“గుండెలోతుల భావాలు బయలుచేయు బాధ్యతల
అలసి సొలసి –
మనసు కన్న కలలు పంచుకొన పనిన మురిసి మురిసి”
“నిర్మాతల
ఒత్తిడికి, బాక్స్ ఆఫీసు సూత్రాలకి తలవంచకుండా, తాము
నమ్మిన విలువల ఆధారంగా, తమ పంధా విడువకుండా సినిమాలు తీసేవారు
ఇద్దరే ఉన్నారు. ఒకరు విశ్వనాథ్ మరొకరు ఆర్. నారాయణ మూర్తి.” మంచి సినిమాలు అంటే, చూస్తున్నంత సేపూ మాత్రమే ప్రేక్షకుడికి
వినోదం కలిగించి, సినిమా టికెట్ ధరకు
తగు మూల్యం చెల్లించేవి కావు. మంచి చిత్రాలు అంటే ప్రేక్షకుడి మనసును
కదిలించి కలకాలం గుర్తు ఉంచుకునేటట్టు చేసేవి,
తరతరాల ప్రేక్షకులను ఆకర్షించ
గలిగేవి. ప్రేక్షకులని సినిమాలో లీనం చేసి,
పాత్రల ఆశయాలు, కష్టసుఖాలు
తనవిగా అనుభూతిని కలిగించేవి మాత్రమే మంచి సినిమాలు. ఈ కోణంలో పరిశీలిస్తే
తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకుడిగా కె.విశ్వనాథ్ కలకాలం నిలిచి
ఉంటారు. ఆయన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకే కాదు దేశ, విదేశ సినిమా అభిమానులకి
కను విందు చేసాయి.
సినిమాలు అందవిహీనంగా
రసహీనంగా మారుతున్నాయని క్లాస్ పీపుల్ వగచు వేళ వాళ్లని కేటర్ చేసే
లక్ష్యాన్ని భుజాన వేసుకున్నవాడు కాశీనాధుని విశ్వనాథ్. గ్రామాల్లోని
వర్ణసంస్కృతిని ఉన్నతీకరించి చూపడం,
అప్పుడప్పుడే పట్నాలకు వలసపోయినవారి నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌ని సంతృప్తిపర్చడం అనే
రెండు లక్ష్యాలను భుజానికెత్తుకున్నవాడు విశ్వనాథ్.
అందరూ ఎవరి ధర్మాలు వారు పాటిస్తూ కలిసి
మెలిసి కాపురం చేసుకోవాలి. అది సప్తపది అయినా,
సూత్రధారులైనా, స్వయంకృషి అయినా, శుభసంకల్పం అయినా
చెప్పేది ఇదే. ఒకచోట అది యాదవులవ్వొచ్చు,
ఇంకొకచోట చెప్పలు కుట్టుకునే
దళితులవ్వవచ్చు, మరోచోట
జాలర్లవ్వొచ్చు. నువ్వు ధర్మమార్గమువల్ల
కానీ చదువువల్ల కానీ వ్యాపారంవల్ల
కానీ ఉన్నతుడవై బ్రాహ్మల సరసన చోటు
సంపాదించుకోవచ్చు. చదువు వల్ల ఉన్నతుడు
కావడం సూత్రధారుల్లోనూ, వ్యాపారం వల్ల
ఉన్నతుడు కావడం స్వయంకృషిలోనూ
కనపడుతుంది. ధర్మం అనేది అన్ని
సినిమాల్లోనూ అంతస్సూత్రంగా ఉంటుంది.
ధర్మమార్గమనేదానికి సంప్రదాయ
విధివిధానాలను పాటించు మార్గము అని ఇక్కడ
అర్థం. ఏం చేసైనా అన్ని చిన్నచిన్నపాయలు
వైదిక ధర్మమనే సముద్రంలో కలవాలి.
ఒక్క ముక్కలో ఇది సంస్కరణవాదంగా
కనిపిస్తూ భూస్వామ్య విలువలను ఉన్నతీకరించి
చూపే వ్యవహారం.
సంప్రదాయాన్ని
పరిరక్షించేబాధ్యతను ఒక తరాన్నించి మరో తరానికి అందించడం అనేది కూడా విశ్వనాథ్
సినిమాల్లో బలంగా కనిపించే అంశం. సాగరసంగమంలో సంప్రదాయాన్ని
పరిరక్షించే బాధ్యతను కమల్ హాసన్ నుంచి ఆయన శిష్యురాలు శైలజ తీసుకుంటుంది.
శంకరాభరణంలో సోమయాజులు నుంచి తులసి తీసుకుంటుంది. సంప్రదాయానికి
ప్రతీకలుగా ఆయన తీసుకున్న రూపాలు అంతరించిపోతున్న నృత్య సంగీత రీతులు.
వాస్తవానికి ఆ రూపాలు ఆరంభంలో బ్రాహ్మణేతరులవే అయినా 20వ శతాబ్ది తొలినాళ్లలో వాటిని వారు చిన్నచిన్న మార్పులతో ఓన్
చేసుకున్నారు. ఆ రకంగా అవి క్లాస్ కళారూపాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. గ్రామీణ
వాతావరణంలో క్లాస్ అంటే సాంస్కృతికంగా పైనున్నవారి వ్యవహారాలే. వాటిని
కేవలం నృత్య, సంగీత రూపాలుగా కాకుండా సంప్రదాయానికి సూచికలుగా ఎస్టాబ్లిష్
చేయడంలో అనితర సాధ్యుడు విశ్వనాథ్. అవి ప్రధానంగా కొందరికే పరిమితమయినా ఆ
కొందరు సంస్కృతీ సంప్రదాయాలను నిర్వచించగలిగిన స్థితిలో ఉన్నవారు. ఏ
రంగంలోనైనా ఆధిపత్య సంస్కృతే సంస్కృతిగా ఉంటుంది. అట్లా దానికొక యాంటిక్
వాల్యూ ఉంది. దాన్ని ప్రధానవనరుగా తీసుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పిన
వాడు విశ్వనాథుడు. అట్లా ఊరికే చెప్పదలుచుకున్నది చెప్పడం వల్ల
మాత్రమే గుర్తింపు రాదు. ఎలా చెప్పాలో తెలిస్తేనే వస్తుంది. ఆ టెక్నిక్
తెలిసినవాడు విశ్వనాథ్. మానవసంబంధాలు,అందులో ఉద్వేగాలు తెరపై శక్తిమంతంగా ఆవిష్కరించగల నేర్పరి. ఎంత నేర్పరి అంటే ఆయన భుజానకెత్తుకున్న విలువలను
వ్యతిరేకించే వారు కూడా సినిమా చూసి అరే భలే తీశాడే అనుకునేంత నేర్పరి. బాలచందర్,మణిరత్నంలాంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్. కాకపోతే బాలచందర్‌లో వ్యవస్థీకృత విలువలపై ధిక్కారం ఉంటుంది. విశ్వనాథలో సామరస్యం
ఉంటుంది. వరకట్నం లాంటి అందరూ ‘బాహాటంగా’ వ్యతిరేకించే సబ్జెక్ట్‌ని ముట్టుకున్నా విమర్శ కటువుగా
లేకుండా ఉండడం కోసం కామెడీ చేసి తేల్చేస్తాడు.
విశ్వనాథ్ సినిమా
గ్రామర్ తెలిసినవాడు. మౌనం విలువ తెలిసినవాడు. మాటల కంటే దృశ్యాలతో
ఎక్కువ మాట్లాడిస్తేనే అది శక్తిమంతంగా ఉంటుంది అని ఎరిగినవాడు. జయప్రద
వేరే వారి చిత్రాల్లో ఆ మాదిరి ‘మౌనమేలనోయి’ అంటే అది
బూతు అయిపోయేది. విశ్వనాథ్ ఎరోటికాగానే
మిగిల్చారు. సాధారణ మెలోడ్రామాగా
తేలిపోయే సీన్లు కూడా విశ్వనాథ్ చేతిలో
పడితే కళాత్మకతను సంతరించుకుంటాయి.
తల్లి ఆస్పత్రిబెడ్ మీద మరణిస్తూ ఉంటే
కుమారుడు పూనకం వచ్చినట్టు డాన్స్
చేయడం ఇంకొకరి చేతుల్లోనైతే
అభాసుపాలయ్యేది. ప్రత్యేకించి విలన్లు,హీరోలు
అంటూ ఎవరూ ఉండరని రెండూ మనమేనని
ధర్మసూక్ష్మం ఎరిగినవాడు విశ్వనాథ్.
సూత్రధారుల్లో కొద్దిగా విలన్ షేడ్
ఉన్నా అక్కడ ఆ పాత్రను సింపుల్‌గా
రిఫార్మం చేసి పడేస్తాడు. సామాజిక
స్థితిగతుల గురించి అవగాహన ఉన్న వారంతా
మంచి చెడూ వేర్వేరుగా ఉండవని
గుర్తిస్తారు. కాకపోతే నిజమైన మార్పును
కోరుకునేవారు ఆ మనిషి చెడుగా మారడానికి
ఉన్న పరిస్థితులను నిర్మూలిస్తే
తప్ప సమాజం మారదని అనుకుంటారు.
విశ్వనాథ్ లాంటివారు సున్నితంగా చెపితే కూడా మార్పు సాధ్యమని
నమ్ముతారు. ధర్మో రక్షతి రక్షిత: విశ్వనాథ్ సున్నితంగా కాకుండా కాస్త బండగా
చెప్పిన సందర్భం ఒక్కటే. అది స్వర్ణకమలం. అందులో వేద పండితులైన ఘనాపాఠిలకు
లౌకిక పరమైన ఆఫీసుల్లో తగిన గౌరవం ఇవ్వకపోవడంపై వెంకటేశ్ చాలా
ఆవేశపడతాడు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిన్నపాటి ఉపన్యాసం కూడా ఉంటుంది.
విశ్వనాథ్ కడుపు చించుకుని తన ఆక్రోశాన్ని తన అభిప్రాయాలను సూటిగా కోపంగా
చెప్పింది బహుశా ఇదే సందర్భంలోనేమో.
భారతీయ చలనచిత్ర అభివృద్ధికి కృషి
చేసినందుకు గాను ప్రముఖ దర్శకుడు,
పద్మశ్రీ ,కళా తపస్వి కే విశ్వనాథ్,2016 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే
పురస్కారాన్ని ఆయన అందుకోనున్న సందర్భంగా నా లాంటి వారందరి తరుపునా అబినందనలు
తెలుపుతూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను
‘నేను దాదా సాహెబ్ ఫాల్కే సినిమాల్ని
చూశాను.. విశ్వనాథ్‌గారి సినిమాలు చూశాను.. మీ పేరుతో దాదా సాహెబ్ ఫాల్కేకి అవార్డు ఇవ్వాలి..' అంటూ వర్మ వ్యాఖ్యానించడం గమనార్హం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment