Wednesday, April 19, 2017

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?



డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?


డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతమవ్వడమనేది పన్నుల చెల్లింపుదారులతో పన్నుల నిర్వహణ యంత్రాంగం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుందనేదానిపై ఆధారపడివున్నది. ఇటీవల డిమానిటైజేషన్‌ ( పెద్ద నోట్ల రద్దు) లక్ష్య సాధనలో ప్రభుత్వం సఫలం కాలేదు. నల్లధనం కలవారికి బ్యాంకు అధికారులు సహకరించడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ బ్యాంకు ఖాతాలలో భారీ మొత్తాలను జమ చేసిన వారి నుంచి సామూహిక జరిమానా వసూలు చేసే ప్రయత్నాలలో కూడా ప్రభుత్వానికి అదే అనుభవం ఎదురయ్యే అవకాశం ఎంతైనావున్నది. తాము జమచేసిన సొమ్ముకు ఆధారాలేమిటో చెప్పాలని లక్షలాది బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పన్నుల నిర్వహణ అధికారులు నిజాయితీపరులైన ఖాతాదారుల నుంచి లంచాలు తీసుకోకుండా వుండడంతోపాటు నిజాయితీపరులు కాని ఖాతాదారుల నుంచి పన్నులను పూర్తిగా వసూలు చేసిన పక్షంలో ప్రభుత్వ నోటీసులకు సత్ఫలితాలు సమకూరుతాయి. నిజాయితీపరులైన వ్యాపారులు, అధికారులకు ముడుపులు చెల్లించేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవడంపైనే  తమ శక్తియుక్తులను వినియోగించవలసిన పరిస్థితిలో వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాయి?
  
                  ద్రవ్యలోటును యంత్రించగలిగితే విదేశీ మదుపుదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడం సుసాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు మన దేశంలో పెద్ద ఎత్తున మదుపు చేయడానికి ఆసక్తితోవున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో సరుకులకు గిరాకీ అపరిమితంగావున్నదని, వినియోగదారులను సంతృప్తిపరచడానికై కొత్త ఫ్యాక్టరీలను నెలకొల్పాలని బహుళజాతి సంస్థలు ఆరాటపడుతున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

                అయితే ప్రస్తుత పరిస్థితి ఇంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి స్తంభించిపోయింది. పైగా అభివృద్ధిచెందిన దేశాలు తమ కంపెనీలు తిరిగి స్వదేశానికి రావాలని కోరుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ద్రవ్యలోటును నియంత్రించినప్పటికీ, దాని వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం లేదు. ప్రస్తుతం వస్తున్న విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే మార్చి నెల అనంతరం తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనావున్నది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ద్రవ్యలోటు నియంత్రణ వల్ల ప్రభుత్వ వ్యయాలు తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ పురోగతి పూర్తిగా మందగిస్తుంది. సరిగ్గా ఇటువంటి కారణాలతోనే 1930లో అమెరికా ఆర్థిక వ్యవస్థను మహా మాంద్యం ఆవహించింది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card