట్ల రద్దు తర్వాత రెండు నెలలకు పరిస్థితిలో వచ్చిన మార్పులేమిటి? నిజానికి మోదీ ఏ ఫలితం ఆశించి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నకు రకరకాల జవాబులు వినబడుతున్నాయి. రానున్న ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు
ప్రత్యర్థి రాజకీయ పార్టీల దగ్గర నగదు లేకుండా చేయడం ఒకటి. అమెరికా
నాయకత్వంలోని బహుళజాతి కార్పొరేట్లకు భారత మార్కెట్లపై పట్టు చిక్కేందుకు
వీలుగా దేశంలోని అసంఘటిత రంగాన్ని చిన్నాభిన్నం చేయడం మరొకటి.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత
కేంద్రంలోని పెద్దలు అందిపుచ్చుకున్న కొత్త నినాదం నగదు రహిత
చెల్లింపులు. దీనివల్ల కూడా వీసా, మాస్టర్ కార్డ్ వంటి
సంస్థలకే లాభం. ఈ లక్ష్యాలను దృష్టిలో
ఉంచుకునే మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు
నిర్ణయం తీసుకుంటే అది యావద్దేశ ప్రజలనూ
వంచించడమే అవుతుంది. నోట్ల రద్దు
అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ అన్న మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ మాటల్లో
ఆంతర్యం ఇదేనేమో!
నరేంద్ర మోదీ అసలు లక్ష్యాలు ఇవా కావా అన్న సంగతి పక్కనపెడితే, ఆయన తీసుకున్న నోట్ల
రద్దు చర్య వల్ల అంతిమంగా వస్తున్న ఫలితాలు మాత్రం అవే. కానీ నరేంద్ర మోదీ
ప్రభుత్వం మాత్రం ఈ బృహత్ తప్పిదాన్ని అబద్ధాల అద్దకంతో అలంకరించి అయిదు
రాష్ట్రాల ఎన్నికలలో ఓట్లు రాబట్టే అస్త్రంగా ఉపయోగించబోతున్నది. దానికి
తోడుగా సర్జికల్ స్ట్రయిక్స్ అనే మరో అబద్ధం వచ్చి కలుస్తున్నది. రెండు
నిర్ణయాలును రెండు అబద్ధాలను అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా ఉపయోగించడం ఇదే మొదటిసారి. ------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment