Friday, April 21, 2017

చీకటి కోణాలని దర్శించే ‘తెగువ’ ఉన్నవారు మాత్రమె దీన్ని చదవటం మంచిది



చీకటి కోణాలని దర్శించే ‘తెగువ’ ఉన్నవారు మాత్రమె దీన్ని చదవటం మంచిది

చైతన్య స్రవంతి...  స్ట్రీం ఆఫ్ కాన్షియస్ ... ఆధునికత లో భాగంగా కాల్పనిక నవలా రచనలో ఇదొక ముఖ్య ప్రయోగంగా విమర్శకులు గుర్తించారు. ఈ తరహా సాహిత్యం అంటే .. ఒక పాత్ర మనసులో వచ్చే ఆలోచనా స్రవంతి, అది ఎలా వస్తే  అలాగా ఒక ప్రవాహంలా చిత్రించే రచనా పద్ధతి . మనిషి మెదడులో మెదిలే ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాల దొంతరలు, అడ్డూ అదుపు లేని అక్షరాల ప్రవాహం. మనసుకు ఏది తోస్తే అది , ఏది గుర్తుకు వస్తే అది, ఇలా ఒక లెక్చరర్ పాత్ర చెప్పే కథే ఈ ‘మంచుపూలు’ నవల. ‘కాశీభట్ల’  రాసిన ,ఒక విలక్షణ  శైలితో సాగిన ఈ నవల  నేను చదివాననడం కంటే చదివించింది అంటే సబబేమో..  ఇంకా చెప్పాలంటే ఆ మనసుతోఆ పాత్రతోఆ పాత్ర ఆలోచనలతోఆ అక్షర ప్రవాహంలో కొట్టుకొని ఝరిలో మనమూ పరుగెడ్తూ, అలసి సొలసి ఊపిరి తీసుకోకుండా నవల చివర అక్షరం వద్ద మాత్రమె ఆగుతాం. ఎప్పుడో కొన్ని సంవత్చరాల క్రింద ‘ఇండియా టుడే’ లో కాశీభట్ల గారి కథ వేరొకటి  చదివా. పేరు , కథ ఏది గుర్తు లేదు, గుర్తున్నదల్ల ఆ శైలి. అప్పడు అది చైతన్య స్రవంతి తరహా అని తెలీదు. ఆ తర్వాత నవీన్’ అంపశయ్య’ చదివాక దాని గొప్పదనం తెలిసింది. ఆ తరహా శైలి లో రాసిన ‘మంచుపూవు' నవల గురించి నా ఈ పరిచయం. కథ ఉత్తమ పురుషలో కొనసాగుతుంది.  ఇక ఈ రచన గొప్పతనమేంటంటే నవల మొదలు పెట్టాక అది ముగించేదాకా మనం లేవం.


  మన కథానాయకుడు ( ఎక్కడా అతని పేరు లేదు) భార్య కావేరి ఏడేళ్ళ క్రింద చనిపోతుంది. అప్పడు అతనికి ఒక కూతురు ప్రియ వయస్సు అయిదేళ్ళు. కథ ప్రారంభమయ్యే సమయానికి ఆ అమ్మాయి వయస్సు పన్నెండేళ్ళు. ఆ పాప లో అతనికి భార్య పోలికలు, భార్య అలవాట్లు అనుక్షణం కనపడుతూ వుంటాయి. అమ్మాయి రజస్వల అయి బాల్యం లో నుండి యవ్వనపు చాయలు సంతరించుకుంటుంటే ఇతనికి ఆ పాప ఒక మినిఏచర్  కావేరి లా కనిపించి అతని ఆలోచనల్లో విశృంఖలత, ఒక వాంఛ, అతన్ని అతలాకుతలం చేసి అతన్ని డిస్ట్రబ్ చేస్తుంటాయి. కావేరి చని పోయాక అతను పెళ్లి చేసుకోడు. ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కూతురు భార్య పోలికలతో ఎదురుగా కనపడి అనుక్షణం  కావేరి ని గుర్తు చేస్తూ చివరికి తనకు తెలీకుండానే ఆమెపై వాంఛ కల్గుతుంటుంది. చివరికి తన ఆలోచనల పట్ల తనకే రోత పుట్టి, ఒక తోడు కావాలని, ఎన్నో రోజులుగా మనసులో ఉన్న ప్రియ టీచర్, మల్లికని  పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరడంతో కథ ముగుస్తుంది.

మనిషి కుండే చేతన, అచేతన స్తితి ల గురించి, ఇవి సముద్రం మీద తేలుతూ వుండే ఐసు బెర్గ్ తో పోల్చి చెబుతారు. ఐస్ బెర్గ్ సముద్రం లో తేలుతూ వున్నప్పుడు పదింట ఒక వంతు మాత్రమె పైకి కనపడుతుంది. మిగతా తొమ్మిది వంతులు కనపడకుండా నీటిలో వుంటుంది. ఆ విధంగా చేతన (conscious) ను బట్టి మనకు తెలిసేది మనిషి మనస్తత్వంలో అతి స్వల్పభాగం మాత్రమె. మిగిలిన చాలా భాగం అచేతనలో ఉండి పోయి మనిషికి అంతు చిక్కకుండా ఉండి పోతుంది.చేతన లో ఉండేవి హేతువాదానికి, సామాజిక కట్టుబాట్లకి సంబంధించిన భావాలు. వీటికి అచేతనకి సంబంధం లేదు.అందులో వుండే కోర్కెలు హేతు వాదానికి గాని , సామాజిక నీతులకు గానీ సంబంధించినవి కావు. మనిషి యొక్క ఆదిమ కాలం నాటి వాంఛలన్నీ అందులో చోటు చేసుకుంటాయట  . ఇదంతా ఎందుకంటీ దీనిలో మన కథా నాయకుడి మనసులో కలిగే ఆలోచనలు అలాంటివే అనుకుంటా. ఎందుకంటే వావి వరసలు మరిచి పోయి ఒక తండ్రి కూతుర్ని వాన్చిచడం జరుగుతుందాఅస్సలు ఇదీ ఒక రచనేనా అంటే మనం రోజూ నిత్యం పత్రికల్లో చూస్తుంటాం. కూతుర్ని రేప్ చేసిన తండ్రి.  ఇలాంటివి ఎన్నో.  ఇలా మనసులో ఉన్నమనకే తెలీని  చీకటి కోణాలని   బయట పెట్టటమే రచయిత ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఇది మంచా చెడా దీన్ని మనం ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అన్నది  మీకే వదిలేస్తున్న.  ఈ నవలపై నేను ఎలాంటి అభిప్రాయం చెప్పబోవట్లేదు.  ముందు మాటలో గుడిపాటి గారు చెప్పినట్లు " మనిషి లోపలి ఇలాంటి పార్శాల్ని గురించి రాయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తారేమో. ఈ నవల అంతర్, బహిర్ ప్రపంచాల్లోని అలజడిని , సంక్షోభాన్ని,సంక్లిష్టతలని    చిత్రించింది.వీటిలోని వైరుధ్యాలున్నాయి, అన్నిటిని ఆమోదించలెం    , అన్నిటిని తిరస్కరించలెం  .కానీ మనం చూడడానికి ఇష్టపడని, అస్సలు మాట్లాడడానికి ఇచ్చగించని  వాస్తవాల్ని చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితపు చీకటి కోణాలపై ప్రసరించిన టార్చిలైట్ "మంచుపూవు". ఆ చీకటి కోణాలని దర్శించే తెగువ ఉన్నవారు మాత్రమె ఈ నవల లోకి వెళ్ళడం మంచిది.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card