Friday, September 14, 2018

మనం కడుతున్న పన్నులు వీళ్ల విలాసాల కోసమా !


కోర్టు హాలు కిక్కిరిసింది.
జడ్జి ఏం తీర్పు చెబుతారా అని అందరిలో ఉత్కంఠ.
'' మీరు ప్రస్తావించిన అంశాలు ఈ కోర్టు పరిధిలో లేవు !
అయినా సరే. నాకున్న అధికారాన్ని పురస్కరించుకొని
తీర్పు ఇస్తున్నా.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి
ఆహారం, నివాసం, ఉపాధితోపాటు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం
అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవి నెరవేర్చలేదని రుజువైనందున
ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చెయ్యాలని కేంద్రానికి సూచిస్తున్నా.
ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసిన ప్రభుత్వాన్ని
రీకాల్‌ చేసే అధికారం ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా

ఒక్కసారిగా కోర్టు హాలు హర్షధ్వానాలతో మారుమోగింది.
రాజేశ్వరి కళ్లల్లో ఆనందభాష్పాలు తొంగి చూశాయి.
....................................................
సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. రోడ్డు పక్కన ఏడుస్తున్న ఓ పసిపాప
అశ్వని ఇండస్ట్రీస్‌ అధినేత రాజేశ్వరి కంటపడింది. జాలేసింది.
డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పింది. వెళ్లి పాపను పలకరించింది.
ఎనిమిదేళ్లుంటాయి. మురుగు కాలువ దాటుతుంటే కాలుజారి పడింది.
పాప కాలికి వైద్యం చేయించి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది.
ఒకే గది ఉన్న రేకుల ఇల్లు. పాపకేమైందోనని
నర్సన్న దంపతులు పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు.
వాళ్ల వివరాలడిగింది రాజేశ్వరి.
నర్సన్న దంపతులు దగ్గర్లోని పొగాకు కంపెనీలో పనిచేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు
ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు.
యాజమాన్యం అక్కడ బోర్డు తిప్పేసి వేరే చోట పెట్టింది.
దీంతో పని పోయింది. రోజూ కూలికెళ్తున్నారు.
సిమెంటు ధరలు పెరిగాయని పనులు కూడా తగ్గిపోయాయి.
సగం పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.
నర్సన్నకు పాపతోపాటు మగపిల్లాడున్నాడు.
ప్రైవేటు స్కూల్లో ఫీజులు చెల్లించలేక ఇద్దర్నీ బడి మాన్పించారు.
వాళ్ల దుస్థితికి రాజేశ్వరి చలించిపోయింది.
తడిదేరిన కళ్లు తుడుచుకుంటూ '' మీ నాయకులేం చేస్తున్నారు !
ప్రభుత్వం ఏం నిద్దరోతుందా !'' అని అడిగింది.
''అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు ! ఓట్లేయించుకున్న నాయకులు
కంపెనీ వాళ్లకు ఊడిగం చేస్తున్నారు !
ఏం చెప్పమంటారు తల్లీ !'' అంటూ నర్సన్న వాపోయాడు.
అక్కడ నుంచి నర్సన్న దంపతులను తమ కంపెనీకి తీసుకెళ్లింది.
వాళ్లకు తగిన పని పురమాయించాలని మేనేజరుకు చెప్పింది.
పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది.
కంపెనీ లాయర్‌ని పిలిపించింది. '' మీరేం చేస్తారో నాకు తెలీదు !
సగటు మనిషి బతకడానికి ఇంత కష్టమైతే ఎలా !

మనం కడుతున్న పన్నులు వీళ్ల విలాసాల కోసమా !
కోటాను కోట్లు స్విస్‌ బ్యాంకుల్లో దాచుకోవడానికా!
ఒక్కో నాయకుడు.. అధికారి పది తరాలకు సరిపడా పోగేస్తున్నాడు !
ఈ పద్ధతి మారాలి ! ప్రజల ఓట్లతో గద్దెనెక్కి
వాళ్లనే పీల్చిపిప్పి చేస్తున్న దుర్మార్గులకు గట్టిగా బుద్ధి చెప్పాలి

నర్సన్న దంపతులను బాధితులుగా పేర్కొంటూ
నా పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేయండి !''
అని రాజేశ్వరి అడ్వొకేట్‌కు పురమాయించింది.
ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని
హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనేక వాయిదాలు...వాదోపవాదాలు.
ఎప్పటికప్పుడు ఆధారాలతో వివరాలు సేకరించి న్యాయస్థానం ముందుంచారు.
...................................
కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప ఛెళ్లుమనిపించింది.
కేంద్ర సర్కారు ఆలోచనలో పడింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు సిద్ధమవుతోంది.
అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్లాలని రాజేశ్వరి నిర్ణయంచుకుంది.
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
సగటు పౌరుల్లో ఆలోచన మొదలైంది.
- సామాజిక స్పృహతో ఆలోచించే వారికి ఈ కథ అంకితం

No comments:

Post a Comment

Address for Communication

Address card