Thursday, April 20, 2017

ప్రజలపై జీఎస్టీ ప్రభావం ఎలా వుంటుంది?



                 
ప్రజలపై జీఎస్టీ ప్రభావం ఎలా వుంటుంది?


ఇది, సరుకుల వర్గీకరణపై ఆధారపడి వుంటుంది. జీఎస్టీ కోసం సకల సరుకులను వాటి ధర స్థాయిని బట్టి ఐదుజీరో, 5, 12, 18, 28 శాతంశ్రేణులుగా వర్గీకరించాలని నిర్ణయించారు. ఈ వర్గీకరణ ఇంతవరకు జరగలేదు. సరుకుల అంతిమ వర్గీకరణ జీఎస్టీ అమలు తేదీ(జూలై 1)కి కేవలం ఒక రోజు ముందు మాత్రమే తెలుస్తుంది.
              జీఎస్టీ రేట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ సంయుక్త రేట్ల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటాయా అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజలపై జీఎస్టీ ప్రభావాన్ని నిర్ణయించే అంశమిది. ఉదాహరణకు మనరాష్ట్రం లో ఎరువులు ప్రస్తుతం 5 శాతం పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థలో ఎరువులు జీరో ట్యాక్స్ లో వుంచితే ఈ సరుకుపై పన్ను 5 శాతం కంటే తక్కువగా వుంటుంది. అలాకాకుండా 12 లేదా 18 శాతం పన్ను శ్రేణిలో వుంచితే ప్రజలు దానిపై చెల్లించవలసిన పన్ను 5శాతం కంటే అధికంగా వుంటుంది. ఈ వాస్తవం దృష్ట్యా, ప్రజలపై జీఎస్టీ ప్రభావం సరుకులవర్గీకరణపై ఆధారపడి వుంటుందనేది స్పష్టం.

              పేదలు, ధనికులు వినియోగించుకునే వస్తువులు విభిన్నంగా వుండడం కద్దు. ఉదాహరణకు ముతక వస్త్రాలు, సైకిళ్లను పేదలు, బ్రాండెండ్‌ గార్మెంట్స్‌, లగ్జరీకార్లను ధనికులు ఎక్కువగా వినియోగించుకుంటారు. ముతక వస్త్రాలు, సైకిళ్ళ విషయంలో జీఎస్టీ రేటు ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి పేదలపై ఆ ఏకీకృత పన్ను ప్రభావం ఆధారపడి వుంటుంది. అలాగే బ్రాండెడ్‌ గార్మెంట్స్‌, లగ్జరీకార్ల విషయంలో జీఎస్టీ రేటు ఎలా వుంటుందన్న దాన్నిబట్టి సంపన్నులపై దాని ప్రభావం ఆధారపడి వుంటుంది.
             జీఎస్టీ ప్రభావం రాష్ట్రానికీ, రాష్ట్రానికీ భిన్నంగా వుంటుంది. ఎలాగంటే కొబ్బరినూనె పై ఎక్సైజ్‌ డ్యూటీ వ్యాట్‌ల సంయుక్త రేటు ఉత్తరప్రదేశ్‌లో 4 శాతం కాగా, మధ్యప్రదేశ్‌లో 6 శాతంగా వున్నది. జీఎస్టీ వ్యవస్థలో ఈ సరుకును 5 శాతం పన్ను శ్రేణిలో వర్గీకరించారనుకోండి. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో కొబ్బరినూనె ధర మరింత వ్యయభరితమవుతుంది. ఎందుకంటే గతంలో 4 శాతం పన్నును చెల్లించిన వారు ఇప్పుడు 5 శాతం పన్నును చెల్లించవలసి వుంటుంది కదా. కాగా మధ్యప్రదేశ్‌లో కొబ్బరి నూనె చౌకగా లభిస్తుంది. గతంలో 6 శాతం పన్నును చెల్లించిన ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు 5 శాతం మాత్రమే చెల్లించవలసి వుంటుంది మరి. దీన్ని బట్టి జీఎస్టీ ప్రభావం, ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమల్లో వున్న పన్నురేట్లపై ఆధారపడి వుంటుంది.

            సామాన్య ప్రజలు వినియోగించే సరుకులను తక్కువ పన్ను రేట్ల శ్రేణుల్లో వర్గీకరించిన పక్షంలో దేశ జనాభాలో అత్యధికులకు జీఎస్టీ ఎంతైనా ప్రయోజనకరమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం  మనకు మేలు కలుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం
                         ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card