ఒక ముసలి రాజుగారి దగ్గర ఒక పిట్ట ఉండేదట. అది
మనిషిలాగా మాట్లాడేదట. రాజుగారు దానికి ఓ బంగారు పంజరం చేయించి
శ్రద్ధగా సాకేవాడు. అది కోరిన కోరికల్లా తీర్చేవాడు. డెబ్భైరెండేళ్ళు
అలా కలిసి బతికారు వాళ్లు.
ఓసారి రాజుగారు దూరదేశం వెళ్లాల్సి వచ్చింది. మధ్యదారిలో
ఈ పిట్ట పుట్టినిల్లు
ఉంది. రాజుగారు
వెళ్తూ వెళ్తూ అడిగారు: " పిట్టా, మీ పుట్టినింటి మీదుగా వస్తాను, మీ వాళ్లకు నీ గురించి ఏమైనా చెప్పాలా?
" అని. " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది,
రావాలంటే వీలు
చిక్కటం లేదు " అని చెప్పమంది పిట్ట.
’సరే’నని
రాజుగారు ప్రయాణమయ్యారు. వెనక్కి వస్తూ పిట్ట పుట్టినిల్లు ఉండే
చెట్టు దగ్గర ఆగి బిగ్గరగా అరిచారు: " మీ చెల్లి మీగురించే రోజూ ఆలోచిస్తోంది,
రావాలంటే వీలు
చిక్కటం లేదు " అని. ఆ మాట వినగానే అక్కడి పక్షులన్నీ
నిశ్శబ్దం అయిపోయాయి. ఒక పిట్ట టప్పున క్రిందపడి గిలగిలా తన్నుకొని
నిశ్చేష్టం అయిపోయింది.
రాజుగారు నొచ్చుకున్నారు. వెనక్కి వచ్చి తన పిట్టకు ఈ సంగతి
చెప్పారు బాధగా. వినగానే
ఆ పిట్టకూడా నిశ్శబ్దం అయిపోయింది. టప్పున క్రిందపడింది. ఇక
కదలలేదు. రాజుగారికి
దు:ఖం వేసింది. పంజరంలోంచి దాన్ని బయటికి తీసి బాధగా కిటికీ దగ్గర పడుకోబెట్టారు.
మరుక్షణంలో అది ఎగిరింది. దూరంగా చెట్టుకొమ్మన వాలింది. బిగ్గరగా
ఇలా అన్నది:
" రాజా, నేను
ఇప్పుడు ఏం చేయాలో మా అక్క నాకు నీ ద్వారానే కబురంపింది. " అని.
రాజుగారు ఇంకా నొచ్చుకున్నారు. " నేను నిన్ను డెబ్భైరెండేళ్ళు గా సాకాను. ఇంకా
నువ్వు అసంతృప్తిగానే ఎందుకున్నావు? నువ్వడిగింది నేను ఏది ఇవ్వలేదు? ఇంకా నువ్వు నానుండి దూరంగా పోవాలనే
ఎందుకనుకుంటున్నావు? "
" డెబ్భైరెండేళ్ళు గా కోల్పోయిన
స్వాతంత్రంలోని ఆనందాన్ని సొంతగా చెట్టుమీద వాలిన ఈ ఒక్క క్షణంలో అనుభవిస్తున్నాను. రాజా,
స్వతంత్రప్రేమికి స్వాతంత్ర్యాన్ని
మించిన అవసరం వేరే ఏమీ లేదు. ఎన్నేళ్ళైనా సరే, ఆ జీవి స్వాతంత్ర్యంకోసం ఎదురుచూస్తూనే
ఉంటుంది." అని.
నిజమైన స్వాతంత్ర్యంకోసం మనం అందరం ఎదురుచూద్దాం, ఇంకా, ఇంకా.. ఆ పక్షిమాదిరి. మనందరి
కలలూ నిజం కాకపోవు, ఏదో
ఒకనాటికి.
ఈ ఆగస్టు నెల మనలో నిజమైన స్వాతంత్ర్యపుటాలోచనల్ని
రేకెత్తించాలని ఆశిస్తూ-
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment