“
హిమాలయం ఎక్కుడుంది? అని
బడి బయట గాలిపటం ఎగరేసుకుంటున్న
పిల్లాడిని అడిగాను
అదిగో అదే అని వాడు పై పైకి ఎగురుతూ
పోతున్న
తన గాలిపటాన్ని చూపించాడు
హిమాలయం ఎక్కడుందో
నాకు మొదటిసారి తెలిసిందని ఒప్పుకోనా
మరి?”
అని ప్రముఖ హిందీ కవి దిగ్గజం కేదార్ నాథ్
సింగ్ అంటాడో కవితలో. నిజమే మనకేం తెలుసు? బహుశా కవిత లేదా రచన అంటే ఏమిటని
ఎవరైనా పిల్లాడిని అడిగితేనే కాని తెలియదనుకుంటా నా మట్టుకు నాకు.
అనాదిగా అదే సూర్యుడు అదే చంద్రుడు. అదే
చీకటి అదే వెలుగు. అదే ఏరు అదే నీరు. అదే చెట్టు అదే నీడ. అదే పిట్ట అదే గాలి. అదే
నింగి అదే నేల. యుగాల
పేగుల్లో ఊపిరి పోసుకుని ఒకరిగా
బయటకు రావడం. అనాది మానవ అనంత ఛాయా ప్రవాహంలో కలిసి వెళ్లిపోవడం అంతా అదే. రోజూ రాత్రి మరణం..ఉదయమే జననం. బతుకు
నిండా పునరుక్తే. ఆలంకారికులు పునరుక్తిని దోషమన్నారు కాని దీన్ని అలంకారంగా
మార్చుకోవడమే కవిత్వం లేదా రచన అనుకుంటా.
కవిత్వం లేదా రచన దేని మీద రాయాలి అన్ని విషయంలో నాకెలాంటి
ఊగిసలాటలులేవు. ఎలాంటి నిషేధాలూ లేవు. అయితే కవి లేదా రచన తన సామాజిక బాధ్యతను
కలలో కూడా విస్మరించకూడదన్నదే నా వాదన..నా నివేదన. సాధు జంతువులు జనం మీద విరుచుకుపడుతుంటే రచయిత లే పులల వేషం కట్టి అసహాయుల పక్షాన పంజా విసరాల్సిన
తిరకాసు కాలమొకటి వచ్చింది. ప్రశ్నించిన వాడి మనుగడే ప్రశ్న అయిన విచిత్ర
ఏలుబడి లో, ‘నిర్భయ ‘ భారత మంతా అక్షరాల కొవ్వొత్తులు నాటాల్సిన
సందర్బం ఏర్పడింది. అక్షర గర్భంలోనే ఆత్మహత్యకు పాల్పడే ‘పెరుమాళ్ మురుగన్’ ల
చేతుల్లో భరోసా బాంబులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నగరాల్లో
కల్బుర్గీలు..అడవుల్లో శ్రుతి రక్తధ్వానాలు.. బుల్ డోజర్లకు వేలాడు తున్న వేలాది
నిర్వాసిత గ్రామసమూహాలు..ఎన్నెన్ని తరుముతున్నాయి? కత్తుల రెక్కలతో ఎగురుతున్న ‘క్యాంపస్’
లు కనిపించడం లేదా..? చుక్కల
ఆకాశంలోకి ఎగరిపోతున్న విద్యార్థులను కాపాడుకోవడానికి గుండెల్ని పెకలించుకుని
అన్ని దిక్కులా కాపలా పెట్టాల్సిన అవరసంలో వున్నాం కదా..! ఒకపక్క శతాబ్దాల నుంచి మేసి మేసి ,అరిగినదంతా తిరిగి ఇవ్వాలంటే కళ్ళల్లోకి..
అదే కన్నీళ్ళల్లోకి ఆజా..ఆజా వాపస్ అజా ఆజా అంటుంటే ఏది ఆహ్వానమో..ఏది
ఆదేశమో..పిలిచేది చేతులో కత్తులో గుర్తెరిగిన కలాలు కావాల్సిన అనివార్య సందర్భాలు
కావా ఇవి? ఎలా?
కవులు రచయతలు ,ఈ అంశా
లను కళ్ళెత్తి చూడకుండా ఎలా వుండగలరు?
కవిత్వం లేదా రచన నాకెప్పుడూ ఒక మాయా వస్తువే. ఏది విశ్వజనీనమో
..ఏది తక్షణ ప్రాధాన్యమో..తత్కాల తాదాత్మ్యాలను కాలాతీతం ఎలా చేయాలో..ఎప్పుడూ
గందరగోళమే. మాయామేయ చలచ్చల
వర్తుల పరిభ్రమణంలో ఎటు నుంచి ఎటో పయనం తెలీని నా గందరగోళం నాది. కాని నాకో
చూపుంది. దానికెంత స్పష్టత వుందో చెప్పలేను కాని..చూడాల్సిందేదో చెప్పగలను.
రాయాల్సిందేదో రాసే తీరుతాను. ఒకరి ప్రాపకం కోసం కాదు అది నా జీవన వ్యాపకం
కాబట్టి.
నా
అంతర్ముఖీనత్వం, వయసురీత్యా
అనివార్యంగా చోటుచేసుకుంటున్న తాత్త్విక ధోరణులు, శిల్పం మీద మోజు నన్ను మరో వైపుకు
నెడుతూనే వుంటాయి. అయినా నా రక్తంలో కదలాడే నీడలు మనుషులే. వాటి పరిమళాలే..పలకరింపులే..పలవరింతలే
ఈ కవితలు లేదా రచనలు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment