Friday, August 10, 2018

పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ........


‘ జనాభా లెక్కల్నుంచి.. గణాంక వివరాల వరకూ, నీతి ఆయోగు ఫిగర్లు మొదలు.. వార్షికాంత నివేదికల పిల్లి మొగ్గల దాకా.. ఎప్పుడూ ఏవో తప్పులు.. తికమకలు.. తిరకాసులు! జెమినీ సర్కస్ ఆటల్ను మించిపోతున్నాయీ సర్కారీ నౌకర్ల ఫీట్లు!’ గవర్నమెంటు పన్లు బోలెడు గందరగోళంగా నడుస్తున్నాయి కదా....?.... ఈ మధ్య మరీను
‘ఈ కంప్యూటర్లొచ్చినప్పట్నుంచీ మేటర్ మరీ కాంప్లికేటెడ్ అయిపోయింది! ,అడంగళ్ళు,పట్టాదారు పాసు పుస్తకాలు లాంటి రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే కాదు,ఎమ్ సెట్ పేపర్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, మార్కుల షీట్లు, మార్కెట్ రేట్లు.. గెజిట్లో డేటాఫ్ బర్తుల్లాంటి ఇంపార్టెంట్ మేటర్లో కూడా.. ఎప్పుడూ ఏవో పొరపాట్లు!
జనాలకు అలవాటయింది కాబట్టి పట్టించుకొనే నాధుడెవ్వడూ కనిపించడం లేదుగానీ.. సూపర్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్లూ..కలెక్షన్ రిపోర్టులు , క్రికెట్ హీరోల ట్రాక్ రికార్డులూ.. లాంటివాటిల్లో గానీ తేడాలొస్తే చూడూ! పేడముద్దల్తో చాలా గొడవలయిపోతాయి! ‘
‘పేపర్లో చూసా! ముంబయిలో డబ్బావాలాలు ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా ‘సిగ్మా.. సిక్స్’ స్టాండర్డ్స్ సాధించేసార్ట!
‘సిగ్మా సిక్సా? అంటే?’
‘పది లక్షల పనులు చెస్తే అందులో కేవలం మూడుకి మించి మిస్టేకులు దొర్లకపోవడం! డబ్బావాళ్లు చేసే కోటిన్నర పన్లలో కేవలం ఒక్క పొరపాటే దొర్లుతున్నదని ఆ మధ్య ఇంటర్నేషనల్ మేగ్జైనేదో ఒకటి సర్వే చేసి మరీ సర్టిఫికేటిచ్చింది. చదువూ సంధ్యా లేనోళ్లు ఒక గుంపుగా తయారై కంప్యూర్లకన్నా కరెక్టుగా లక్షలాది భోజనం కారియర్లను వందల కిలోమీటర్ల దూరానున్న శివార్లనుండి సిటీలోకి టయానికి ఠంచనుగా చేరేస్తుంటారని విని అవాక్కయ్యా.
‘మన రాష్ట్రాల్లోకూడా అలాంటి టేలెంటు వున్నవాళ్ళు ఊరికి మినిమమ్ పదిమందుంటారు! ఉదాహరణకి పల్లెల్లో రజకులు ని తీసుకో! ఊరు మొత్తానికి మైలబట్టలు ఉతికే పని. రెండొందల గడప.. గడప గడపకీ పది శాల్తీలు! సగం గడపల్లో సగం మందైనా రోజుకొక్క జత ఉతుక్కి విసిరేసినా.. సుమారు వెయ్యిబట్టల తుక్కు తేలుతుంది ! వీటిలో మళ్లీ ఎన్ని వెరైటీలు! చీరలు.. ధోవతులు.. జాకెట్లు.. ప్యాంట్లు.. అంగీలు.. లుంగీలు! లోపలివి.. బైటివి! లోపాయకారీగా వాడుకొనేవి! చిరిగినవీ.. రంగులు పోయేవీ.. గుండేసి పేల్చినా డాగులు పోనివి! అన్నింటినీ ఇంటిటికీ తిరిగి మూటలు కట్టుకొని రేవులో ఉతికి .. ఆరేసి.. సాయంకాలానికల్లా మల్లెపువ్వులకు మల్లే మార్చేసి.. మళ్లీ ఎవరి తొడుగులు వాళ్లకి ఏ తేడా పాడా రాకుండా.. తడబడకుండా చేరవేస్తున్నారు! ఏళ్ల తరబడి ఏ తప్పులు లేకుండా సేవ చేస్తున్నారు! వాస్తవానికి ఇలాంటి వాళ్ల ‘ఆపరేషన్ వాషింగ్’ ముందర ఈ ‘సిగ్మా సిక్స్’ లెక్కలెన్నైనా బలాదూర్!’

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card