Wednesday, April 19, 2017

శృంగార శాఖా చంక్రమణం

శృంగార శాఖా చంక్రమణం
‘శృంగారం’ అంటే ఏమిటి?
‘శృంగారం’ ఎలా పుట్టింది?
‘శృంగారం’ సారాంశం ఏమిటి?’
వీటన్నిటి గురించి తనదైన శైలిలో ముళ్లపూడి వెంకట రమణ ‘శృంగార శాఖా చంక్రమణం’ అంటూ రాసుకొచ్చారు. బాపు చేతిరాతతో వచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలతో కాసేపు మన రొమాన్స్…
గ్రూచో మార్క్సు రాసిన హిస్టరీ ఆఫ్ మేన్‌కైండ్ గుర్తొచ్చింది -వినండి.
ఆదిమానవుడూ మానవీ ఒకరోజు గుహలోంచి బయటకొచ్చారు. దుంపలూ పళ్లూ చేపలు తెచ్చుకోడానికి బయలు దేరారు.
ఆహార నిద్ర భయ మైధునాలలో వాళ్లకి మొదటి మూడే తెలుసు. ఆడా మొగా తేడాలు కూడా అంతగా తెలీవు. కళ్లూ చెవులూ కాళ్లూ చేతులూ వగైరా ఎక్విప్‌మెంట్ ఇద్దరికీ సమానంగానే ఉంది -బొడ్డు కింద ఒక చోట తప్ప -కొంచెం అటూ ఇటూగా సమానంగానే ఉన్నారు.
ఆ ఒక్క తేడా గురించి చెప్పబోతూ ఒక సభలో వక్త -” దేరీజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మేన్ అండ్ ఉమన్” అని ఆరంభించాడు. ‘వైవా లా ద డిఫరెన్స్'(ఆ తేడాకి జిందాబాద్) అని అరిచాట్ట సభలోని ఒక ఫ్రెంచి శ్రోత-
సరే -ఆదిమానవులిద్దరూ గుహబైట నిలచి అటూ ఇటూ చూస్తుండగా కారు మబ్బులు మీద కురికాయి. చీకటి. చీకటిలో మెరుపులూ ఉరుములూ -దగ్గర్లోనే పెద్ద శబ్దంతో గుండెలదిరేలా అరడజను పిడుగులు పడ్డాయి. కుంభవృష్టిగా వర్షం.
ఇద్దరూ గుహలోకి పరుగెత్తి భయం కొద్దీ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు..కున్నారు..కున్నారు.. అలాగే ఉన్నారు… కొన్ని విఘడియల తరవాత చలి తగ్గింది.
అంతేకాదు. అంత చలిలోనూ చిరు చెమటలు పట్టాయి. కళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లు తూలిపోతోంది. ఈ భయం -తిండి కన్న నిద్ర కన్న బాగుందే అనుకున్నారు. వాన వెలిసింది.
మళ్లీ పిడుగులూ వర్షం ఎప్పుడొస్తాయీ అని ఎదురుచూడసాగారు. అవి వస్తే గుహలోకి వెళ్లి భయంతో వాటేసుకోవచ్చు.
చివరికి విసుగేసి బయట నిలబడి -‘వానా..రా! పిడుగూ..రా!’ అంటూ చప్పట్లు కొట్టారు. అదే ఆది తాళం.
చిందులు తొక్కారు. అదే ఆది నాట్యం.
అరిచారు. హోహో అన్నారు. ఢాం ఢాం తప తప అన్నారు.
ఆది శబ్దం ఆది సాహిత్యం.
కొన్నాళ్లకి వర్షం పడింది. వాళ్లు భయం నటించి గుహలో దూరి వాటేసుకున్నారు.
ఈ సారి వర్షం ఎడతెరిపి లేకుండా నాలుగు మాసాలు కురిసింది. భయపడి పడి వాళ్లకి విసుగేసింది.
ఇంక చాలు అని చప్పట్లు కొట్టారు.
ఇద్దరు పిల్లలు పుట్టారు.
సంభోగం మీద విరక్తిలోంచి సరికొత్త రక్తిలోకి సంతోషంలోకి మేలు కొన్నారు. అర్థవంతంగా సృష్టి సాగింది.
*** ఒక కవి రుషి స్వర్గానికి వెళ్లాడు. చాలా ఆత్రంగా ఉన్నాడు – “ఏం కావాలయ్యా” అని అడిగాడు ఇంద్రుడు. “రంభోగం” అన్నాడు రుషి.
“అంటే?”
“అదే స్వామీ -రంభతో” ….అంటూ సిగ్గుపడిపోయాడు.
“రంభా సంభోగం కుదించి రంభోగం అన్నావా! సెబాష్ కవీ.
ఆ తోటలోకి వెళ్లు రంభ వస్తుంది” -అన్నాడు ఇంద్రుడు.
తోటలోకి రంభ వచ్చి నిలుచుంది -మెకానికల్‌గా బట్టలు వూడదీస్తూ. కవి కవితావేశంతో పేట్రేగిపోయాడు.
ధన్యుడిని రంభాదేవి అన్నాడు దండం పెట్టి.
“అప్పుడే? ఇంకా”…
“అంటే నిన్ను చూసి ధన్యుడినయాను. నీ కళ్లు కలువ రేకులు. పెదిమలు దొండపళ్లు. కుచములు కుంభ స్థలములు. తొడలు అరటి బోదెలు. ఘనజఘనాలు ఇసుక తిన్నెలు” అంటుండగా రంభ బెదిరి చూసి దుప్పటి కప్పేసుకుంది. వాటితో పోలుస్తున్నావు కవీ -నా అంగాల కన్నా అవే అంత బాగుంటే వెళ్లి వాటినే వాటేసుకుని పండుకో అంటూ రంభ జంభారి యింటికి వెళ్లిపోయింది. స్వర్గానికి వచ్చిన అతిథుల కోసం పెట్టిన భేటీ కుదరకపోతే ఆనాటి రంభా సంభోగం ఇంద్రుడి కోటాలో పడుతుందిట.(దాన్ని మాత్రం శచీ దేవి అభ్యంతర పెట్టకూడదు -అది డ్యూటీ – బహ్వృ -చూడు)
“అయ్యో! శృంగారం కోసం నాలుగు పంక్తులంటే పొమ్మంటివా! ఈ ఉపమాన భంగం భరించలేను” అంటూ కాలుజారి పడ్డాడు కవి. సంభోగం అనేది కేవలం విధి నిర్వహణ అయినందువల్ల -రంభకి శృంగారం బొత్తిగా తెలీదు. అందుకని కవిగారు లొట్టలు వేస్తే అలా అపార్థం చేసుకుంది. కానీ స్వర్గంలో సంసారాలు చేసుకుంటున్న ఇతర దేవగణాలకూ – వారే యేమిటి -సాక్షాన్మహావిష్ణువుకూ శృంగారం అంటే ఎంతో సరదా కాని స్వర్గానికి అది అందుబాటులో లేదు.
అందుకే –
ఎల్లవేళలా భయభక్తులతో కాళ్లుపట్టే లక్ష్మీ దేవితో శృంగారం కొరవడి తనను కాళ్లతో తన్నే సత్యభామ శృంగారం కోరి, శ్రీ వైకుంఠ విరక్తుడై భూలోకానికి దిగివచ్చాడు. ఆయనే కాదు -ఎందరో దేవతలు, స్వర్గం చేరిన రుషులూ, ఊర్వశిలాటి అప్సరసలూ శాపాలు ఇప్పించుకుని మరీ భూ లోకానికి దిగి వచ్చారు ఉబలాటంతో.
*** శృంగారం అనగానే కామక్రీడల గొడవ అని రూఢర్థం ఏర్పడిపోయింది కాని చూడగలిగే వారికి అనేక విషయాల్లో శృంగారం భాసిస్తుంది.
వంటకోసం కూరలు తరగడం, తాళింపు సామాను అమర్చుకోడం…
వేయబోయే బొమ్మకోసం వచ్చే ఊహలు, వాటి ప్రకారం పెన్సిలుతో స్కెచెస్ వేసుకోడం…
పాటకు రాగాలు వెతుక్కోవడం… స్వరాలు అమర్చుకోవడం… మార్చుకోవడం కథకు వస్తువు, దానికోసం పాత్రలూ, వాటి వేష భాషలూ ఊహించుకోవడం…
ఇలా నిత్య జీవన వ్యాపారాలన్నిటా శృంగార దృష్టితో ఆలోచిస్తే జీవితం చాలా సరదాగా ఉత్సాహభరితంగా శోభిస్తుంది.
దేవుడిని ఆరాధించిన భక్తులు కూడా స్తోత్రాల్లాగా -నీకు నాలుగు చేతులున్నాయి మంచి మంచి నగలున్నాయి అని పొగడకుండా ఆయనకు భక్తి సంగతుల ద్వారా అనురాగంతో అర్చించి శోభించారు.
శృంగారం పరమార్థం సంతోషం; మోక్షం కాదు పుట్టినప్పటి నుంచి వేళయేదాకా సరదాగా బతకడం.ఇంకా కావాలంటే చదవండి 'శృంగార శాఖా చంక్రమణం'- ముళ్లపూడి వెంకటరమణ
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card